కేంద్రంలోనూ,రాష్ట్రంలోనూ తెలుగుదేశం పార్టీ అనుకూల ప్రభుత్వాలే ఉన్నాయి. పైగా టిడిపి సహకారం లేనిది కేంద్ర ప్రభుత్వం నడవని పరిస్థితి. ఈ తరుణంలో టిడిపికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులపై చంద్రబాబు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఏపీలో అభివృద్ధి పనులపై దృష్టి సారించింది కూటమి ప్రభుత్వం. ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే..పెద్ద ఎత్తున అభివృద్ధి చేపట్టాలని భావిస్తోంది. అందులో భాగంగా రూ.5407 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఎన్టీఆర్, గుంటూరు, చిత్తూరు, నంద్యాల, శ్రీ సత్య సాయి, శ్రీకాకుళం అనకాపల్లి, కృష్ణ, ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాల్లో విద్యుత్ సబ్ స్టేషన్లనిర్మాణాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. అయితే ఇచ్చాపురంలో జరిగిన కార్యక్రమానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హాజరు కాలేదు. దీంతో సీఎం చంద్రబాబు చురకలాంటించారు.
గుంటూరు జిల్లా తాళ్లాయపాలెంలో 55 కోట్లతో నిర్మించిన కె.వి గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. అక్కడ నుంచి మిగతా జిల్లాల్లో సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సీఎం చంద్రబాబు ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జరిగిన కార్యక్రమానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఎందుకు రాలేదని కలెక్టర్ ను ప్రశ్నించారు.కార్యక్రమానికి ఆహ్వానం పంపలేదా అంటూ అడిగేసరికి.. కలెక్టర్ పంపమని చెప్పుకొచ్చారు. దీనిపై మాట్లాడారు చంద్రబాబు. ఎంత బిజీగా ఉన్నా ప్రజలకు దూరం కాకూడదు కదా.. వర్చువల్ గా కూడా జాయిన్ కావచ్చు. మంత్రులైన ఎంపీ లేనన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రజలతో మమేకం కావాలి. దీని నుంచి తప్పించుకోకూడదు అంటూ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడును ఉద్దేశించి సీఎం చంద్రబాబు అన్నారు.మరోవైపు తాళ్లాయపాలెంలో సీఎం చంద్రబాబు తో పాటు అదే జిల్లాకు చెందిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు.
ఆయనను సైతం ఉద్దేశించి చురకలంటించారు చంద్రబాబు. ప్రారంభోత్సవ సమయంలో అక్కడ శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం ఫోటో సెషన్ జరిగింది. అప్పుడు చంద్రబాబు పెమ్మసానిని పిలిచారు. వచ్చి తన పక్క నిలబడాలని చెప్పారు. చంద్రశేఖరు ఇటు రా నువ్వు మంత్రివయ్యా, ఎంపీ వి కూడా.. ప్రోటోకాల్ వల్ల సెంటర్ స్టేట్ ప్రాబ్లం రాకుండా అంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా ఆరు నెలలు అయింది. రాష్ట్రానికి ఇంకా డబ్బులు తీసుకురాలేదంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మొత్తానికైతే కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు చురకలంటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు గాను 21చోట్లకూటమి అభ్యర్థులే ఎంపీలుగా గెలిచారు.
కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా మారింది.ఈ తరుణంలో ఎన్డీఏలో చేరిన తెలుగుదేశం పార్టీకి రెండు మంత్రి పదవులు లభించాయి. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ఏకంగా క్యాబినెట్ హోదా దక్కుతూ పౌర విమానయాన శాఖను ఇచ్చారు ప్రధాని మోదీ. తొలిసారిగా గుంటూరు నుంచి ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కు సహాయ మంత్రి హోదా దక్కింది. ఈ ఇద్దరు యువ ఎంపీలే. అందుకే చంద్రబాబు సైతం ఈ ఇద్దరు పేర్లు సిఫారసు చేశారు. అయితే తాజాగా ఈ ఇద్దరినీ ఉద్దేశిస్తూ చంద్రబాబు చురకలాంటించడం విశేషం. తెర వెనుక ఏం జరిగిందని టిడిపి శ్రేణులు ఆరా తీస్తున్నాయి.