ఆంధ్రప్రదేశ్ రాజకీయం

హనీమూన్ పిరియడ్ లోనే తొందరపాటా…

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల యుద్ధంలో ఘోర పరాజయం తర్వాత మరో యుద్ధానికి సిద్ధం కావాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మళ్లీ శాసనసభ ఎన్నికలకు నాలుగున్నరేళ్ల సమయం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సైతం దాదాపు మరో ఏడాది సమయం ఉంది. ప్రస్తుతం ఎన్నికల సమయం కాకపోయినా ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపు నివ్వడం వెనుక జగన్ వ్యూహం ఏంటనేది ఆసక్తి రేపుతోంది. లడ్డూ వివాదంతో విలవిల్లాడుతున్న ఆయన డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టారా?యుద్దానికి సిద్దం అవ్వాలని వైసీపీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. వైసీపీ అనుబంధ సంఘాల నాయకుల సమావేశంలో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తికాక ముందే యుద్దం చేస్తానంటున్నారు. ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజల విశ్వాసం కూడా పొయిందని అంటున్నారు. నిజానికి ఏదైనా ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వానికి కనీసం సంవత్సరం అయిన టైమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వతా ప్రభుత్వం ప్రజల సరిగ్గా పట్టించుకోకపోతే ప్రశ్నిచాల్సిన బాధ్యత విపక్షాలపై ఉంటుంది.అయితే వైసీపీ అధ్యక్షుడు ఆరు నెలలు కాకమందే యుద్దం అంటుండటం వెనుక మతలబు ఏంటనే చర్చ సాగుతోంది.

వైసీపీ సీనియర్లు ఒక్కొక్కరు వైసీపీకి గుడ్‌బై చెబుతున్నారు. వలసలను నివారించడంలో జగన్ విఫలమయ్యారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు.. వారిని యాక్టివ్ చేసేందుకు జగన్ తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. లడ్డూ వివాదంతో జగన్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. దీని నుంచి బయటకు వచ్చేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.మరోవైపు ఇంకో ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికలకు కేడర్‌ను సిద్ధం చేసేందుకు జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వరదల సమయంలో ప్రభుత్వం వ్యవహారించిన తీరును, సహాయక చర్యలను రాష్ట్రం మొత్తం ప్రశంసిస్తే జగన్ మాత్రం ఇప్పటికీ విమర్శిస్తూనే ఉన్నారు.ఆరునెలలు కాకుండానే ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తూ.. వైఎస్ జగన్ తొందరపడుతున్నారేమే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పనితీరుపై ప్రజలు తీర్పునిచ్చేది ఎన్నికల సమయంలోనే. వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.

ప్రభుత్వ పాలన నచ్చకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన తీర్పునిస్తారు. కనీసం అప్పటివరకైనా జగన్ ఓపికపట్టి ఉంటే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇప్పటినుంచే ఆరోపణలు చేయడం ద్వారా.. ఆరు నెలల్లో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండదని.. విపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తుందనే అభిప్రాయం ప్రజల్లో కలిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఆ క్రమంలో రానున్న రోజుల్లో జగన్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందనేది చూడాలి.