వైసీపీ హయాంలో చక్రం తిప్పిన యువనేత.. నేడు అజ్ఞాతంలో ఉన్నారు. ఎప్పుడు.. ఎక్కడ.. అరెస్టు చేస్తారో తెలియక చీకటిరాజ్యంలో గడుపుతున్నారు. ఇంత గొప్పగా ఇంట్రడక్షన్ చెప్పిన వ్యక్తికి ఆ పరిస్థితి ఎలా వచ్చిందంటారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. సోషల్ మీడియా రాజ్యమేలుతున్న రోజులివి. పెరిగిన టెక్నాలజీని ఉపయోగించుకుని.. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లుగా చెప్పే పరిస్థితులు వచ్చేశాయి. దీన్ని రాజకీయాల్లోనూ ప్రయోగిస్తున్న కొందరు లబ్ధి పొందుతుంటే.. మరికొందరు తమ అడ్రస్ కూడా గల్లంతైన సందర్భాలు కోకొల్లలు. అలాంటి కోవకే చెందుతారు సజ్జల భార్గవ్. వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్‌గా ఉండి.. పార్టీ కోసం సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా రాతలు రాయించారనే అభియోగం ఆయనపై ఉంది. అయితే.. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక.. భార్గవ్ ఆచూకీ గల్లంతు అయ్యింది. నాడు.. ఓ వెలుగు వెలిగిన యువనేత.. ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటూ నెటిజన్లు తెగ ప్రశ్నలేసేస్తున్నారు. సోషల్ మీడియాను ఓ ఆటాడుకున్న భార్గవ్.. అజ్ఞాతంలోంచి ఎప్పుడు వస్తారా అనే చర్చ.. ఏపీ వ్యాప్తంగా సాగుతోందట.
సజ్జల భార్గవ్… సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు. గత ప్రభుత్వ హయంలో తండ్రి… సకలశాఖల మంత్రిగా అన్నీ తానై వ్యవహరించగా.. కొడుకు భార్గవ్.. సోషల్ మీడియాకు ఇన్‌ఛార్జ్‌గా ఉండి.. ప్రత్యర్థి పార్టీలతో ఉన్నవి లేనట్లు.. లేనివి ఉన్నట్లుగా ప్రచారాలు చేయించారట. రాజకీయంలో వైసీపీకి లబ్ధి చేకూరేలా చేస్తూ టీడీపీ, జనసేన పార్టీలకు వ్యతిరేకంగా.. తన టీమ్‌తో పోస్టులు పెట్టిస్తూ.. ప్రత్యర్థి పార్టీలను ఇరకాటంలో పెట్టించటంలో సక్సెస్ అయ్యారనే వాదనలు ఉన్నాయి. ఓ రకంగా భార్గవ్ అండ్ టీమ్… వైసీపీ అధికారంలోకి రావటం కోసం చేయని పనంటూ లేదనేది రాజకీయ వర్గాల్లోనూ వినిపించే మాట. ఆనాడు తాము చెప్పిందే నిజం… రాసిందే వార్త అన్నట్లుగా వ్యవహరించిన భార్గవ్.. ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.ఐదేళ్లకు పైగా.. వైఎస్సార్సీపీలో చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ.. సజ్జల భార్గవ్ మాట వినాల్సిన పరిస్థితి ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు.
అతని పవర్ ఏంటనేది. అతను పోస్ట్ చేసిందే వైసీపీకి రాజముద్ర. వన్ మ్యాన్ షోగా అంతా తానే వ్యవహరించి.. ఫ్యాన్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడనే వాదనలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానూ.. ప్రత్యర్థులపై తనదైన శైలిలో ఆరోపణలు, అభాండాలు వేస్తూ… ఇరకాటంలో పెట్టడంతో భార్గవ్ సక్సెస్ అయ్యారట. తండ్రి కెమెరా ముందుకు వచ్చి.. అన్నీ తానై వ్యవహరించగా… కొడుకు మాత్రం తెర వెనుక ఉంటూ జగన్ పార్టీకి మేలు చేకూర్చారన్నది జగమెరిగిన సత్యంగా తెలుస్తోంది.నాడు వైసీపీ అధికారంలో ఉండగా ఇష్టానుసారంగా వ్యవహరించి.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అసభ్యకర పోస్టులు పెట్టించారంటూ భార్గవ్‌పై అభియోగాలున్నాయి. అంతేకాదు.. జగన్‌ను వ్యతిరేకించిన షర్మిలను కూడా వదలిపెట్టలేదట. ఆమెపైనా సోషల్‌మీడియా వేదికగా.. ఇష్టానుసారంగా పోస్టులు పెట్టించి.. ఆమె ఇమేజ్‌ను.. డ్యామేజ్ చేసేందుకు వందశాతం పని చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ.. కూటమిగా ఏర్పడటం.. జనాల్లోనూ వైసీపీపై వ్యతిరేకత రావటంతో గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ.. కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యింది.
ఆ ఓటమిలో.. తండ్రీ కొడుకులదే ఎక్కువ పాత్ర అనే ఆరోపణలూ బలంగా వినిపించాయి. వీరిద్దరూ లేకుంటే.. జగన్ మరోసారి సీఎం అయ్యేవారని.. సొంత పార్టీలోనే గుసగుసలు వినిపించాయట. ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టేందుకు.. స్త్రీ, పురుష బేధం లేకుండా.. ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడమే వైసీపీకి ఇబ్బందిగా మారిందనేది రాజకీయవర్గాల్లోనూ మార్మోగిన మాట. ఈ విషయంలో కొందరు సొంత పార్టీ నేతలే.. సజ్జల భార్గవ్ తీరుపై.. అధినేత జగన్‌కు ఫిర్యాదులు కూడా చేశారట. అయినా.. ఆయన పట్టించు కోకపోవటంతో.. పార్టీ డ్యామేజ్ అయ్యిందని.. తాము చెప్పినప్పుడు వింటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదనేది సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారట. జరగాల్సిన నష్టం జరిగింది. వైనాట్ 175 నినాదంతో ఎన్నికలకు వెళ్లిన జగన్..11 సీట్లకు పరిమితం అయ్యారు. ఇప్పుడు మాత్రం వినిపిస్తున్న మాట ఒకటే… వేరీజ్ సజ్జల భార్గవ్.కొత్త ప్రభుత్వం ఏర్పడి.. ఐదు నెలలు కావొస్తున్నా…భార్గవ్ రెడ్డి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. AP డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరుతో… నిధులు విడుదల చేసి.. ఆ డబ్బుతో YSRCP సోషల్ మీడియా విభాగానికి మళ్లించారన్నది సజ్జల భార్గవ్‌పై ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ.
దీనిపై ఇప్పటికే విచారణ మొదలైంది. కానీ..సజ్జల భార్గవ్ ఆచూకీ మాత్రం తెలియటం లేదు. సోషల్ మీడియా పేరుతో ఇటు ప్రభుత్వ.. ఇటు వైసీపీ నుంచి కోట్ల నిధులు వసూలు చేసినట్లు భార్గవ్ రెడ్డి పై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ జరగాల్సి ఉండగా…భార్గవ్ కోసం పోలీసులు జల్లెడ పట్టారు. దేశ, విదేశాల్లోనూ తీవ్రంగా గాలిస్తున్నా.. భార్గవ్ ఆచూకీ మాత్రం లభ్యం కావటం లేదు. ఎన్ని రోజులు దాక్కున్నా.. ఏదో ఒకరోజు బయటకు రావాల్సిందే అనేది కూటమి నేతల మాటగా తెలుస్తోంది. సో.. ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా వినిపిస్తున్నది ఒకటే. వేరీజ్ సజ్జల భార్గవ్.