తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఛైర్మన్ పదవికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. టీజీపీఎస్సీకి ప్రస్తుతం మహేందర్‌రెడ్డి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన పదవీకాలం డిసెంబరు 3వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో మరో ఛైర్మన్‌ను నియమించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 20న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు ఫారం, అర్హతలు, ఇతర వివరాలు www.telangana.gov.in వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు వెల్లడించింది. పూర్తిచేసిన దరఖాస్తులను దరఖాస్తు గడువులోగా [email protected] కు పంపించాలని కోరింది. ప్రభుత్వం నియమించిన స్క్రీనింగ్ కమిటీ దరఖాస్తులను పరిశీలించి, నేరుగా ఎంపిక చేస్తుందని ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు హిందీ, మరాఠీ మాధ్యమాల ప్రశ్నపత్రాలూ ముద్రణ: ఇంటర్‌బోర్డు
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో హిందీ, మఠారీ మాధ్యమాల్లో పరీక్షలు రాసే విద్యార్థులకు ఆయా మాద్యమాల్లో ముద్రించిన ప్రశ్నపత్రాలు ఇవ్వనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇంటర్‌బోర్డుకి చెందిన ఓ అధికారి తెలిపారు. ఇప్పటివరకు ఆయా మాధ్యమాలకు చెందిన విద్యార్థులకు చేతి రాతతో రాసి ప్రశ్నాపత్రాలను జిరాక్స్ చేసి ఇచ్చేవారు. ప్రతి సంవత్సరం హిందీ మాధ్యమంలో 100 మందిలోపు, మరాఠీ మాధ్యమంలో 300 మందిలోపు విద్యార్థులు పరీక్షలు రాస్తుంటారు. దీంతో ప్రింట్ చేయకుండా చేతిరాతతో కూడిన ప్రశ్నాపత్రాన్నే జారీ చేసేవారు. అయితే ఈ ఏడాది నుంచి వారందరికీ కూడా ముద్రించి ప్రశ్నాపత్రాలను ఇవ్వాలని ఇంటర్ బోర్డు భావిస్తుంది. కన్నడ మాధ్యమంలో 50 మందిలోపు ఉన్నా ఆ ప్రశ్నపత్రాలను ముద్రించే ఇస్తున్నారు. ఈ విధంగానే హిందీ, మరాఠీ ప్రశ్నపత్రాలను కూడా ముద్రించే ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు.
ఇంటర్ బోర్డులో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి అవసరమైన చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని ఇంటర్ విద్యా ఐకాస ఛైర్మన్ మధుసూదన్‌రెడ్డి ఓ ప్రకటనలో కోరారు. బోర్డుకు శాశ్వత కార్యదర్శి, పరీక్షల కంట్రోలర్, పరీక్షల విభాగానికి శాశ్వత సంయుక్త కార్యదర్శిలను ఇప్పటి వరకు నియమించలేదని ఆయన తెలిపారు. సాంకేతికత ఇంత అభివృద్ధి చెందినా ఇంకా మాన్యువల్‌గానే ప్రశ్నాపత్రాలను రూపొందిస్తున్నారని, దాంతో తప్పులు దొర్లి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. వెంటనే శాశ్వత అధికారులను నియమించి, బోర్డు కార్యకలాపాలను సజావుగా నడపాలని ఆయన కోరారు.