ఆంధ్రప్రదేశ్ రాజకీయం

వంశీరామ్ కు వరస తలనొప్పులు

లిటిగేషన్ భూముల్లో లే అవుట్లు వేయాలంటే అది ఒక్క వంశీరాం బిల్డర్స్‌కే చెల్లు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్నాళ్లూ ఆడిందే ఆటగా సాగించాడు వంశీరాం సుబ్బారెడ్డి. కేటీఆర్ బినామీగా ముద్ర పడిన ఈయన, గత పదేళ్లలో ఎన్నో లిటిగేషన్ భూములకు లైన్ క్లియర్ అయింది. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపట్టాడు. కానీ, ప్రభుత్వం మారడంతో సీన్ రివర్స్ అయింది. తెలంగాణ వ‌చ్చే నాటికి బంజారాహిల్స్ 403 స‌ర్వే నెంబ‌ర్‌లో వంద‌ల‌ ఎక‌రాలు ఖాళీగా ఉంది. అందులో సుప్రీం తీర్పుల‌తో కొంతమంది వ‌శ‌మైంది. కానీ, ఓ 5 ఎక‌రాల భూమి నిరంత‌రం స‌మ‌స్య‌ల సుడిగుండంలో తిరుగుతూ ఉంది. ఆ భూమిలో బీఆర్ఎస్ స‌ర్కార్ వచ్చాక వంశీరాం బిల్డ‌ర్స్ నిర్మాణాలు చేప‌ట్టింది. దీనివెనుక ఎంతో బ‌రితెగింపు నిర్ణ‌యాలు ఉన్నాయి. 1954 – 1955లో 403 స‌ర్వే నెంబ‌ర్‌ ప్ర‌క‌టించారు. బై నెంబ‌ర్స్ వేస్తూ పట్టా భూమి అని ప‌హానీల్లో పేర్లు పొందుప‌ర్చారు. ఇందులో 5 ఎకరాల వివాదాస్పద భూమిలోకి వంశీరాం బిల్డర్స్ ఎంటరైంది. కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండ‌గానే 2 ఎకరాల భూమి కోసం వంశీరాం బిల్డర్స్ రూ.47 కోట్లు చెల్లించి రిజిస్ట్రేష‌న్ చేయించుకుంది.

అమ్మకం దారుడికి గతంలో ప్ర‌భుత్వం రెగ్యుల‌రైజేష‌న్ చేసింది 6,700 మీట‌ర్లే. కానీ, మ‌రో వెయ్యి మీట‌ర్లు ఎక్కువ రిజిస్ట్రేష‌న్ చేసుకున్నారు. స‌ర్వే చేయ‌కుండానే భూమి ఎంత ఉంది. ఎంత రిజిస్ట్రేష‌న్ అయిందో తెలియ‌కుండానే అన్నీ జ‌రిగిపోయాయి. ప‌నులు ప్రారంభమ‌య్యాయి. హైకోర్టులో, లోయ‌ర్ కోర్టులో కేసులు ఉండ‌టంతో లోన్స్ ఇచ్చేందుకు బ్యాంక‌ర్లు ముందుకు రాలేదు. దీంతో బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో ఉండే పెద్ద‌ల బంధువులు పెట్టుబ‌డులు పెట్టారు. రూ.100 కోట్ల‌కు పైగా బ్లాక్ మ‌నీ పెట్టుబడుల రూపంలో ఇక్క‌డి నిర్మాణాల కోసం చేరింద‌ని స‌మాచారం. 2017లో అనుమ‌తులు వ‌చ్చినా, డ‌బ్బుల కొర‌త‌తో ప్లాన్ రివైజ్ పేరుతో 2021 వ‌ర‌కు అప్‌గ్రేష‌న్ చేసుకున్నారు. ఇప్పుడు 40 ఏళ్లుగా ఉన్న‌ ఈ లిటిగేష‌న్ భూమిలో కొంటే అంతే అని గ్రహించి ఇప్పుడెవరూ ముందుకు రావడం లేదు.బంజారాహిల్స్ వివాదాస్పద భూమిలో అక్రమంగా అనుమతులు పొంది, కోట్ల రూపాయలు వెనకేసుకున్న వంశీరాం బిల్డర్స్ ఖాజాగూడలో రూ.3వేల కోట్ల విలువైన 27 ఎకరాల పొరంబోకు భూమిపైనా కన్నేసింది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిపై ఫైట్ చేసి ఉంటే వేల కోట్ల ఆదాయం వచ్చేది. ఓ జూనియర్ న్యాయవాది అయిన ప్రభుత్వ అసిస్టెంట్ ప్లీడర్‌తో ఎలాంటి వివాదం లేదని చెప్పించింది. దీంతో హైకోర్టు కలెక్టర్‌కే తుది నిర్ణయం అప్పగించగా, ఇదే అదునుగా ఆ పొరంబోకు స్థలం పట్టాగా మారిపోయింది. దీనికోసం 60 కోట్ల రూపాయలు అప్పటి కలెక్టర్ తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. సర్వే నెంబర్ 27లో మొత్తం 64 ఎకరాల 26 గుంటల భూమి ఉంది. ఇదంతా పోరంబోకు స్థలం. సేత్వార్, ఖాస్రా పహాణీలో రికార్డ్ అయి ఉంది. పాత సర్వే నెంబర్స్ 117/3/1 పేరుతో సేస్సాల్‌లో 1955 – 58 వరకు ప్రభుత్వ భూమిని డివైడ్ చేశారు. ఆ తర్వాత దూడల సాయన్న పేరు తెరపైకి వచ్చింది. పొజిషన్ కాలంలో ఇది రికార్డు అయింది. 2023 వరకు రికార్డుల్లో ఉన్న పోరంబోకు భూమిని, సడెన్‌గా పట్టాదారుడికి పట్టం కట్టేలా నిర్ణయాలు తీసుకున్నారు అప్పటి కలెక్టర్, సీసీఎల్ఏ అధికారులు. అత్యంత విలువైన, వివాదాస్పద భూమిని వంశీరాం బిల్డర్స్ సుబ్బారెడ్డికి అంటగట్టడంలో అనేక మలుపులు ఉన్నాయి. పట్టా భూమిగా ఉత్తర్వులు ఇస్తే 1960 నుంచి 1995 వరకు అనుభవదారుని కాలంలో ఉన్న 20 మంది రైతులకు రక్షిత కౌలుదారు చట్టం – 1950 వర్తిస్తుంది.

ఒరిజినల్ సూట్ (నెం.17 ఆఫ్ 1999)లో పల్లవి స్కూల్ కొమురయ్య కుటుంబానికి వ్యతిరేకంగా పావులు కదిపారు. 2006లో రైతులకే డిక్రీ ఇస్తూ రంగారెడ్డి సివిల్ కోర్టు తీర్పునిచ్చింది. పల్లవి స్కూల్‌ లే అవుట్ చేసిన తర్వాత బేవర్లీ హిల్స్ ఓనర్స్ సొసైటీ వాళ్లు ఓఎస్ (నెం.587/1999) దాఖలు చేశారు. కానీ, 2007లో కోర్టు కొట్టివేసింది. మళ్లీ కౌలు రైతులు 2001లో మరో సూట్ (ఓఎస్ నెం.114/2001) దాఖలు చేశారు. దీనిపై 2013న ఫైనల్ అర్డర్ వచ్చింది. కౌలుదారులకే ఈ భూమి వస్తుందని తెలిపారు. బేవర్లీ వాళ్లు అప్పీల్‌కి వెళ్తే అక్కడ ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ భూమిపై ఇరు పార్టీలు కాంప్రమైజ్ అయ్యాయి.నార్సింగి ఏరియాలో మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి 5 ఎకరాలకు ఎసరు పెట్టారు. అనుకున్నది అనుకున్నట్లు సక్సెస్ అయ్యారు. అన్ని అనుమతులు వచ్చాయి. 38 అంతస్తుల కమర్షియల్, మల్టిప్లెక్స్ బిల్డింగ్ నిర్మాణం మొదలైంది. సర్వే నెంబర్ 205లో జరిగిన అక్రమాలపై ఆరా తీస్తే, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, క్రెడాయికి చెందిన కాశం రాజేశ్వర్, వంశీరాం సుబ్బారెడ్డి ఘనకార్యం బయటపడింది.

గత ప్రభుత్వాలను మేనేజ్ చేసి స్పెషల్ జీవోలు ఇప్పించుకున్నా, చిన్న చిన్న తప్పిదాలతో టైటిల్ వివాదాలు కొనసాగుతున్నాయి. 2019లో డెవలప్మెంట్‌కి కాశం రాజేశ్వర్ అనే బిల్డర్ భూమిని తీసుకుని బీఆర్ఎస్ సహాయ సహకారాలతో క్లియర్ చేసుకున్నాడు. 2020లో ధరణిలో మళ్లీ అమోయ్‌ కుమార్ గత చరిత్ర తవ్వి కొర్రీలు పెట్టాడు. ఆయనకు పర్సంటేజీలు వెళ్లడంతో ధరణిలో క్లియర్ చేశారు. ఇదంతా వంశీరాం సుబ్బారెడ్డి ఎంట్రీతో క్లియర్ అయిందని వినికిడి. అమోయ్ కుమార్ ధరణిలో ఎంట్రీలతోనే ప్రస్తుతం ఉన్న బౌండరీలు ఫిక్స్ చేసుకుని పొజిషన్‌లో ఉన్నవారిపై కేసులు పెట్టించి ఖాళీ చేయించారు. దీంతో ప్రభుత్వానికి 2013లోనే 50 లక్షల రూపాయల ఆదాయం రాకుండా పోయింది. నాలా కన్వర్షన్ చేసుకోకుండానే కేవలం వ్యవసాయ భూమి విలువతోనే డీజీపీఏ కమ్ జీపీఏ చేసుకున్నారు. దీంతో రూ.15 లక్షల్లో మొత్తం భూమి వంశీరాం వినీల్ వెంచర్స్ ఎల్ఎల్‌పీకి బదలాయించారు. ఇదే భూమి నాలా కన్వర్షన్ చేస్తే ప్రభుత్వానికి అక్షరాలా రూ.45 కోట్లకు స్టాంప్స్ అండ్ డ్యూటీ చెల్లించాల్సి ఉండేది.

హయాంలో అన్నీ అనుకున్నట్టు జరగగా, ఇప్పుడు వంశీరాం సుబ్బారెడ్డి ఏది అనుకున్నా రివర్స్ కొడుతోంది. దీంతో బిచాణా ఎత్తేస్తున్నాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఖాజాగూడ 27/2లో 25 ఎకరాల ప్రభుత్వ భూమి విషయంలో లాలూచీ పడి చేయించుకున్న వ్యవహారాల్లో చిక్కులు మొదలయ్యాయి. ఇంకా ఇతర ప్రాజెక్టుల్లోనూ ఇదే తంటా. ఖాజాగూడలో అయితే, 5 లక్షల స్క్వేర్ ఫీట్లు అమ్ముడుపోక ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బిచాణా ఎత్తేసే పరిస్థితికి వచ్చేసినట్టు తెలుస్తోంది. పైగా వంశీరాం బిల్డర్స్‌పై మార్కెట్‌లో విలువ తగ్గిపోయింది. దీంతో భూములు, సొంత ఆస్తులను అమ్మకానికి పెట్టినట్టు సమాచారం. గత ప్రభుత్వంలో మ్యానేజ్ చేసి అనుమతులు తీసుకుంటే, ఇప్పుడు ప్రభుత్వం మారడంతో తంటాలు పడాల్సి వస్తోంది. లిటిగేషన్ ల్యాండ్స్ కావడంతో వంశీరాం భూములు తీసుకునేందుకు జనం వెనుకాడుతున్నారు. దీంతో దీన్ని కొనసాగించాలా లేదా అయోమయంలో వంశీరాం సుబ్బారెడ్డి ఉన్నాడు.

థర్డ్ పార్టీ దొరికితే సెటిల్మెంట్‌కు ఇచ్చే యోచనలో ఉన్నాడని తెలుస్తోంది. ఉన్న అప్పులు తీర్చుకుని ఇందులో నుంచి ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా బయటపడే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. గతంలో ఈడీ, ఐటీని మ్యానేజ్ చేసిన వంశీరాం, ఈసారి ఏం చేయాలన్నా కుదరడం లేదు. ఆ తంటాలు పడలేక, కోర్టు చుట్టూ తిరగలేక బిచాణా ఎత్తేసే ప్లాన్ చేసుకున్నట్టు రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది