తెలంగాణ రాజకీయం

మల్లారెడ్డికి మరిన్ని చిక్కులు

పీజీ మెడికల్‌ సీట్లలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో సమస్య ఎదురైంది. మల్లారెడ్డి యూనివర్సిటీ స్థలంలోని ఐదెకరాలు తమకు చెందినవంటూ బాధితులు తెరపైకి వచ్చారు. స్థలాన్ని కొలిచేందుకు సర్వేయర్లు, అడ్వకేట్‌తో వచ్చిన బాధితులను స్థానికులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల వారికి కోర్టు ఆదేశాలు ఇస్తేనే స్థలాన్ని కొలవనిస్తామంటూ స్థానికులు తేల్చి చెప్పారు.దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది.
బహదూర్ పల్లికి చెందిన పిట్ల వీరయ్య అనే వ్యక్తికి 641, 642, 643, 644 సర్వే నెంబర్‌లలో ఏడెకరాల తొమ్మిది గుంటల స్థలం ఉండేదని బాధితులు తెలిపారు. పిట్ల వీరయ్యకు ఇద్దరు భార్యలు.. మొదటి భార్యకు ఇద్దరు కొడుకులు, రెండో భార్యకు ఓ కొడుకు ఉన్నారని చెప్పారు. ఏడెకరాల తొమ్మిది గుంటల స్థలాన్ని ముగ్గురు కొడుకులు సమానంగా పంచుకోవాలని వీలునామా సైతం రాసుకున్నారని.. అయితే 1970లో 641 సర్వే నెంబర్‌లోని రెండెకరాలను మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డికి పిట్ల వీరయ్య మొదటి భార్య కొడుకులు పిట్ల చంద్రయ్య, పిట్ల నరసింహులు అమ్మేసినట్టు వివరించారు.అయితే 642, 643, 644 సర్వే నెంబర్‌లలో ఉన్న మిగతా ఐదెకరాలను కూడా మల్లారెడ్డి కబ్జా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.ఈ విషయంపై కోర్టులో పిటిషన్ వేశామని, సర్వే చేయించుకొని ఎవరి స్థలాన్ని వారు తీసుకోవాలని కోర్టు ఉత్తర్వులు సైతం ఇచ్చిందని బాధితుడు పిట్ల యాదగిరి తరఫు అడ్వకేట్ రమణ తెలిపారు.

ఇరు వర్గాల వారికి కోర్టు ఆర్డర్స్ ఇస్తేనే సర్వే చేసేందుకు అనుమతి ఇస్తామంటూ స్థానికులు బాధితులను అడ్డుకున్నారు. ఒక వర్గానికే కోర్టు ఆర్డర్స్ ఇవ్వడం వల్లే సర్వేను అడ్డుకుంటున్నామని పేర్కొన్నారు.దీంతో కోర్టు ఆర్డర్‌తోనే మళ్లీ వచ్చి సర్వే చేస్తామని బాధితులు స్పష్టం చేశారు.మొత్తంగా ఓ పక్క ఈడీ నోటీసులు.. మరోపక్క మల్లారెడ్డి యూనివర్సిటీలో తమకు ఐదెకరాల స్థలం ఉందంటూ బాధితులు ఆందోళనకు దిగడంతో మాజీమంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.