ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తన సొంత నిధులు రూ.60 లక్షలు వెచ్చించి మరీ సహాయం చేశారు. తన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ కడప జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు ఆట స్థలం కొనుగోలు చేసి ఇచ్చారు.’బలమైన శరీరం ఉంటేనే.. బలమైన మనస్సు ఉంటుంది. బలమైన దేహదారుఢ్యం ఉంటేనే మానసికంగా మెరికల్లాంటి భావి తరాలు తయారవుతాయి. అలాంటి వారే దేశ సంపద అవుతారు. అయితే మెరికల్లాంటి భావితరాలను తయారు చేయడానికి అవసరం అయిన ఆట స్థలాలు పాఠశాలల్లో అందుబాటులో లేవు. మైసూరవారిపల్లి గ్రామ సభకు వెళ్లిన సమయంలో అక్కడ పాఠశాలకు ఆట స్థలం లేదని విద్యార్ధుల తల్లిదండ్రులు నా దృష్టికి తీసుకువచ్చారు. దసరా లోపు ఆట స్థలం ఏర్పాటు చేస్తామని మాటిచ్చాను. ఆ మాట మేరకు నా సొంత ట్రస్ట్ నుంచి రూ. 60 లక్షలు ఖర్చు చేసి మైసూరవారిపల్లి ప్రభుత్వ పాఠశాలకు ఆట స్థలం కొనుగోలు చేసి ఇచ్చానని’ ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
కడప జిల్లా మైసూరవారిపల్లిలో మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆట స్థలాలు లేని పాఠశాలల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించి ప్రతి పాఠశాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసే ప్రక్రియను సీఎం చంద్రబాబు నాయకత్వంలో ముందుకు తీసుకువెళ్తామన్నారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో రైల్వే కోడూరు నియోజకవర్గం, మైసూరవారిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు ఏర్పాటు చేసిన భూమిని అన్నమయ్య జిల్లా కలెక్టర్, రాజంపేట సబ్ కలెక్టర్ సమక్షంలో గ్రామ పంచాయతీకి బుధవారం రాత్రి అందజేశారు. పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ నుంచి రూ. 60 లక్షలు వెచ్చించి పాఠశాలకు సమీపంలో ఎకరం స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ స్థలాన్ని మైసూరవారిపల్లి గ్రామ పంచాయతీ పేరిట డిప్యూటీ సీఎం రిజిస్ట్రేషన్ చేయించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఆగస్టులో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించిన సమయంలో మైసూరవారిపల్లి గ్రామ సభలో స్వయంగా పాల్గొన్నాను.
ప్రభుత్వ పాఠశాలకు ఆట స్థలం లేదు అని, భూమి కేటాయించాలని విద్యార్ధుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వినతిపత్రం ఇచ్చారు. కానీ మైసూరవారిపల్లికి సెంటు ప్రభుత్వ భూమి కూడా లేదు. మన పిల్లలు దృఢంగా తయారు కావాలి. చదువుకోవాలి. మానసికంగా ఎదగాలని కోరుకుంటాము. పాఠశాలల్లో పరిస్థితులు చూస్తే అగ్గిపెట్టె ల్లాంటి గదుల్లో పెట్టేస్తాం. ఆడుకోవడానికి ఆట స్థలాలు కూడా లేక పిల్లలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. నేను రాజకీయాల్లోకి రాక ముందే ఎన్జీవోగా ‘పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్’ పేరిట ఓ ట్రస్టు మొదలు పెట్టాను. అవసరం ఉన్న చోట చదువుకునే విద్యార్ధులకు సాయం చేయడం, విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించడం దాని ఉద్దేశం. అయితే మైసూరవారిపల్లి పాఠశాల కోసం స్థలం అడిగితే ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ప్రాథమిక వైద్య శాల కోసం మాత్రం కారుమంచి నారాయణ స్థలం ఇస్తానన్నారు. ఆట స్థలం కోసం రూ. 20 లక్షలు సొంత ట్రస్ట్ నుంచి ఇస్తానన్నాను.
మిగిలిన మొత్తం దాతల సహకారం తీసుకోవాలని చెప్పాను. దసరా లోపు ఆట స్థలం ఏర్పాటు చేస్తామని గ్రామ సభలో మాటిచ్చాము. అయితే ఆట స్థలం వ్యవహారంలో ముందుకు వెళ్లలేకపోతున్న విషయాన్ని అధికారులు తెలిపారు. దాంతో రూ. 60 లక్షలు సొంత ట్రస్టు నుంచే ఇచ్చేయాలని నిర్ణయించా. ఆట స్థలం కోసంపగడాల పద్మావతి భూమిని గుర్తించాము. ఆమె కూడా పిల్లల కోసం విక్రయించేందుకు ముందుకు రావడంతో కొనుగోలు చేసి పిల్లల కోసం ఆట స్థలం సమకూర్చాము” అన్నారు. మైసూరవారిపల్లి ప్రభుత్వ పాఠశాల ఆట స్థలం కోసం భూమి విక్రయించిన పగడాల పద్మావతిని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా సత్కరించారు. పాఠశాల విద్యార్ధులకు క్రికెట్ కిట్లు, వాలీ బాల్, ఫుట్ బాల్, చెస్ బోర్డు తదితర క్రీడా పరికరాలు రెండు సెట్లు బహూకరించారు.
విద్యార్ధులు, స్థల విక్రేతలతోపాటు ఆట స్థలం ఏర్పాటుకు సహకరించిన పార్టీ నాయకులు, అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, రాజంపేట సబ్ కలెక్టర్ నిదియా దేవి, మైసూరవారిపల్లి సర్పంచ్ కారుమంచి సంయుక్త, స్థల విక్రేతలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.