పోసాని కృష్ణమురళి.. సినిమాల్లో మల్టీ రోల్స్ పోషించి సక్సెస్ అయ్యారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో, రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇలా విభిన్న రూల్స్‌లో తనని తాను నిరూపించుకున్నారు. ఇండస్ట్రీలో కెరీర్ కంఫర్టబుల్‌గా ఉన్న టైంలోనే ఆ కాంట్రావర్సీ నటుడుకి రాజకీయాలపై ప్రేమ పుట్టుకొచ్చింది. 2009 ఎన్నికల ముందు ప్రజారాజ్యంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో మొట్టమొదట సారి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. చిలకలూరిపేట పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి తనకు ఎలాంటి పొలిటికల్ ఇమేజ్ లేకపోయినా… చిరంజీవి పుణ్యాణ 14 వేల ఓట్లు మాత్రం దక్కించుకుని మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు వైసీపీ స్థాపన తరువాత పోసాని కృష్ణ .. జగన్ పంచకు చేరారు. జగన్ పాదయాత్రలోనూ పాల్గొన్నారు. అయితే జగన్ మాత్రం 2014 నుంచి 2024 వరకు ఏ ఎన్నికల్లోనూ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అయినా 2019 ఎన్నికల సమయంలో జగన్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఇండస్ట్రీలో మెంటల్ కృష్ణగా పేరున్న పోసాని నోటి దూకుడు నచ్చి తాను అధికారంలోకి వచ్చాక జగన్ ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదా కట్టబెట్టారు. ఇక అప్పటి నుంచి పోసాని నోటికి అడ్డు అదుపులేకుండా పోయిందన్న విమర్శలున్నాయి
వైసీపీ బూతు నేతల కంటే ఎక్కువగా చంద్రబాబు, పవన్‌లను టార్గెట్ చేశారు .. తాను కమ్మ సామాజికవర్గానికి చెందిన వాడినని చెప్పుకుంటూనే.. కులాన్ని కించపరిచేలా మాట్లాడం, చంద్రబాబు కులాని వాడుకుంటున్నారని విమర్శించడం ఆయనకే చెల్లింది. ఆ క్రమంలో విపరీతంగా బూతు ప్రయోగాలు కూడా చేసి తీవ్ర వివాదాల్లో చిక్కుకున్నారు. ఇక మెగా ఫ్యామిలీపై ఆయన విమర్శలకు హద్దుపొద్దూ లేదంటారు. ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ సభలకు వచ్చే జనం ఎవరూ ఓట్లు వేయరని.. పవన్ కల్యాణ్ ఓ మెంటల్ కేసని ప్రెస్ మీట్లు పెట్టి మరీ స్టేట్‌మెంట్లు ఇచ్చారు. అసలు మెగా ఫ్యామిలీ పైసల కోసమే పార్టీలు పెట్టిందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పవన్‌పై పోసాని చేసిన విమర్శలతో అప్పట్లో జనసైనికులు, వీర మహిళలు పలు కేసులు పెట్టారు. అయితే వైసీపీ అధికారంలో ఉండటంతో పోలీసులను వాటిని పట్టించుకోలేదు.
అయితే వీర మహిళల పోరాటంతో రాజమండ్రి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో 2022లో ఆయన పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన వీర మహిళ ఇందిర గతంలో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. దాన్ని పోలీసులు పట్టించు కోకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసినప్పటికీ పోలీసులు పోసానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పట్లో ఆ వ్యవహారం పెద్ద సంచలనంగా మారింది.కూటమి ప్రభుత్వం వచ్చాక అప్పటి దాకా నోటికి పనిచెప్పిన పలువురు వైసీపీ సీనియర్లు సైలెంట్ అయ్యారు. మెంటల్ కృష్ణ మాత్రం నోటి దూకుడు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. లడ్డూ వివాదం, డిక్లరేషన్ రగడ, జగన్ తిరుమల పర్యటన రద్దు తదితర అంశాలపై పోసాని కృష్ణమురళి అప్పట్లోతీవ్రంగా స్పందించారు. సీఎం చంద్రబాబు టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు . అంతా కలిసి జగన్ ను ఎందుకు ఇంతలా హింసిస్తున్నారని పోసాని ప్రశ్నించారు. జగన్ తిరుమలకు వెళ్లకుండా అడ్డుకోవడం దారుణం అని బోల్డు ఆవేదన వ్యక్తం చేశారుపనిలోపనిగా జగన్ కు ప్రాణగండం ఉందని పోసాని సంచలన ఆరోపణలు చేశారు.
దయచేసి జగన్ ను మాత్రం మర్డర్ చేయించమాకు, మీకు పెద్ద హిస్టరీ ఉంది నాకు తెలుసు.. అంటూ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారాయన. ఎప్పుడు పోతామో ఎవరికి తెలుసు, అయినా భయపడేది లేదని హీరోయిజం ప్రదర్శించారు.రాష్ట్రంలో పొలిటికల్ సీన్ మారినా పోసాని మాత్రం దూకుడు తగ్గించడం లేదు. అదే ఆయన మెడకు చుట్టుకునేలా కనిపిస్తుందంటున్నారు. గత ప్రభుత్వంలో టీడీపీ, జనసేన అధినేతల్ని ఇష్టమెుచ్చినట్లు తిట్టిన వారిపై పాత కేసులను పోలీసులు తిరగదోడుతున్నారు. వరుసగా అరెస్టులు కూడా జరుగుతున్నాయి. ఆధారాలతో కేసులు పెడితే చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారుల ప్రకటిస్తున్నారు. ఇటు పోసానిపై నోరు పారేసుకున్నందుకు ఇప్పటికే పెండింగ్ కేసులు ఉన్నాయి.ప్రాధాన్యతా క్రమంలో పోసాని పాతకేసు ఫైళ్లు ఎప్పుడైనా దుమ్ము దులపవచ్చంటున్నారు. ఇక ఓటమి తర్వాత కూడా ఆయన నోటికి పనిచెప్తుండటంతో కొత్త కేసులు నమోదైతే ఆయన పరిస్థితి ఏంటన్న చర్చ నడుస్తుంది.
ఇప్పటికే మెగా ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇండస్ట్రీలో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్న పోసాని మున్ముందు సిల్వర్‌స్క్రీన్‌పై కనిపిస్తారా? లేదా ? అన్నది డౌటే. ఇక పదిహేనేళ్ల రాజకీయ జీవితంతో ఏమన్న సాధించారా అంటే పదేళ్లు ఆయన నోటిని వాడుకున్న జగన్ కనీసం టికెట్ కూడా ఇవ్వలేదు. ఇక ఇప్పుడు కేసుల చట్రంలో ఇరుక్కుంటే మెంటల్ కృష్ణకి అండగా నిలిచేదెవరు?.. అదే ఇప్పుడు రెండు ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్ గా మారింది