తెలంగాణ రాజకీయం

రేవంత్ కు హరీశ్ సవాల్

తెలంగాణలో రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పి.. రైతులను మోసం చేసింది. ఇక్కడి ప్రజలను మోసం చేసింది చాలదన్నట్లు.. ఇప్పుడు మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు విమర్శించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ఆరు హామీల్లో మొదటి హామీనే అమలు చేయలేదని విమర్శించారు. కానీ, రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు వెళ్లి అబద్ధాలు చెబుతున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రూ. 2500 ఇస్తామని హామీ ఇచ్చింది.. ఇప్పటికీ 11 నెలలు అవుతోంది.. మహిళలకు డబ్బులు ఇచ్చారా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. మహారాష్ట్రకు వెళ్లి మాత్రం తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినట్లు చెబుతున్నారని రేవంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

40లక్షల మందికి రుణమాఫీ జరిగిందని ఏఐసీసీ ట్విటర్ లో ప్రచారం చేస్తోంది.. 20లక్షల మంది రైతులకే రుణమాఫీ జరిగింది.. ఇంకా 22లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉంది. ఆలస్యంగా చేసిన రుణమాఫీ వల్ల రైతులు వడ్డీ కట్టాల్సి వచ్చిందని హరీశ్ రావు అన్నారురైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదు. వరికి బోనస్ తెలంగాణలో ఎక్కడైనా ఇస్తున్నారా? రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మహారాష్ట్రలో రేవంత్ ఎందుకు చెప్పలేదని హరీశ్ రావు ప్రశ్నించారు. 10నెలల్లో 50వేల ఉద్యోగాలు ఇచ్చామని ప్రచారం చేసుకుంటున్నారు.. మహారాష్ట్రలో కాంగ్రెస్ మోసం చేసే విధంగా మ్యానిఫెస్టోలో పెట్టింది. మహారాష్ట్రలో తప్పుడు పత్రికా ప్రకటనలు ఇస్తున్నారు. 24గంటల విద్యుత్ ఘనత కేసీఆర్ కే దక్కుతుందని హరీశ్ రావు అన్నారు.