రూ. 2.94 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌కు అంకెలకు మించిన ప్రాధాన్యం ఉందన్నారు. గత ప్రభుత్వ విధానాలతో ఆర్ధిక రంగం కుదేలైందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ స్తంభించిపోయాయని, ముఖ్య పధకాలకు చెల్లింపులు జరగలేదని ఆరోపించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాల్సి ఉందని చెప్పారు. సంక్రాంతి నాటికి “గుంతలు లేని రహదారుల ఆంధ్ర” తమ లక్ష్యం అన్నారు మంత్రి పయ్యావుల. ఈ సెషన్లో సభ ముందుకు కీలక బిల్లులు రానున్నాయి. — ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక చట్టం 2024 తెచ్చే అవకాశం ఉంది. పాత చట్టాన్ని రద్దు చేయనున్నారు. — దేవాలయాల పాలకమండలిలో మరో ఇద్దరికి అవకాశం కల్పిస్తూ సవరణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం — గత ప్రభుత్వ జ్యుడీషియల్ కమిషన్ రద్దు చేస్తూ బిల్లు — జ్యుడీషియల్ అధికారుల రిటైర్మెంట్ వయసు 61ఏళ్లకు పెంపు — గత సర్కారు తెచ్చిన ప్రభుత్వ మద్యం దుకాణాలు రద్దు చేస్తూ బిల్లు
కేటాయింపులు ఇలా..
రూ.2,94,427 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్
రెవెన్యూ వ్యయం అంచనా -రూ.2.35 లక్షల కోట్లు
మూలధన వ్యయం అంచనా -రూ.32,712 కోట్లు
రెవెన్యూ లోటు – రూ.34,743 కోట్లు
ద్రవ్యలోటు -రూ.68,743 కోట్లు
GSDPలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం
పరిశ్రమలు, వాణిజ్యం- రూ.3,127 కోట్లు
నీటిపారుదల -రూ.16,705 కోట్లు
గృహనిర్మాణం -రూ.4012 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి -రూ.11,490 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి -రూ.16739 కోట్లు
ఆరోగ్యం -రూ.18,421 కోట్లు
ఉన్నత విద్య -రూ.2326 కోట్లు
ఎస్సీ సంక్షేమం -రూ.18,497 కోట్లు
ఎస్టీ సంక్షేమం -రూ.7,557
బీసీ సంక్షేమం -రూ.39,007 కోట్లు
అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం -రూ.4,376 కోట్లు
వ్యవసాయ, అనుబంధ రంగాలు -రూ.11,855 కోట్లు
మహిళా, శిశు సంక్షేమం -రూ.4285 కోట్లు
స్కిల్ డెవలప్మెంట్ -రూ.1215 కోట్లు
పాఠశాల విద్య శాఖకు రూ.29,909 కోట్లు
ఇంధన శాఖ -రూ.8,207 కోట్లు
బీసీ సంక్షేమం, విద్యకు ప్రాధాన్యం
సోమవారం అసెంబ్లీలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వం వచ్చి ఆరునెలలు పూర్తి కావడంతో.. మరో ఆరునెలలకు మాత్రమే దీన్ని ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసం జరిగిందన్న మంత్రి పయ్యావుల, రాష్ట్ర పునర్నిర్మాణమే అజెండాగా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు చెప్పుకొచ్చారు.2019-2024 మధ్య కాలాన్ని చీకటి దశగా తన ప్రసంగంలో ప్రస్తావించారు విత్త మంత్రి. ప్రజావేదికను కూల్చివేత నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు, మూడు రాజధానుల నమూనాతో ప్రజలను అయోమయానికి గురి చేసిందన్నారు. దీని ఫలితంగా రాష్ట్రాభివృద్ధికి దోహదపడే పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడంతో ఆర్థిక స్థితి విచ్ఛిన్నమైందన్నారు.కేశవ్ బడ్జెట్లో రెండు రంగాలకు ప్రయార్టీ ఇచ్చారు. వాటిలో బీసీ సంక్షేమం (39,007 కోట్ల రూపాయలు) ఒకటైతే.. మరొకటి పాఠశాల విద్య(29,909 కోట్ల రూపాయలు)కు అధిక ప్రాధ్యాన్యత ఇచ్చారు. ఉపాధ్యాయులు బోధనపై మరింత దృష్టి పెట్టేందుకు వీలుగా అనవసరమైన యాప్‌లను తొలగించినట్టు చెప్పుకొచ్చారు.
తద్వారా ఉపాధ్యాయులపై యాప్ భారాన్ని తగ్గించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి, విద్యా వ్యవస్థలో యువ ఉపాధ్యాయుల నూతన శక్తిని నింపేందుకు 16,347 పోస్టులను భర్తీకి మెగా డీఎస్సీ నియామకాన్ని ప్రకటించడం జరిగిందన్నారు.కళాశాలల నుంచి ధృవ పత్రాలు పొందేందుకు విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మెట్రిక్ అనంతర ఉపకార వేతనాల నిధులను ప్రభుత్వం నేరుగా కళాశాలల ఖాతాలలోకి జమ చేయనుంది. గత ప్రభుత్వం మిగిల్చిన పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను దశల వారీగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.ప్రభుత్వం 192 నైపుణ్య కేంద్రాలు, నైపుణ్య కళాశాలల్లో మౌలిక వనరులను బలోపేతంపై దృష్టి సారించింది. ప్రాధాన్య రంగాలలో విదేశీ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా నైపుణ్యాభివృద్ధి శాఖకు 1,215 కోట్ల రూపాయల కేటాయించింది. మూడో ప్రయార్టీగా పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధికి 16 వేల 739 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం.