తెలంగాణ రాజకీయం

ధర్టీ ఇయర్ ఇండస్ట్రీకి కష్టకాలం తప్పదా

ఎంత పనైపోయింది అధ్యక్ష. పెద్ద కుర్చీలో కూర్చుని.. గులాబీ దళపతితోనే లక్ష్మీ పుత్రుడని పిలిపించుకున్న పోచారానికి…సొంత నియోజకవర్గంలో కుంపటి కాకపుట్టిస్తోంది. బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు హవా నడిపించిన మాజీ మంత్రి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. కాంగ్రెస్‌లో కూడా అదే రేంజ్‌లో రాజకీయాలు నడిపిద్దామంటే పప్పులు ఉడకడం లేదట. దీంతో గత కొంతకాలంగా రగిలిపోతున్న పెద్దాయన… ఓ మాట అనేస్తే పోలా..అందరూ సైలెంట్ అయిపోతారని స్కెచ్ వేశారట.ఇంకేముంది తనకు కళ్లలో నలుసులా మారిన అసమ్మతి నేత, బాన్సువాడ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి మీద బాణం ఎక్కుపెట్టారు. అయితే అది కాస్త రివర్స్ అయి పోచారం వైపే దూసుకువస్తుండటంతో ఇప్పుడు పెద్దాయనకు ఏం చేయాలో పాలు పోవడం లేదట. అంతేకాదు మరో కొత్త బాణం బీఆర్ఎస్ నుంచి కూడా పోచారం వైపే దూసుకువస్తుండటంతో పెద్దాయనకు దిక్కుతోచడం లేదట. తానేదో అనుకుంటే ఇంకోదే అయిందని పరేషాన్‌లో పడిపోయారట మాజీ శాసనసభాపతి బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి తర్వాత హస్తం గూటికి చేరారు.

అప్పటికే కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిన ఏనుగు రవీందర్‌రెడ్డి బాన్సువాడ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్నారు. దీంతో ఏనుగు రవీందర్రెడ్డి చెప్పినట్లే అధికారులు నడుచుకుంటున్నారట. బదిలీలు, పనులన్నీ ఆయన కనుసైగల్లోనే జరుగుతున్నాయట. ఎన్నో ఏండ్లుగా బాన్సువాడను శాసించిన పోచారంకు ఇది మింగుడు పడటం లేదట. అధికారులు మాజీ ఎమ్మెల్యే మాటకే విలువ ఇస్తుండటంతో దీనికి ఎలాగో ఒకలా చెక్ పెట్టాలనుకున్న పెద్దాయన ఓ మాట అనేశారు.ఏనుగు రవీందర్ రెడ్డికి బాన్సువాడతో సంబంధమే లేదని.. ఏకంగా సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ లే తనకు చెప్పారని చెప్పుకొచ్చారు. అధిష్టానం దగ్గర తన మాటే నడుస్తుందన్నట్లుగా ఈ డైలాగ్‌తో తనను పట్టించుకోని అధికారులకు, నేతలకు, కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు పోచారం.దీంతో రంగంలోకి దిగారు నియోజకవర్గం ఇంఛార్జీ ఏనుగు రవీందర్రెడ్డి. పోచారం వ్యాఖ్యలకు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తానెందుకు నియోజకవర్గాన్ని వదిలిపెట్టి వెళ్లాలంటూ ప్రశ్నించారు.

తనకు అధిష్టానం ఏమీ చెప్పలేదని.. నియోజకవర్గానికి రావొద్దంటూ తనకెవరైనా చెప్పినట్లు పోచారం ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు ఏనుగు రవీందర్ రెడ్డి. అంతేకాదు పది మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారని…మరి ఆయా నియోజకవర్గాల్లోని ఓడిన నేతలంతా నియోజకవర్గాలను వదిలి వెళ్లాలా అంటూ పోచారంను మరింత చిక్కుల్లోకి నెట్టారు ఏనుగు.అధిష్టానం నిజంగానే ఏనుగు రవీందర్‌రెడ్డికి నియోజకవర్గానికి దూరంగా ఉండాలని చెప్పిందా.. లేక పోచారం ఊరికే తానే బాన్సువాడ బాస్ అని చెప్పుకునేందుకు బాంబ్ పేల్చారా అన్న చర్చ మొదలైంది. సిచ్యువేషన్‌ను తన కంట్రోల్ లోకి తెచ్చుకునేందుకు పెద్దాయన స్కెచ్ వేస్తే.. అది ఆయనని మరింత చిక్కుల్లోకి నెట్టిందనే టాక్ నియోజకవ్గంలో నడుస్తోంది.ఈ ఇద్దరి గోల ఇలా కొనసాగుతుండగానే సీన్ లోకి బీఆర్ఎస్ ఎంట్రీ ఇచ్చింది. పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌ను కార్నర్ చేస్తూ..మాజీమంత్రి హరీశ్‌రావు ఎక్స్‌లో చేసిన పోస్టు మరింత దుమారం రేపుతోంది.

బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచిన పోచారం కాంగ్రెస్‌లోకి వెళ్లానని…తనకు తానే ఒప్పేసుకున్నారంటూ ఆయన మాటలను ట్యాగ్ చేస్తూ హరీశ్‌ విమర్శలు గుప్పించారు. పార్టీ ఫిరాయించినందుకే పోచారంకు వ్యవసాయశాఖ సలహాదారు పదవి ఇచ్చారా అంటూ కార్నర్ చేశారు. దీంతో పోచారం పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా అయిపోయిందట.తానొకటి అనుకుంటే ఇంకోటి అయిందని గొనుక్కుంటున్నారట. ఇలా ఇరుక్కు పోయానేంటని మదన పడుతున్నారట. ఇప్పటివరకు ఏనుగు రవీందర్ రెడ్డితోనే తలనొప్పి ఉందంటే ఇప్పుడు బీఆర్ఎస్‌కు కూడా దొరికిపోయానేంట్రా అంటూ తలపట్టుకుంటున్నారట. ఈ వ్యవహారానికి కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి ముగింపు ఇస్తుందో చూడాలి.