జాతీయం రాజకీయం

దక్షిణాది కేంద్రంగా ప్రియాంక రాజకీయాలు

కాంగ్రెస్ పార్టీలో వారసులు కీలక బాధ్యతలు పంచేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఉత్తరాది బాధ్యతను రాహుల్ గాంధీ తీసుకుంటున్నారు. దక్షిణాది బాధ్యతను ప్రియాంక గాంధీ చేపట్టబోతున్నారు. కేరళలోని వయనాడ్ ఉపఎన్నికల బరిలో ఆమె నిలబడాలని నిర్ణయించుకున్నారు. పార్టీ కూడా అంగీకరించింది. ఇంత కాలం కుటుంబబాధ్యతల కారణంగా నేరుగా ఎన్నికల బరిలోకి దిగడానికి వెనుకాడుతూ వచ్చారు. వరుసగా మూడో సారి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇక ఆమె కూడా నేరుగా రంగంలోకి దిగాల్సిన అవసరం ఏర్పడింది. ప్రియాంక కూడా రెడీ అయ్యారు. రాజీవ్ గాంధీ కుమార్తె రూపు రేఖల్లో ఇందిరాగాంధీలా ఉండే ప్రియాంకా గాంధీకి దేశవ్యాప్తంగా క్రెజ్ ఉంది.  చాలా కాలంగా ఆమె పరోక్ష రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారాలు చేస్తున్నా నేరుగా ఎన్నికల బరిలోకి ఎప్పుడూ దిగలేదు. తాజాగా వాయనాడ్ ఉప ఎన్నికల బరిలో దిగాలని ప్రియాంక నిర్ణయించుకున్నారు.  కాంగ్రెస్ పార్టీ కూడా టిక్కెట్ ప్రకటించింది. కేరళలోని అద్భుతమైన ప్రకృతి టూరిజానికి కేంద్రమైన వాయనాడ్ లో ముస్లింల ప్రాబల్యం అధికం. అక్కడ గత రెండు సార్లు రాహుల్ గాంధీ గెలిచారు.

ఈ సారి ఆయన సోనియా ఖాళీ చేసిన రాయ్ బరేలీ నుంచి కూడా  గెలవడంతో వాయనాడ్ వదులుకున్నారు.   ప్రియాంక గాంధీకి రాజకీయ ఆరంగేట్రానికి అది సేఫ్ సీటుగా భావించారు.  వాయనాడ్ లో ప్రియాంక గాంధీ గెలవడం  పెద్ద విషయం కాదు. దేశం అంతా మిత్రపక్షాలుగా ఉన్న కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కేరళలో మాత్రం ప్రత్యర్థులు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ వాయనాడ్‌లో వరుసగా గెలుస్తూ వస్తోంది. పోటీ చేసిన రెండు సార్లు దాదాపుగా నాలుగు లక్షల మెజార్టీని రాహుల్ గాంధీకి ఇచ్చారు అక్కడి ప్రజలు. ఈ సారి ఉపఎన్నికల్లో కూడా ప్రియాంకా గాంధీనే విజయం సాధించే అవకాశం ఉంది.  అయితే ఎంపీ అవడం ప్రియాంకా  గాంధీకి పెద్ద విషయం కాదని.. అంతకు మించిన  మిషన్‌తోనే ఆమె దక్షిణాదిలో అడుగు పెడుతున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.వాయనాడ్ నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత  దక్షిణాది మొత్తం కాంగ్రెస్ పార్టీని చక్కదిద్దుకునే ప్రయత్నాలను ఆమె చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీకి దక్షిణాది చాలా ముఖ్యం.  

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగోసారి ఓడిపోకుండా ఉండాలంటే కర్ణాటక, తెలంగాణలో పార్టీని చక్కదిద్దుకోవాలి. ఏపీలో వచ్చిన అవకాశాల్ని వినియోగించుకోవాలి. కర్ణాటకలో అంతర్గత కుమ్ములాటలతో ఆ  పార్టీ ఇబ్బంది పడుతోంది. తెలంగాణలో అంది వచ్చిన అవకాశాన్ని నిలబెట్టకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి రావొచ్చు. కేరళలోనూ కాంగ్రెస్‌కు ఆమె స్టార్ లీడర్ గా ఉంటారు. వయనాడ్ ఎంపీ హోదాలో ఇక ప్రియాంక ఆ ప్రయత్నాలు చేస్తారని అనుకోవచ్చు. కాంగ్రెస్‌  మరో సారి ఢిల్లీలో అధికారంలోకి రావాలంటే ప్రియాంకా గాంధీ ప్రయత్నాలు కూడా కీలకమే.