మొన్న ద్వాక్రా..నిన్న ఐటి.. నేడు డ్రోన్.. చంద్రబాబు ఆలోచనకు హ్యాట్సాఫ్
చంద్రబాబు ఆలోచనలు అందరికంటే భిన్నంగా ఉంటాయి. ఇది చాలా సందర్భాల్లో నిరూపితం అయ్యింది. 1995లో సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారు. మహిళల స్వయం సమృద్ధికి డ్వాక్రా సంఘాలు, యువతకు ఉద్యోగాల కోసం ఐటీ ని ప్రోత్సహించారు. ఇప్పుడు కొత్తగా డ్రోన్ల వ్యవస్థపై పడ్డారు. ఇండియన్ మోస్ట్ సీనియర్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు. రాజకీయాల్లో ప్రతి నాయకుడికి విభిన్న పార్శ్యాలు ఉంటాయి. రాజకీయంగా చాలా రకాల విమర్శలు ఉంటాయి.అపవాదులు వస్తాయి. అవి సర్వసాధారణం కూడా. అయితే చంద్రబాబుపై అనుకూలతలు అధికం. ఆయన లెక్క వేరేగా ఉంటుంది. ఆలోచన ముందు తరానికి ప్రయోజనం చేకూర్చేలా ఉంటుంది. 20 సంవత్సరాల ముందు చూపుతో ఆయన ఆలోచనలు ఉంటాయి. ప్రస్తుతం ఏడు పదుల వయసులో ఉన్న ఆయన.. తరగని ఉత్సాహంతో పనిచేస్తున్నారు. రాష్ట్రానికి ఏదో చేయాలన్న తపన ఆయనలో కనిపిస్తోంది.
అయితే మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా.. మిగతా రాష్ట్రాల సీఎంల ఆలోచనలకు ఏమాత్రం పోలిక లేని స్థాయిలో ఆయన విజన్ ఉంటుంది. ఒక డ్వాక్రా సంఘాల స్వయం ఉపాధి ఆలోచన అయినా.. హైదరాబాదులో ఐటి అభివృద్ధి అయినా..ఆయన ముందస్తు ఆలోచనలు మంచి ఫలితాలు ఇచ్చాయి.ఈరోజు దేశంలోనే హైదరాబాద్ మహానగరం వైపు అందరి చూపు ఉందంటే.. అందుకు ముమ్మాటికీ కారణం చంద్రబాబు. ఐటీ కి హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిందంటే దాని వెనుక చంద్రబాబు దార్శనికత ఉంది. గతంలో ఆ స్థానంలో బెంగళూరు ఉండేది. దానిని మైమరిపిస్తూ హైదరాబాద్ ఐటీ కి స్వర్గధామం గా నిలిచింది. అయితే అది ఇప్పటికి ఇప్పుడు సాధ్యమయ్యేది కాదు. అది చంద్రబాబు వేసిన పునాది వల్లే సాధ్యమైందితెలుగు రాష్ట్రాల విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు. తన తొలి ఐదేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు పెట్టుబడులకు స్వర్గ ధామంగా ఏపీని మార్చాలని భావించారు. చాలా పరిశ్రమలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలని భావించారు. కానీ అనుకున్న స్థాయిలో అది సాధ్యం కాలేదు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కలేదు.
హైదరాబాద్ అంత ఈజీగా ఏపీ ఐటి పరంగా అభివృద్ధి జరిగే ఛాన్స్ కనిపించలేదు. అందుకే చంద్రబాబులో సరికొత్త ఆలోచన వచ్చింది. అదే ఏపీని డ్రోన్ హబ్ గా మార్చాలన్నది చంద్రబాబు ప్లాన్ గా మారింది.మనిషి దైనందిన జీవితంలో డ్రోన్ అవసరం ఇప్పుడు ఏర్పడింది. వ్యవసాయంలో రసాయనాలను పిచికారి చేయాలన్నా, ఒక వస్తువు సులువుగా వినియోగదారుడికి చేరాలన్నా.. ఇలా ప్రతి అవసరానికి డ్రోన్ కీలకంగా మారింది. అందుకే ఆ డ్రోన్ వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పరచవచ్చన్నది చంద్రబాబు ఆలోచన. అందుకే అంతర్జాతీయ స్థాయిలో డ్రోన్ సదస్సును విజయవాడలో ఏర్పాటు చేశారు. ఏపీ డ్రోన్ హబ్ గా మార్చే ప్రయత్నంలో ఒక ముందడుగు వేశారు. ఈ సదస్సులో డ్రోన్ల సాయంతో ఏయే రంగాలకు ఎలాంటి సేవలు అందించ వచ్చు.. చేసి చూపించారు. డ్రోన్లకు ఉన్న మార్కెట్, ఆ రంగానికి ఉన్న భవిష్యత్తు ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. రానున్న రోజుల్లో డ్రోన్లు కీలక భూమిక పోషించే అవకాశం ఉండడంతో.. అటువైపుగా దృష్టిపెట్టారు చంద్రబాబు. ఐటీ హబ్ మాదిరిగానే.. డ్రోన్ హబ్ గా ఏపీ తీర్చిదిద్దేందుకు చాలా కృషి చేస్తున్నారు. మరి ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.
ప్రతి రంగంలోనూ…
ఇటీవల రష్యా విరుచుకుపడినప్పుడు ఉక్రెయిన్ డ్రోన్లను ప్రయోగించింది. అత్యంత శక్తివంతమైన రష్యాను నిలువరించింది. ఇరాన్, హమాస్, హెజ్ బొల్లా పై ఇజ్రాయిల్ డ్రోన్ల తోనే దాడులు చేసింది. హమాస్, హెజ్ బొల్లా చీఫ్ లకు మరణ శాసనం రాసింది. ఇలా చెప్పుకుంటూ పోతే డ్రోన్ లు సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. డ్రోన్ ల వినియోగం భారీగా పెరుగుతున్నప్పటికీ.. వాటి తయారీకి సంబంధించి మన దేశంలో పరిశ్రమలు ఆశించినంత స్థాయిలో లేవు. పైగా డ్రోన్ల తయారీ పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వాలు పెద్దగా దృష్టి సారించిన దాఖలాలు కూడా లేవు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కాలాన్ని ముందే గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్రోన్ ల తయారీ కేంద్రంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి డ్రోన్ షో నిర్వహించారు. ఏకంగా ఐదు గిన్నిస్ రికార్డులను సాధించారు. దీనికంటే ముందు అంటే రెండు నెలల క్రితం నుంచి డ్రోన్ తయారీ పరిశ్రమకు, ఏపీని డ్రోన్ రాజధాని చేసేందుకు ఆయన సంకల్పించారు.
డ్రోన్ తయారీకి ఎలాంటి వనరులు కావాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దానికి అనుకూలంగా ఉంటుందా? ఎలాంటి కంపెనీలను ఆహ్వానించాలి? వాటికి ఏ విధమైన అనుకూల పరిస్థితులను కల్పించాలి? అనే విషయాలపై తీవ్రంగా మదనం జరిపారు. కేంద్రం ప్రోత్సాహం కూడా లభించడంతో ముందడుగు వేశారు. మంగళవారం నిర్వహించిన డ్రోన్ షో ద్వారా ఏపీ ఇక పై డ్రోన్ ల తయారీ రాజధానిగా చంద్రబాబు ప్రకటించారు. డ్రోన్ షో ముగిసిన తర్వాత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.వాస్తవానికి ఏ రాష్ట్రమైనా సరే భారీగా పెట్టుబడులు పెట్టి.. భారీగా పన్నులు వచ్చే రంగాలను ఎంచుకుంటుంది. దీనివల్ల యువతకు ఉద్యోగాలతో పాటు.. అభివృద్ధి కూడా సాధ్యమవుతుందని నమ్ముతుంది. ఏపీలో విస్తారంగా భూములు ఉన్నాయి. విశేషంగా వనరులు ఉన్నాయి. అచంచలమైన సముద్రతీర ప్రాంతం ఉంది. ఓడ రేవులు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఫార్మా, ఐటీ రంగాలను అభివృద్ధి చెందించేందుకు అవకాశం ఉంది. కానీ పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ లో ఐటి, ఫార్మా విశేషమైన అభివృద్ధి చెందింది.
ఈ రాష్ట్రాలు దేశానికే ఐటీ, ఫార్మా రాజధానులుగా కొనసాగుతున్నాయి. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఏపీని ఐటి పరంగా, ఫార్మా పరంగా అభివృద్ధి చేయవచ్చు. కాకపోతే దేనికి చాలా సమయం పడుతుంది. ప్రస్తుతం ఏపీ ఉన్న పరిస్థితుల్లో ఇలా చేయడం సాధ్యం కాదు. ఓవైపు రాజధాని నిర్మాణం.. మరోవైపు ఐటీ, ఫార్మా అభివృద్ధి చేయడం అంత సులువైన విషయం కాదు. అందుకే చంద్రబాబు టెక్నాలజీని నమ్ముకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైటెక్ సిటీ లాంటి ప్రాంతాలను నిర్మించిన ఆయన.. ఇప్పుడు ఏపీని డ్రోన్ సిటిగా మార్చడానికి కంకణం కట్టుకున్నారు.