ఇంటి గుట్టు లంకకు చేటని పెద్దలు చెబుతారు. కొన్ని విషయాల్లో గుట్టుగా ఉండాలన్నది దానర్థం. ప్రస్తుతం మాజీ సీఎం జగన్‌కి చెందిన సరస్వతీ పవర్ కంపెనీ విషయంలో ఏం జరిగింది.. జరగబోతోంది?గతంలో సరస్వతి పవర్ కంపెనీకి కేటాయింపులపై ప్రభుత్వం వివరాలు సేకరిస్తోందా? కేటాయింపులు రద్దు చేస్తుందా? లేక సీఐడీ విచారణకు ఆదేశిస్తుందా? జగన్-షర్మిల వివాదంలో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయా? అవుననే సమాధానం వస్తోంది. జగన్-షర్మిల వివాదం నేపథ్యంలో సరస్వతి పవర్ కంపెనీకి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తోంది ప్రభుత్వం. వీటిని కేటాయించిన భూములు రద్దు చేయాలని రైతుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. రాజకీయ నేతలు సీఐడీ విచారణకు డిమాండ్ చేస్తున్నారు.ఎన్నో ఏళ్లగా పోరాటం చేస్తున్నారు గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు. ఈ కంపెనీకి భూముల కేటాయింపు ఎక్కువ భాగం పల్నాడు ప్రాంతంలో ఉండడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.సరస్వతి పవర్ కంపెనీకి సంబంధించి 1500 ఎకరాల్లో ప్రభుత్వ భూములున్నట్లు తెలుస్తోంది. దీని వ్యవహారాలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిధిలోకి రావడంతో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
ఆ కంపెనీ భూముల్లో ప్రభుత్వం, కొండ ప్రాంతం, పోరంబోకు, చుక్కల భూములున్నట్లు అంతర్గత సమాచారం. మరో రెండురోజుల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నివేదిక అందజేయనున్నారు అధికారులు. అటవీ, పర్యావరణ అనుమతులపైనా దృష్టి పెట్టారు.సరస్వతీ పవన్ కంపెనీ భూములపై పోరాటం చేస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు. ఈ క్రమంలో గత టీడీపీ సర్కార్ గనుల కేటాయింపును రద్దు చేసింది. అయితే వైసీపీ అధికారంలోకి రాగానే గనుల కేటాయింపును పునరుద్ధరించుకుందని ఆరోపిస్తున్నారు నేతలు. దీనికితోడు శాశ్వతంగా నీటి కేటాయింపులు చేసుకున్నారని అంటున్నారు.సరస్వతీ పవర్ కంపెనీ భూములపై ప్రశ్నించినందుకు కొన్ని ప్రాంతాల్లో రైతులపై కేసులు నమోదయ్యాయి. ఏళ్లు గడుస్తున్నా సిమెంట్ కంపెనీ నిర్మాణం జరగలేదు. ఫలితంగా ఆ ప్రాంతమంతా చిట్టడవిని తలపిస్తోంది.ఆయా భూముల్లో పంటలు పండించుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.
గతంలో ఎకరా 3 లక్షలకు ఇచ్చామని, పరిశ్రమ నిర్మాణం జరగకపోవడంతో బహిరంగ మార్కెట్ ప్రకారం ధర చెల్లించాలన్నది వారి మాట. అన్నట్లు ఆ కంపెనీ సంబంధించిన భూముల విలువ మార్కెట్లో దాదాపు 10 వేల కోట్లకు పైగానే ఉంటుందని ఓ అంచనా. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.