గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనతో అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. జీవో నెంబర్ 29ని రద్దు చేసి జీవో నెం 55ను అమలు చేయాలంటూ నిరుద్యోగులు శనివారం ఆందోళనలకు పిలుపునిచ్చారు. వీరి నిరసనకు కేంద్రమంత్రి బండి సంజయ్ మద్దతు తెలిపారు. బండి సంజయ్‌తో పాటు బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున అశోక్‌నగర్ చేరుకుని ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఛలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆందోళన కాస్త తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ సెక్రటేరియట్‌కు వెళ్లి తీరతామని బండి సంజయ్ స్పష్టం చేశారు. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడకు చేరుకుని కేంద్రమంత్రిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చివరకు బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. అశోక్‌నగర్ నుంచి ఛలో సెక్రటేరియట్‌కు బయలుదేరిన బండి సంజయ్‌ను తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి బీజేపీ కార్యాలయానికి తరలించారు. ఈ ఘటనపై మరికాసేపట్లో బీజేపీ ఆఫీసులో బండి సంజయ్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
గ్రూప్ వన్ అభ్యర్థులకు డీజీపీ హెచ్చరిక..
మరోవైపు ఆందోళన చేస్తున్న గ్రూప్ వన్ అభ్యర్థులను డీజీపీ జితేందర్ హెచ్చరించారు. గ్రూప్ 1 పరీక్షల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్ల మీదికి వచ్చి సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకోమని స్పష్టం చేశారు. శాంతిభద్రతలను రక్షించాలనే నిన్న (శుక్రవారం) వారి (గ్రూప్ -1 అభ్యర్థులు) ఆందోళనను అరికట్టామని అన్నారు. సమస్య పరిష్కారానికి సుప్రీం కోర్టు కు వెళ్ళాలి కానీ రోడ్ల మీద ఆందోళన చేస్తే ఊరుకోమంటూ డీజీపీ జితేందర్ వార్నింగ్ ఇచ్చారు.కాగా.. గ్రూప్ వన్ మెయిన్స్‌కు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 21 నుంచి 27 వరకు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పరీక్షలు పకడ్బంధీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. మరోవైపు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తుది కీలో తప్పులు ఉన్నాయని, అందువల్ల ఆ పరీక్షను రద్దు చేసి మెయిన్స్ పరీక్ష నిర్వహించకుండా అడ్డుకోవాలని కోరుతూ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీలు దాఖలైన విషయం తెలిసిందే.
ఫైనల్ కీలో తప్పులు ఉండటంతోపాటు వివిధ కారణాలతో ప్రాథమిక పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సింగిల్ జడ్జి ధర్మాసనం కొట్టేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్ పిటిషన్లను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. చివరి నిమిషంలో పరీక్ష రద్దు సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. దీంతో గ్రూప్ 1 పరీక్షలకు అడ్డంకులు తొలిపోయినట్లైంది.