హైదరాబాద్ జన్వాడ ఫామ్ హౌస్‌లో జరిగిన పార్టీ తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపింది. ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ జరిగిందని కాంగ్రెస్, లేదు పార్టీ జరిగిందని బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల పార్టీ ఇచ్చారని.. పార్టీలో డ్రగ్స్ వాడారని పోలీసులు స్పష్టం చేశారు. ఫామ్ హౌస్ నుంచి రాజ్ పాకాల వెళ్లగా, అతని సహచరుడు విజయ్ మద్దూరు పోలీసులకు చిక్కారు. అతనికి వైద్య పరీక్షలు చేయగా కొకైన్ డ్రగ్స్ తీసకున్నారని తేలింది. దీంతో జన్వాడ ఫామ్ హౌస్‌లో ఏం జరుగుతోంది, విచ్చలవిడిగా డ్రగ్స్ వాడుతున్నారా అని అధికార కాంగ్రెస్ మండిపడింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించింది.
తప్పుపట్టిన షబ్బీర్ అలీ:
కేటీఆర్ తీరును ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ తప్పు పట్టారు. కేటీఆర్‌కు సిగ్గు శరం ఉందా? కేటీఆర్‌కు డ్రగ్స్‌తో సంబంధం ఉన్నట్టు ఉంది. అందుకే డ్రగ్స్ అంశం రాగానే కేటీఆర్ పేరు వస్తోంది. డ్రగ్స్ విషయంలో మా పేర్లు ఎందుకు రావడం లేదు. కేటీఆర్ పేరే ఎందుకు వస్తోంది. కేటీఆర్ ఇప్పటికైనా నార్కో టెస్ట్‌కి వస్తే నిజం తెలుతుంది కదా. జన్వాడ ఫాం హౌజ్ విచిత్రమైంది. పార్టీ జరిగిన దగ్గర ఒక వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నాడని తెలినా కేటీఆర్ బుకాయిస్తున్నాడు. కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎలా పెరిగాయో విచారణ జరపాలి. తెలంగాణ పేరుతో ఎంత లూటీ చేశారో ప్రజలకు తెలియాలి. చట్టం తెలియని వాళ్లు తప్పు చేస్తే ఏమో అనుకోవచ్చు కానీ అన్ని తెలిసిన వాళ్లు ఎలా తప్పు చేస్తారు అని, షబ్బీర్ అలీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
నోటీసులు. టైమ్ కావాలి
మరోవైపు కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పీఎస్ కు వచ్చేందుకు రెండు రోజుల సమయం కావాలని న్యాయవాదులు పోలీసులను కోరారు. మరోవైపు అరెస్ట్ చేయొద్దని హైకోర్టులో రాజ్ పాకాలా పిటిషన్ కూడా దాఖలు చేశారు.