జాతీయం రాజకీయం

ఇండియా కూటమికి మోది స్ట్రాంగ్ మేసేజ్

కేంద్రంలో మూడవసారి వరసగా ప్రధాని సీట్లో కూర్చోవడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అది ఒక రికార్డు, ఇండియన్ పాలిటిక్స్ ని చూసిన వారికి అధ్యయనం చేసిన వారికి ఇది ఒక వండర్ అని కూడా చెప్పాలి. ఎపుడో గాంధీల కుటుంబం నుంచి వరసగా ప్రధానులు అయ్యారు అంటే ఆ రోజులు వేరు. ఆ రాజకీయాలు వేరు. ఆ పరిస్థితులు వేరు. అప్పట్లో భారతదేశంలో సామాజిక పరిస్థితులు కూడా వేరు.  కానీ ఈ సోషల్ మీడియా యుగంలో ఒక మనిషిలోనే వంద అలోచనలు ఉన్న వేళ ఎన్నో ఆశలతో ప్రతీ వారూ ఉంటున్న వేళ పాలిటిక్స్ అంటేనే పవర్ అన్నది పూర్తిగా ఒక ఒపీనియన్ ఏర్పడిన తరువాత కుర్చీ కోసం ఏమైనా చేయవచ్చు అన్నది ఒక సెటిల్డ్ స్టేట్మెంట్ గా మారిన వేళ మోడీ మళ్ళీ ప్రధాని కావడం అంటే అద్భుతం అనాల్సిందే. దేశంలో 143 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వారిలో ఏ కోటానుకోట్ల మందిలో ఒకరికి ప్రధాని అయ్యే చాన్స్ వస్తుంది. అది కూడా ఒక్క రోజు సీటు ఎక్కినా జన్మ ధన్యమే అనుకునే వారు ఉన్నారు.

ఆ టైం లో ఏకంగా పదేళ్ళ పాటు భారత్ వంటి విభిన్న దృక్పధం కలిగిన దేశాన్ని ఏలడం మరో సారి ఆ చెయిర్ లోకి రావడం మోడీకి మాత్రమే సాధ్యమైన టాస్క్. దానికి గాను ఆయన నమ్ముకున్నది ఎన్డీయే మిత్రులను. మోడీ ప్రధాని అయ్యాక ఎన్డీయేని పక్కన పెట్టారని పట్టించుకోవడం లేదని వచ్చిన అనేక ఆరోపణలకు విమర్శలకు తాను థర్డ్ టైం ప్రధాని కావడం ద్వారా మోడీ చెక్ పెట్టేశారు. ఇక మోడీ ప్రధానిగా ఎన్నాళ్ళు ఉంటారు అని ఆయన గద్దెనెక్కిన మరుసటి రోజు నుంచే ప్రచారం మొదలైంది.  జోస్యాలు చెప్పేవారూ అధికం అయ్యారు. కూలిపోయే ప్రభుత్వం అంటున్న నేపథ్యం ఉంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ ని చూపించి ఎన్డీయే స్థిరత్వం మీద డౌట్లు పెంచే వారూ ఉన్నారు. ఇక హర్యానా జమ్మూ కాశ్మీర్ లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వస్తాయని దాని తరువాత కేంద్రంలో భారీ రాజకీయ కుదుపు ఉంటుందని కూడా ఊహించారు. అయితే కాశ్మీర్ లో ఓడినా గతం కంటే సీట్లూ ఓట్లూ ఎక్కువ తెచ్చుకుని బీజేపీ తన ఆశలని అక్కడ సజీవం చేసుకుంది.

ఇక ఓటమి తప్పదు అనుకున్న హర్యానాలో వరసగా మూడోసారి గెలిచి రాజకీయ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో ఎక్కడైతే ఇండియా కూటమికి షాక్ తినిపించి థర్డ్ టైం పవర్ దక్కించుకుందో అక్కడే ఎన్డీయే మిత్రులతో మోడీ ఒక కీలక భేటీని ఏర్పాటు చేశారు.  ఈ భేటీకి ఎన్డీయేకు చెందిన 13 మంది ముఖ్యమంత్రులు అలాగే 16 మంది ఉప ముఖ్యమంత్రులు కీలక నేతలు హాజరయ్యారు. ఎన్డీయే మిత్ర పక్షాలకు చెందిన కేంద్ర మంత్రులు కూడా అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ దేశంలో పేదలు బడుగుల అభివృద్ధి కోసం ఎన్డీయే పనిచేస్తోందని అన్నారు. ఎన్డీయే పాలన ద్వారా అన్ని వర్గాలకు సాధికారత కల్పిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశం ద్వారా ఎన్డీయే ఐక్యతను మోడీ చాటినట్లు అయింది. అంతే కాదు ఎన్డీయే పటిష్టంగా ఉందని కూలిపోయే పేకమేడ కాదని ఇండియా కూటమికి చెప్పినట్లు అయింది అంటున్నారు.

ఇదే ఊపుతో రానున్న మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో గెలవడంతో పాటు డిసేంబర్ లో జరిగే శీతాకాల సమావేశాల్లో కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టి నెగ్గించుకుంటామన్న ధీమాను కూడా వ్యక్తం చేసినట్లు అయింది. ఇకపోతే హర్యానా కాశ్మీర్ లో ఒడ్డున పడిన బీజేపీకి మహారాష్ట్ర, జార్ఖండ్ టఫ్ టాస్క్ గానే ఉన్నాయి. అయితే తనకు ఉన్న చతురతతో గెలుచుకుని చూపించాలని కూడా చూస్తోంది. అంతే కాదు ఎన్డీయే అంతా ఒక్కటి అన్న మేసేజ్ ని పంపడం ద్వారా ఇండియా కూటమిని డీలా చేయాలని కూడా మాస్టర్ ప్లాన్ ఉంది అని అంటున్నారు. మొత్తానికి హర్యానాలో మోడీ దాదాపుగా ఒక రకమైన బల ప్రదర్శన చేశారు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.