జాతీయం రాజకీయం

విజయ్ కు అంత వీజీయేం కాదు

ముందుగా విజయ్ తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం నిర్వహించిన మహానాడు ఊహించిన దానికంటే ఎక్కువ విజయవంతమైనది. జనం భారీగా వచ్చారు. ఏర్పాట్లు కూడా భారీగా జరిగాయి. విజయ్ పట్ల తమిళ ప్రజలు విపరీతమైన ఆదరణ చూపించారు. కానీ ఇక్కడే చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసినప్పుడు పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయి. ఎంజీఆర్ తమిళనాడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అప్పటి రోజులు వేరే విధంగా ఉన్నాయి. ఈరోజుకి రాజకీయాలలో సినీ రంగం నుంచి వచ్చిన వారి పాత్ర ఉన్నప్పటికీ.. వారి ప్రభావం కొంతవరకే.. గతంలో ఎంజీఆర్ అధికారంలోకి వచ్చారు. ఎన్టీఆర్ తిరుగులేని ప్రపంచనాన్ని సృష్టించారు. కరుణానిధి తన సత్తా చాటారు. జయలలిత ఏకంగా విప్లవనాయక అయ్యారు. కానీ తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ కుమారుడు మాత్రమే. పెద్దగా గొప్ప రాజకీయ నాయకుడు కాదు. కమలహాసన్ ఓ విఫల ప్రయోగం. విజయ్ కాంత్ కూడా అంతే.. గొప్పగా చెప్పుకునే స్థాయిలో వీరేమి ఫలితాలు సాధించలేదు.

చివరికి తెలుగు నాట చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు.. తిరుపతిలో సభ పెట్టినప్పుడు లక్షలాదిమంది జనం వచ్చారు. ఇసుక వేస్తే రాలనంత జనం సందడి చేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 18 సీట్లు మాత్రమే వచ్చాయి. చివరికి పార్టీని కాపాడుకోవడం తెలియక.. రాజకీయాలు అర్థం కాక.. తన ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారు. చివరికి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏర్పాటుచేసిన జనసేన ఫలితాలు ఎలాంటివో అందరికీ తెలుసు. ఇప్పటికీ పట్టిష్టమైన నిర్మాణం అంటూ లేదు. బలమైన కార్యవర్గం లేదు. టిడిపి, బిజెపితో కలిసి పోటీ చేయాల్సిన పరిస్థితి. ఇటీవల ఎన్నికల్లో సెంట్ పెర్సెంటేజ్ రిజల్ట్ వచ్చినప్పటికీ.. అది జగన్ మీద బలమైన వ్యతిరేకత అనే విషయాన్ని ఇక్కడ కాదనలేం. 2019 ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు. కానీ పవన్ కళ్యాణ్ సమావేశాలు నిర్వహిస్తే భారీగా జనం వచ్చేవారు.తెలుగు, తమిళం మాత్రమే కాదు… కన్నడ, మలయాళం లోనూ సినిమా వాళ్లు రాజకీయాలలో పెద్దగా రాణించింది లేదు.

మోహన్ లాల్ కు రాజకీయాలు అంటే పడవు. మమ్ముట్టి చాలా దూరం. సురేష్ గోపి బిజెపిలో ఉన్నప్పటికీ ఆయన ప్రభావం అంతంత మాత్రమే.. ఇక కన్నడలో సుదీప్ రాజకీయాలలో వేలు పెట్టడు. దర్శన్ అత్యంత వివాదాస్పదుడు. పైగా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.. ఏతా వాతా చూస్తే విజయ్ పార్టీకి అవకాశాలు లేవని కొట్టి పారేయలేం. అలాగని ఆయన రాజకీయ ప్రయాణం కేక్ వాక్ అని చెప్పలేం.. జయలలిత మరణించిన తర్వాత అన్నా డీఎంకే అంపశయ్యపై ఉంది. ఆ పార్టీకి లీడర్లు లేరు. శశికళకు అంత సన్నివేశం లేదు. ఇక ప్రస్తుత నాయకులను తమిళ జనం పెద్దగా యాక్సెప్ట్ చేయడం లేదు. ఈ ప్రకారం చూసుకుంటే విజయ్ కి ఎంత కొత్త స్పేస్ ఉండొచ్చు. అయితే అతడు నేరుగా డీఎంకే పరిపాలనను విమర్శిస్తున్నాడు. కుటుంబ రాజకీయాలను ఎదురిస్తున్నాడు. అంతేకాదు పెరియార్ ను గౌరవిస్తామని చెబుతూనే నాస్తిక వాదాన్ని అనుసరించబోమని అంటున్నాడు..

అంతేకాదు ఆస్తికత్వం, నాస్తికత్వం ప్రజల విషయానికి వదిలేయాలని.. రాజకీయ పార్టీల ఏజెండాలో దాన్ని చేర్చడం సరికాదని విజయ్ స్పష్టత ఇస్తున్నాడు. తమిళనాడులో ఎలాగూ కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు. కమ్యూనిస్టులకు ఎదిగే స్కోప్ లేదు. ఇంకా బిజెపి అంటారా.. దానికి అక్కడ ఎలా ఎదగాలో తెలియదు.. మొత్తంగా చూస్తే విజయ్ మంచి టైం చూసుకునే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..