ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ మరో 10 రోజుల్లో వచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగుల నిరీక్షణకు ఎట్టకేలకు తెర పడనుంది. నవంబరు 3వ తేదీన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ డీఎస్సీ ప్రకటన ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే కూటమి సర్కార్ ప్రకటించింది కూడా. ప్రస్తుతం జరుగుతున్న ‘టెట్’ ఆన్‌లైన్ పరీక్షలు అక్టోబర్ 21వ తేదీతో ముగుస్తాయి. అనంతరం టెట్ ఫలితాలను నవంబరు 2న ప్రకటిస్తారు. మెగా డీఎస్సీలో సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులు 6,371, స్కూల్ అసిస్టెంట్ టీచర్ (SA) పోస్టులు 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT) పోస్టులు1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT) పోస్టులు 286, ప్రిన్సిపాల్ పోస్టులు 52, వ్యాయామ ఉపాధ్యాయుల (PET) పోస్టులు 132 వరకు ఉన్నాయి. ఇక ఇప్పటికే టెట్‌లో మంచి స్కోర్ సాధించిన అభ్యర్ధులు సమయం వృద్ధా చేసుకోకుండా డీఎస్సీ ప్రిపరేషన్ ప్రారంభించారు.
అధికమంది డీఎస్సీ కోచింగ్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక వేలకు వేలు చెల్లించి కోచింగ్ తీసుకోలేని వారు ఇంటి వద్దనే సొంత ప్రిపరేషన్ ప్రారంభించారు.డీఎస్సీ పరీక్షకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల ద్వారా ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ శిక్షణకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులను మాత్రమే ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత బోధన, ఉచిత భోజనం, వసతి సౌకర్యాలతోపాటు స్టడీ మెటీరియల్ కూడా ప్రభుత్వం కల్పించనుంది. అనుభవజ్ఞులైన బోధనా సిబ్బందితో ఆయా జిల్లాల్లో మూడు నెలల పాటు ఈ శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. ఆసక్తి కలిగిన వారు ఈ కింది లింక్‌పై క్లిక్ చేసి, దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులకు అక్టోబర్ 21 చివరి తేదీగా నిర్ణయించారు.అక్టోబర్ 3 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించిన ఏపీ టెట్ జులై 2024 పరీక్షల ప్రశ్నపత్రాలు, ప్రిలిమినరీ ‘కీ’లతోపాటు రెస్పాన్స్ షీట్లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.
పేపర్ 1ఎ, 1బి పరీక్ష ప్రిలిమినరీ ‘కీ’లపై అభ్యంతరాలను అక్టోబర్ 21వ తేదీలోగా ఆన్‌లైన్‌లో తెలియజేయాలి. మిగిలిన పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లు, ఆన్సర్ ‘కీ’లు పరీక్ష జరిగిన తర్వాతి రోజుల్లో విడుదల కానున్నాయి. ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో జరుగుతున్న ఈ పరీక్షలు 21వ తేదీతో ముగుస్తున్నాయి. అక్టోబర్ 27న తుది ‘కీ’ విడుదల చేసి, నవంబర్ 2న ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.