కోర్టు ధిక్కరణ కేసులకు రూ.58 కోట్ల విడుదలపై విచారణ
సీఎస్ వివరణపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
కోర్టు ధిక్కరణ కేసులకు సంబంధించి విడుదల చేసిన నిధులపై సీఎస్ సోమేశ్ కుమార్ ఇచ్చిన వివరణపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ నిధులు కోర్టు ధిక్కరణ కేసుల కోసం కాదని, భూసేకరణ పరిహారం చెల్లింపునకని కోర్టుకు సీఎస్ తరఫున అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ తెలిపారు. కోర్టును పిటిషనర్ తప్పుదోవ పట్టించారన్నారు. నిధుల విడుదలను ఆపాలన్న ఆదేశాలను వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అయితే, జీవోను ప్రస్తావించిన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మీరిచ్చిన జీవో ఏంటి? ఆ ఉత్తర్వుల్లో రాసిందేంటి? ధిక్కరణ కేసుల కోసమే అన్నట్టుగా జీవో రాశారు కదా. ఆ జీవోను న్యాయ శాఖ కూడా ఒకసారి చూడాలి కదా?’’ అని అసహనం వ్యక్తం చేసింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. రూ.58 కోట్ల నిధులను కేవలం కోర్టు ధిక్కరణల కేసుల కోసమే విడుదల చేయడంపై తెలంగాణ ప్రభుత్వంపై నిన్న హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అన్ని కోట్లు ఎలా ఖర్చు చేశారంటూ నిలదీసింది. సీఎస్, పలు శాఖలకు నోటీసులును జారీ చేసింది. ఈ క్రమంలోనే సీఎస్ ఇవాళ వివరణ ఇచ్చారు.