ఆంధ్రప్రదేశ్ రాజకీయం

15 లక్షల మందికి ఆరోగ్య సేవలు

అమరావతి అభివృద్ధికి సంబంధించి రోజుకో అప్‌డేట్ వచ్చింది. ఇప్పటికే కొత్త రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు వంటి ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజలకు మరో శుభవార్త చెప్పింది. దీంతో రాష్ట్రంలోని దాదాపు 15 లక్షల మంది లబ్ధి పొందే అవకాశం ఉంది. ఏపీ రాజధాని అమరావతిలో 500 పడకల ఈఎస్‌ఐ సెకండరీ కేర్‌ ఆసుపత్రి, 150 పడకల సూపర్‌ స్పెషాలిటీ వైద్య కళాశాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా సమ్మతి తెలిపింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఈఎస్‌ఐ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి.. విభజన తర్వాత తెలంగాణకు వెళ్లిపోయింది. దీంతో అమరావతిలో ఏర్పాటు చేయాలని ఇటీవల ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. జాతీయ వైద్య కమిషన్‌ నిబంధనల ప్రకారం.. వైద్య కళాశాల ఏర్పాటుకు 25 ఎకరాలు, ఈఎస్‌ఐసీ నిబంధనల ప్రకారం 500 పడకల ఆసుపత్రి నిర్మాణానికి 10 ఎకరాలు ఉండాలి. ఈ భూములను ఏపీ ప్రభుత్వం కేటాయించనుంది.ఈ ఆసుపత్రి నిర్మాణం, నిర్వహణ బాధ్యతను ఈఎస్‌ఐ కార్పొరేషన్‌కే అప్పగిస్తే.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి భారం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహణ బాధ్యతను తీసుకుంటే.. ఒప్పందం వ్యయంలో 1/8 వంతు భరించాల్సి ఉంటుంది.

ఆసుపత్రి, వైద్య కళాశాలను అమరావతిలో ఏర్పాటు చేయాలనుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పటికే అమరావతిని కలుపుతూ జాతీయ రహదారులు, రైలు మార్గాలు వస్తున్నాయి. భవిష్యత్తులో ఐటీ కంపెనీలు, హోటళ్లు, విద్యా సంస్థలు, పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14,55,987 మంది ఈఎస్‌ఐ ఉద్యోగులు ఉన్నారు. కేవలం విజయవాడ, గుంటూరు నగరాల పరిధిలో  4 లక్షలకుపైగా ఉన్నారు. వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. వీరిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర స్థాయి ఆసుపత్రిని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు.