ఆయన వైసీపీలో సంచలన విజయాన్ని నమోదు చేసుకోవడమే కాదు రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. ఎన్నికల ముందు వైసీపీ నుంచి బయటికి వెళ్లిన ఆయన్ని జగన్పిలిచి మరీ మళ్లీ పార్టీలో చేర్చుకున్నారు. మళ్లీ పార్టీలోకి రావటంతో ఆయన వర్గం అంతా తమ నేత ఇక దూకుడుగా వెళ్తారు అనుకున్నారు. కట్ చేస్తే ఆయన ఎక్కడున్నారో తెలియకుండా పోయిందిప్పుడు. ఆయన వెన్నంట నేతలకు సైతం ఆయన అడ్రస్ తెలియడం లేదంట. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆ లీడర్ సడన్‌గా పొలిటికల్ స్క్రీన్ మీద నుంచి మాయమవ్వడంపై పెద్ద చర్చే జరుగుతుందిప్పుడు.ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ ఒక్క అసెంబ్లీ సీటు తప్ప మిగిలిన అన్నీ కైవసం చేసుకుంది. అన్ని నియోజకవర్గాల్లో గెలుపేమో కానీ మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీగెలుపు పెద్ద సంచలనమే రేపింది. అక్కడ విజయంపై వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాయి. దానికి కారణం టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ టీడీపీ నుంచి బరిలో నిలవగా వైసీపీ నుంచి అల్లా రామకృష్ణారెడ్డి బరిలో నిలిచారు.
లోకేష్ పై అల్లా రామకృష్ణారెడ్డి విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు.ఆ తర్వాత మంగళగిరి ఎమ్మెల్యేగానే కాదు రాష్ట్రస్థాయిలో ముఖ్య నేతల్లో ఒకరిగా ఆళ్ల రామకృష్ణారెడ్డివెలుగొందారు. అమరావతి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే అయినప్పటికీ, అప్పటి ప్రభుత్వం మూడు రాజధానుల నినాదానికి అనుగుణంగా వాయిస్ వినిపించిన ఆర్కే.. పలు అంశాలపై కోర్టుకెక్కుతూ నిత్యం వార్తల్లో నిలిచారు. ఒకరకంగా చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాల్లోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి అంటే అందరికీ తెలిసేలాగా ఆయన పార్టీలో దూకుడుగా ముందుకు వెళ్లారు. ఆ క్రమంలో నియోజవర్గం పరిస్థితి ఏమో గాని పార్టీలో మాత్రం కీలక నేతగా ఎదుగుతాడని అందరూ భావించారు. అయితే ఎన్నికల ముందు బీసీ మంత్రం ఎత్తుకున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ మంగళగిరి ఇన్చార్జ్‌గా చేనేత వర్గానికి చెందిన గంజి చిరంజీవిని ఇన్చార్జ్‌గా ప్రకటించారు.అప్పట్లో మంగళగిరి ప్రాంతంలో ఆర్కే తన బినామీ కాంట్రాక్టర్లలో పలు అభివృద్ది పనులు చేయించారంటారు.
ఆ పనులకు సంబంధించి ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని.. కోట్ల రూపాయల్లో ఆ బిల్లులపై ఆర్కే బెంగ పెట్టకున్నారని ప్రచారం జరిగింది. ఆ క్రమంలో అప్పటికి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్కే వైసీపీకి రిజైన్ చేసి కాంగ్రెస్‌లో చేరారు. కొన్ని రోజులు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వెంట తిరుగుతూ హాడావుడి చేశారు. దాంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్లో కూడా కీలక నేతగా ఉండి తప్పకుండా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించడంలో కీలకంగా వ్యవహరిస్తారని అందరూ ఊహించారు. అయితే ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో నుండి వైసీపీలోకి వచ్చేశారు. జగన్ ఆయన ఆర్ధిక లెక్కలు తేల్చి వెనక్కి పిలిపించుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఎన్నికల్లో తనకు టికెట్ లేకపోయినా వైసీపీ విజయానికి కృషి చేస్తానని ప్రకటించినప్పటికీ ప్రచారంలో కూడా ఆయన పెద్దగా కనిపించలేదు.
ఇక వైసీపీ ఘోరాపరాజయం తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి అసలు కనిపించడమే మానేశారు. అయన రాజకీయాలకు ఎంత దూరమయ్యారంటే మంగళగిరి వైసీపీ నేతలు కూడా రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన్ని గుర్తు చేసుకోవడం మానేశారు. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక వైసీపీకే కాదు రాజకీయాలకి కూడా దూరంగా ఉన్నారని క్లియర్‌గా కనిపిస్తుంది. మరి అది తాత్కాలికమూ? లేకపోతే శాశ్వతమూ? కాని ఆర్కే పొలిటికల్ రిటైర్‌మెంట్ తీసుకున్నట్లే కనిపిస్తుంది.