తెలంగాణ రాజకీయం

కాషాయ దళపతి రేసులో నలుగురు

రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఆ నలుగురు నేతల లాబీయింగ్..
సంస్థాగత ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. బూత్ స్థాయి నుంచి మొదలుకుని రాష్ట్ర, జాతీయ అధ్యక్షుడి వరకు ఎన్నికల ప్రక్రియ ద్వారా నియామకం జరగనుంది. డిసెంబర్ నెలాఖరున రాష్ట్ర అధ్యక్ష పదవికి, జనవరిలో జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగే అవకాశముంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితోపాటు జాతీయ అధ్యక్షుడు ఎవరవుతారనే ఉత్కంఠ కాషాయ శ్రేణుల్లో కనిపిస్తోంది. అయితే రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే నలుగురు నేతలు లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరు అవుతారనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేసి.. ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతోన్న బండి సంజయ్ కు మరోసారి పార్టీ అధ్యక్ష పగ్గాలు దక్కుతాయనే టాక్ వినిపిస్తోంది. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక పార్టీలో జోష్ వచ్చిందంటున్నారు ఆ పార్టీ నేతలు. ఆయన ఆధ్వర్యంలోనే దుబ్బాక, హుజురాబాద్ బైపోల్ లో విజయంతో పాటు గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటామంటున్నారు.

అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద గట్టిగా పోరాడిన నేతగా సంజయ్ కు క్యాడర్లో గుర్తింపు ఉంది. ఇప్పుడు మళ్లీ గ్రేటర్ ఎన్నికలు వస్తుండటంతో పాటు పార్టీ అధికారంలోకి వచ్చేంత పటిష్టం కావాలంటే సంజయ్ ను అధ్యక్షుడిని చేస్తేనే బాగుంటుందన్న అభిప్రాయాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సడెన్ గా ఆయనను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడంతో బీజేపీ క్యాడర్ నిరుత్సాహానికి గురైంది. కట్టర్ బీజేపీ నేతగా.. మాస్ లీడర్ గా సంజయ్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనను తప్పించడం వల్ల జరిగిన డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకోవాలంటే తిరిగి మళ్లీ సంజయ్ నే ప్రెసిడెంట్ చేయాలన్న వాదన వినిపిస్తోంది.ఇక మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. బండి సంజయ్ ని అధ్యక్షుడిగా తప్పించి.. కిషన్ రెడ్డికి బాధ్యతలు ఇచ్చే సమయంలోనే ఈటల ప్రెసిడెంట్ అవుతారని చర్చ జరిగింది. కానీ ఆయనకు బాధ్యతలు ఇవ్వలేదు.

అయితే ఈటల రాజేందర్ ని పార్టీ ప్రెసిడెంట్ చేస్తే బీసీకి అవకాశం ఇచ్చినట్లు ఉంటుందని పార్టీ భావిస్తున్నట్లు టాక్.ఇక మరో నేత.. మెదక్ ఎంపీ రఘునందన్ రావు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రేసులో ఉన్నారు. ఆయన బీజేపీలో పుట్టి పెరిగిన నేత కాకపోయినా..ఆ పార్టీలో చేరగానే.. సిద్ధాంతాలను అడాప్ట్ చేసుకుని..ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన నేతలా పార్టీ కోసం గళం వినిపిస్తుంటారు. అంతేకాదు ప్రశ్నించే గొంతుగా రఘునందన్ కు ప్రజల్లో గుర్తింపు ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దుబ్బాకలో ఓడినా పట్టుబట్టి మెదక్ ఎంపీ టికెట్ తెచ్చుకుని గెలిచి సత్తా చాటారు రఘునందన్. ఇప్పుడు అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే.. పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని ఆయన చెప్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ సీనియర్ లీడర్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు కూడా పార్టీ అధ్యక్ష రేసులో ఉన్నారు. ఆయన పార్టీలో మొదటినుండి ఉన్న సీనియర్ నేత. గ్రేటర్ బీజేపీ ప్రెసిడెంట్ గానూ పనిచేసిన అనుభవం ఉంది.

ఒకవేళ ఆయనకు పార్టీ ప్రెసిడెంట్ పగ్గాలు అప్పగిస్తే..ఎలా ఉంటుందని కూడా అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా కాషాయ దళపతి రేసులో ఉన్నట్లు టాక్ నడుస్తోంది.ఆశావహులు ఎక్కువగా ఉండటంతో..సామాజిక సమీకరణాలు.. రాజకీయ పరిస్థితులపై లెక్కలు వేసుకుంటుందట పార్టీ హైకమాండ్. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ నేతకు అవకాశం ఇస్తే బాగుంటుందనే దానిపై కసరత్తు చేస్తుందట. అధిష్టానం ఆలోచన ఎలా ఉన్నా నేతల లాబీయింగ్ మాత్రం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి బీజేపీ హైకమాండ్ ఎలాంటి ముగింపు ఇస్తుందో చూడాలి.