అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఘన విజయం సాధించారు. 312 ఎలక్టోరల్ ఓట్లతో వైట్‌హౌస్‌లో అడుగు పెట్టబోతున్నారు. 2025, జనవరిలో అధికార మార్పిడి జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆయన తన పాలకవర్గం కూర్పుపై కసరత్తు చేస్తున్నారు. సమర్థులు, పార్టీలోని తన విధేయులకు కీలక బాధ్యతలు ఇప్పగిస్తారని తెలుస్తోంది. ఈమేరకు ఇప్పటికే కొంతమంది పేర్లు అమెరికా మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. భారత సంతతికి చెందిన నిక్కీ హేలీకి హ్యాండ్ ఇచ్చిన ట్రంప్.. తాజాగా వివేక్ రామస్వామికి కూడా మొండి చేయి చూపారని ప్రచారం జరుగుతోంది. కీలకమైన విదేశాంగ శాఖ కార్యదర్శి పదవికి తన సన్నిహితుడైన మర్కో రూబియా పేరును ఆయన పరిశీలిస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో రామస్వామి ఆశలు గల్లంతయ్యాయని అంటున్నారు. ఇండో అమెరికన్ అయిన వివేక్ రామస్వామికి ట్రంప్ విదేశాంగ శాఖ కార్యదర్శి పదవి ఇస్తారని గతంలో చర్చ జరిగింది.
ఇప్పుడు మార్కో పేరును తెరపైకి తెచ్చిన క్రమంలో వివేక్ రామస్వామికి కూడా ట్రంప్‌హ్యాండ్ ఇస్తారా అన్న చర్చ జరుగుతోంది. కొందరు వివేక్‌కు వేరే పదవి ఇస్తారని అంటుండగా, కొందరు నిక్కీ హేలీ తరహాలోనే వివేక్‌ను పక్కన పెడతారని పేర్కొంటున్నారు. వివేక్ రామస్వామి అధ్యక్ష అభ్యర్థి కోసం రిపబ్లికన్ పార్టీలో ట్రంప్‌తో పోటీ పడ్డారు. నిక్కీహేలీ, వివేక్ రామస్వామి ప్రైమరీలో ట్రంప్‌కు గట్టి పోటీ ఇస్తారని అంతా భావించారు. కానీ, రామస్వామి కనీస పోటీ కూడా ఇవ్వలేదు. నిక్కీ హేలీ కొన్ని రాష్ట్రాల్లో పోటీ ఇచ్చారు. కానీ, ట్రంప్‌ను అధిగమించలేదు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక వీరికి మంత్రి పదవులు వస్తాయని భావించారు. కానీ, నిక్కీ హేలీని తన కార్యవర్గంలోకి తీసుకోవడం లేదని ట్రంప్ ప్రకటించారు. తన సోషల్ మీడియాలో ఈమేరకు పోస్టు చేశారు. ఇక వివేక్‌రామస్వామి విషయంలో ట్రంప్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, వివేక్ ఆశించిన విదేశాంగ శాఖ కార్యదర్శి పదవికి మరొకరి పేరు పరిశీలించడంతో ఆయన ఆశలు ఆవిరయ్యాయి.
ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మార్క రూబియో కీలకంగా వ్యవహరించారు. రూబియో 2010 నుంచి సెనెట్‌లో పనిచేశారు. రీ మార్కో రూబియో ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌పై సెనేట్ సెలెక్ట్ కమిటీలో వైస్ చైర్మన్‌గా ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున జేడీ వాన్‌ను ట్రంప్ రన్నింగ్‌మేట్‌గా ప్రకటించకముందే రూబియో ఆ రేసులో ఉన్నారు. అయితే వాన్ రన్నింగ్‌మేట్ కావడంతో రూబియోకు కేబినెట్ పదవి ఖాయమని తెలుస్తోంది.