వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య తలెత్తిన ఆస్తుల వివాదాలు తారాస్థాయికి చేరాయి. అన్న లేఖాస్త్రాలు, చెల్లి విమర్శనాస్త్రాలతో ఇద్దరి మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది. దీంతో వివాదాలు మరింత ముదురుతున్నాయే తప్ప, ఫుల్‌స్టాప్ పడే అవకాశాలు ఏ మాత్రం కనిపించట్లేదు. ఈ మాటల యుద్ధం ప్రత్యర్థులకు ప్రధాన అస్త్రంగా మారింది. అధికార టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందన, ఇందుకు ప్రతిస్పందనగా జగన్ కౌంటర్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. దీంతో ఇప్పుడు ఆస్తుల లొల్లి గురించే ఎక్కడ చూసినా మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే కేంద్ర దర్యాప్తు సంస్థలు షేర్ల బదిలీలపై ప్రశ్నించడంతో ఈ మొత్తం వివాదం మొదలైందనే చర్చ జరుగుతోంది.
రెండు మూడ్రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో ఎటుచూసినా ఈ వివాదంపైనే చర్చ నడుస్తుండటంతో విజయనగరం పర్యటనలో భాగంగా జగన్ నేరుగా తొలిసారి స్పందించారు. ‘ నేను విజయనగరం వస్తున్నానని టీడీపీ టాపిక్ డైవర్ట్ చేసింది. మా చెల్లెలు, మా అమ్మ, నా ఫోటోలతో రాజకీయం చేస్తున్నారు.
విమర్శలు చేస్తున్న అందరినీ ఒకటే అడుగుతున్నా. మీ ఇళ్లలో ఇలాంటి కుటుంబ గొడవలు ఏమీ లేవా?. అయ్యా ఇవన్నీ ఘర్ ఘర్‌కీ కహానీలు. ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే. వీటిని మీ స్వార్థం కోసం పెద్దవి చేసి చూపడం, నిజాలు లేకపోయినా వక్రీకరించి చూపించడం మానుకుని ప్రజల సమస్యలపై ధ్యాస పెట్టండి. ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవాలని చంద్రబాబును అడుగుతున్నాను. పక్క చూపులు మాని ప్రజా పరిపాలన సాగించండి. ఎప్పుడూ మా కుటుంబంపై పడి ఏడ్చే బదులు, రాష్ట్రంలోని అఘాయిత్యాలు, నేరాలను అరికట్టండి. మీడియా ముసుగులో చంద్రబాబును మోస్తున్న వారిని, దత్తపుత్రుణ్ని కూడా అడుగుతున్నాను. టీడీపీ అక్రమాలు, అన్యాయాలు బయటపడుతున్నాయనే డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారు’ అని వైఎస్ జగన్ ఆరోపించారువైఎస్ జగన్ లేఖ, విమర్శలకు షర్మిల కూడా ఘాటుగానే బదులిచ్చారు. కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి సహజమే కానీ అందరూ అమ్మల మీద కోర్టులో కేసులు వేయరని అన్నకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
తండ్రి వైఎస్ ఆదేశాలను, అభిమతాన్ని గాలికి వదిలేసి మాట తప్పి మడమ తిప్పారని కన్నెర్రజేశారు. నైతికంగా దిగజారిపోయినా, అథ:పాతాళపు లోతుల నుంచి పైకొచ్చి ఇప్పటికైనా తండ్రికి ఇచ్చినా నిలబెట్టుకోవాలన్నారు. 2019 ఆగస్టు 31న చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నట్లు షర్మిల చెప్పారు. ఎప్పటికీ జగన్ ఇలాగే ఉంటే మాత్రం తన హక్కులను కాపాడుకునేందుకు కచ్చితంగా చట్టపరంగా మార్గాలను ఎంచుకుంటానని హెచ్చరించారు. నాన్న ఆస్తులన్నీ తన నలుగురు మనవలు, మనవరాళ్లకు సమానంగా చెందాలని ఆదేశించిన విషయాన్ని షర్మిల గుర్తు చేశారు.‘నాన్న కలలో కూడా ఊహించని పని జగన్ చేశారు. నా రాజకీయ జీవితం నా ఇష్టం. నా వృత్తిపరమైన వ్యవహారశైలి ఎలా ఉండాలో చెప్పే అధికారం మీకు లేదు. నాకు వాటాగా పేర్కొన్న సరస్వతి పవర్‌లోని షేర్లు ఒప్పందంపై సంతకం చేసిన వెంటనే బదలాయిస్తానని మాటిచ్చారు. ఆ హామీ నెరవేర్చకుండా అనవసర వివాదాలు లేవనెత్తుతూ కుటుంబాన్ని రచ్చకీడ్చడం ఏ మాత్రం పద్ధతి కాదు’’ అని అన్నపై షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారంపై మాట్లాడేందుకు షర్మిల శుక్రవారం మీడియా ముందుకు రాబోతున్నారు.
ఇప్పటికే వాడీవేడిగా వివాదం నడుస్తుండగా ఆమె ఏం మాట్లాడుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఇవన్నీ ఒకఎత్తయితే ఈ ఆస్తి వివాదం ఇప్పుడే ఎందుకనే ప్రశ్నలకు పలు రకాలుగా సమాధానాలు వస్తున్నాయి. మనీలాండరింగ్ కేసులో అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తుల బదలాయింపులపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నించడంతోనే వివాదం మొదలైనట్లుగా తెలుస్తోంది. అయితే సరస్వతీ ఇండస్ట్రీస్‌కు సంబంధించిన ఒరిజినల్ పత్రాలు అన్నీ ఉన్నాయని లేఖలో స్పష్టం చేశారు. డాక్యుమెంట్స్ అన్నీ ఆయన దగ్గరే ఉంటే గిఫ్ట్‌డీడ్ ఆధారంగా షేర్లు ఎలా బదిలీ అయ్యాయనే ప్రశ్నలకు సమాధానాలు దొరకట్లేదు. షేర్లను తల్లి విజయమ్మ పేరిట బదిలీ చేసిన తర్వాత, గిఫ్ట్ డీడ్‌పై జగన్, భారతీ సంతకాలు చేసినా వివాదాలు సృష్టించడం ఎందుకు అని షర్మిల ప్రశ్నిస్తున్నారు.ఆస్తి వివాదాలు నడుస్తున్న ఈ తరుణంలో బాంబ్ లాంటి వార్త బయటికొచ్చింది. కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అంటూ ఢిల్లీ నుంచి గల్లీ వరకూ చర్చ నడుస్తోంది.
మూడో కంటికి తెలియకుండా ఇదంతా జరుగుతోందని అందుకే అన్నా చెల్లి ఇద్దరూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. గడిచిన మూడు మాసాలుగా వైసీపీ-కాంగ్రెస్ మధ్య జరిగిన చర్చలు కొలిక్కి వచ్చాయని టీడీపీ నేతలు కొందరు ఆరోపిస్తున్నారు. విలీనం లేకపోయినా కాంగ్రెస్‌తో పొత్తు అయినా ఉంటుందన్నది మరికొందరి వాదన. అయితే ఈ వార్తలపై వైసీపీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, మౌనానికి అర్థం అంగీకారమనే మాటలు వినిపిస్తున్నాయి.