bjp-tamil
జాతీయం రాజకీయం

ఉత్కంఠ రేపిన హర్యానాకమలం హ్యాట్రిక్...

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు టీ 20 మ్యాచ్‌ను తలపించాయి. పోస్టల్ బ్యాలెట్‌ లెక్కింపులో దూసుకెళ్లిన కాంగ్రెస్‌ ఒక్కసారిగా పడిపోయింది. ఈవీఎంలు లెక్కింపు తర్వాత వైకుంఠపాళీ ఆటలో మాదిరిగా ఒక్కో సీటు తగ్గుతూ వచ్చింది కాంగ్రెస్‌.
హర్యానాలో బీజేపీ దూసుకెళ్లింది.. మూడో సారి అధికారం చేపట్టే దిశగా కమలం పార్టీ అడుగులు వేసింది.. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ 50, కాంగ్రెస్ 35, ఇతరులు 5 స్థానాల్లో విజయం సాధించారు. చాలా చోట్ల బీజేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ కొనసాగుతోంది.. మధ్యాహ్నం అవ్వడంతో ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి.. హర్యానాలోని జులానా అసెంబ్లీ నియోజకవర్గంలో రెజ్లర్ వినేష్‌ ఫోగట్‌ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి యోగేష్‌కుమార్‌పై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వినేష్ ఫోగట్‌ గెలుపొందారు.. తొలి నుంచి లీడ్‌లో కొనసాగిన రెజ్లర్ వినేష్ ఫోగట్.. మధ్యలో వెనుకంజలోకి వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ పుంజుకొని విజయం సాధించారు.
హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 మంది సభ్యుల మద్దతు అవసరం.. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ఇప్పటికే మేజిక్ ఫిగర్ ను దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది.. అయితే.. చాలా నియోజకవర్గాల్లో నువ్వా నేనా అనేటట్లు పోటీ ఉండటంతో.. చివరి రౌండ్ వరకు ఉత్కంఠ నెలకొంది..ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌లతో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట్లో కాంగ్రెస్ దూసుకెళ్లింది. దాదాపు అరవైకిపైగా స్థానాల్లో ఆధిక్యం చూపించింది. ఈ దెబ్బకు బీజేపీకి 20 స్థాలైనా  వస్తాయా అన్న అనుమానం కలిగింది. కానీ 10 గంటల తర్వాత ఫలితాలు తారుమారు అవుతూ వచ్చాయి. అప్పటి వరకు విజయం దిశగా దూసుకెళ్తున్న కాంగ్రెస్ ఒక్కసారిగా పడిపోయింది. బీజేపీ సునామీ మొదలైంది. ఒకానొక దశలో ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదేమో అన్నట్టు ఫలితాలు వచ్చాయి. అయినా చివరకు బీజేపీ పై చేయి సాధించింది. యాభైకు పైగా స్థానాల్లో ఆధిక్యం చూపించి హర్యానాలో ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. హర్యానాలో మొదటి ట్రెండ్స్ చూసిన కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఏఐసీసీ కార్యాలయం వద్ద స్వీట్స్ పంచుకున్నాయి. బాణసంచా పేల్చాయి. వాళ్ల సంతోషం ఎంతసేపు నిలవలేదు. అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చేలా ఫలితాలు వస్తున్నాయి.  
కాంగ్రెస్ ఆరోపణలు.. స్పందించిన ఈసీ
కాగా.. హర్యానా ఫలితాలపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్రశ్నలు సంధించారు. లోక్‌సభ ఫలితాల మాదిరిగానే హర్యానాలో కూడా ఎన్నికల ట్రెండ్‌లను ఉద్దేశపూర్వకంగానే ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో షేర్ చేస్తున్నారని ఆయన అన్నారు. పరిపాలనపై ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియకు, ఫలితాల వెల్లడికి తేడా ఉందంటూ ఎన్నికల కమిషన్‌ తీరుపై పవన్‌ ఖేరా సైతం పలు ప్రశ్నలు సంధించారు.
కాంగ్రెస్ నేతల ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది.. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోందంటూ పేర్కొంది.. అభ్యర్థుల సమక్షంలోనే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొంది. కౌంటింగ్‌ ప్రక్రియ సవ్యంగా, పారదర్శకంగా ఉందని EC వివరించింది. ఏ కౌంటింగ్‌ కేంద్రం నుంచి తమకు ఫిర్యాదు రావడం లేదని తెలిపింది.
ఎగ్జిట్ పోల్స్ కూడా హర్యానాలో కాంగ్రెస్ వస్తున్నట్టు అంచనా వేశాయి. వివిధ సంస్థలు చెప్పిన ఎగ్జిట్ పోల్స్‌ను ఒక్కసారి పరిశీలిస్తే…
సంస్థ పేరు బీజేపీ కాంగ్రెస్ ఐఎన్‌ఎల్డీ జేజేపీ ఇతరులు
ధృవ రీసెర్చ్ 27 57+ – 0 6
సీ ఓటర్ 20-28 50-58 – 0-2 10-14
మాట్రీజ్ 18-24 55-62 3-6 0-3 2-8
పీపుల్స్ పల్స్ 26 (+/-7) 55 (+/-7) 2-3 – 4-6
దైనిక్‌ భాస్కర్ 15-29 44-54 1-5 0-1 6-9
న్యూస్‌ 24 చాణక్య 18-24 55-62 – – 2-5
టైమ్స్‌ నౌ 22-32 50-64 – – 2-8
జేఐఎస్టీ -టీఐఎఫ్‌ రీసెర్చ్ 29-37 43-53 0-2 0 4-6
ఒక దశలో పోలింగ్ జరిగిన హర్యానాలో 67.90% ఓటింగ్ నమోదైంది. 90 అసెంబ్లీ సీట్లు ఉన్న హర్యానాలో 46 సీట్లు సాధించిన వాళ్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు బీజేపీ ఆ మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసి ఐదారు సీట్లు అదనంగా సాధించేలా కనిపిస్తోంది.