తెలంగాణలో రూ.759 కోట్లు, మహారాష్ట్రలో రూ.990 కోట్లు, ఉత్తరప్రదేశ్లో 721 కోట్లు, తమిళనాడులో 662 కోట్లు, గుజరాత్లో 650 కోట్లు.. ఇదీ రాష్ట్రాలవారీగా సైబర్ నేరగాళ్లు ఏడాది కాలంలో కొల్లగొట్టిన సొత్తు విలువ. సైబర్ నేరాలపై 2023లో ‘సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌కు దేశవ్యాప్తంగా 11, 28,265 ఫిర్యాదులు వచ్చాయి. ఆయా బాధితులు మొత్తం రూ.7,488.6 కోట్లు కోల్పోయారు. ఈ సైబర్ ముఠాల ఎత్తుల్ని చిత్తు చేసేందుకు కేంద్ర హోంశాఖ సైబర్ కమాండోలను రంగంలోకి దించబోతోంది. శిక్షణ పూర్తి చేసుకుని త్వరలో రంగంలోకి దిగబోతున్నారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన సమస్యల్లో సైబర్ నేరాలు ఒకటి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటి నియంత్రణకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం వీటిపై ఉక్కుపాదం మోపేందుకు సైబర్ కమాండోలను కేంద్రం సిద్దం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పోలీసులను సైబర్ కమాండోలుగా తీర్చదిద్దబోతోంది. వచ్చే ఐదేళ్లలో సుమారు 5,000 మందిని రంగంలోకి దించాలని కేంద్ర హోంశాఖ లక్ష్యంగా పెట్టుకొంది. ఈ బాధ్యతను ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ)కి అప్పగించింది. ఈ క్రమంలోనే తొలి విడతగా 346 మందిని ఎంపిక చేసింది.
ముందుగా రాష్ట్రాల పోలీసులతోపాటు కేంద్ర పోలీస్ సంస్థలు, కేంద్ర పారామిలిటరీ బలగాల నుంచి 2023 అక్టోబరు 5న నామినేషన్లను ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా 1,128 దరఖాస్తులు రాగా….ఈ ఏడాది ఫిబ్రవరి 24న 32 కేంద్రాల్లో శారీరక సామర్థ్య, రాతపరీక్షలు నిర్వహించారు. వీటిలో 747 మంది ఎంపిక కాగా….వారిలో 346 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. ఈ సైబర్ కమాండోలకు ఆరు నెలలపాటు శిక్షణ ఇచ్చి.. సైబర్ నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు, ఛేదన తదితర అంశాల్లో మెరికలుగా తీర్చిదిద్దనున్నారు.సైబర్ కమాండోలుగా ఎంపికైన వారికి ఐఐటీ నిపుణుల పర్యవేక్షణలో పాఠాలు చెప్పించబోతున్నారు. జాయింట్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సమన్వయ), సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్(సీఎఫ్ఎంసీ) తదితర కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తారు. హైదరాబాద్లోని సర్దార్ వల్లబ్బాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీతోపాటు కాన్పూర్, కొట్టాయం, నయా రాయ్పూర్ ఐఐటీలు, గాంధీనగర్ రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ(ఆర్ఆర్‌యై). ఢిల్లీ, గోవా, గాంధీనగర్ నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలు, పుణె డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ(డీఐఏటీ) తదితర ప్రఖ్యాత సంస్థల్లో తర్ఫీదు ఇస్తారు.
ఆరు నెలల అనంతరం కమాండోలు విధుల్లోకి చేరనున్నారు. వీరు సొంత రాష్ట్రాల్లో ఐదేళ్లపాటు పనిచేయాల్సి ఉంటుంది.అయితే ఈ శిక్షణ కోసం తెలంగాణ నుంచి వరంగల్ పోలీస్ కమిషనరేట్లో డిప్యూటీ అనలిటికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత కుమార్ ఎంపికయ్యారు. బీటెక్ సీఎస్ఈ చదివిన ప్రశాంత్ కుమార్‌కు సాంకేతికతపై పట్టు ఉండటంతో కానిస్టేబుల్‌గా ముందు నుంచీ సైబర్ నేరాల విభాగంలోనే ఉన్నారు.