వచ్చే నెలలో జరుగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేయడంపై బీఆర్‌ఎస్ పార్టీ మౌనం పాటిస్తుంది. జాతీయస్థాయిలో ఎదగడం కోసమే పేరు మార్చుకున్న బీఆర్‌ఎస్ పార్టీ, సొంత రాష్ట్రంలో అధికారం కొల్పోపోవడంతో అంతర్ రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. 2023లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా పార్టీగా పేరు మారింది. ఆ తర్వాత జాతీయ స్థాయిలో సత్తాచాటాలని మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిస్సా, బీహార్ రాష్ట్రాలలో బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పర్యటించి అక్కడ కూడా పార్టీ శాఖలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆయన మహారాష్ట్రపై ఎక్కువ దృష్టి పెట్టారు. నాగపూర్, సోలాపూర్, నాందేడ్ ప్రాంతాలలో పార్టీ కార్యాలయం కూడా ప్రారంభించారు. కొన్ని ప్రాంతాల్లో ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనల నుంచి పలువురు నాయకులు బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్‌ఎస్ మహారాష్ట్రలో 4 భారీ బహిరంగ సభలు నిర్వహించింది. మహారాష్ట్రలో బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోయిన కానీ ప్రధాన పార్టీలకు ఎంతో కొంత పోటి ఇస్తుందని అంతా భావించారు.
అప్పట్లో మహారాష్ట్ర నుంచి కొంతమందికి రాష్ట్ర ప్రభుత్వంలో పోర్ట్‌ఫోలియో ఉన్న బాధ్యతలు కూడా అప్పజెప్పారు. అదిలాబాద్ నిజామాబాద్ ఎమ్మెల్యేలకు నాందేడ్‌తో పాటు తెలంగాణకు ఆనుకొని ఉన్న మహారాష్ట్ర ప్రాంతాలకు ఇంఛార్జ్‌లుగా నియమించారు. ఇక అన్ని సిద్ధం చేసుకున్నా తర్వాత ఎన్నికల రంగంలోకి దూకడమే ఆలస్యం అనుకున్న సమయంలో తెలంగాణలో బీఆర్‌ఎస్ దెబ్బతినడంతో కేసిఆర్ వ్యూహాలు తలకిందులయ్యాయి. అప్పటి నుంచి ఆయా రాష్ట్రాల్లో ఉన్న శాఖల బాధ్యులు, నాయకులు ఒక్కొక్కరిగా రాజీనామా చేయడం మొదలుపెట్టారు. పార్టీ కార్యాలయాలకు కూడా రావడం లేదు. కేసీఆర్ కూడా ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలపై దృష్టిపెట్టడం తాత్కాలికంగా ఆపివేసినట్లు చర్చ జరుగుతుంది.
తాజాగా మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అందరి దృష్టి మళ్లీ బీఆర్‌ఎస్‌పై పడింది. గతంలో హడావుడి చేసిన పార్టీ ఇప్పుడు ఎవరికైనా మద్దతిస్తుందా… లేక తెలంగాణ బోర్డర్‌లో ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందా… అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కానీ బీఆర్‌ఎస్ పార్టీ వైపు నుంచి మాత్రం ఎలాంటి సమాధానం రావడం లేదు. పూర్తిగా తెలంగాణపై దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీచేస్తుందా? లేదా అనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా రాణించాలని అనుకున్నా బీఆర్‌ఎస్ పార్టీకి ప్రస్తుతానికి బ్రేక్ పడ్డట్లే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.