ఆంధ్రప్రదేశ్ రాజకీయం

సిక్కోలు వైసీపీలో ప్రక్షాళన

శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన టెక్కలి, ఆమదాలవలస నియోజకవర్గాల సమన్వయకర్తలను మార్చిన అధినేత జగన్మోహన్ రెడ్డి తర్వాత ఏ నియోజకవర్గ నేతను మారుస్తారోనన్న ఉత్కంఠ పార్టీ క్యాడర్ లో నెలకొంది. 2024 సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఒక్క నియోజకవర్గంలో కూడా గెలవలేదు. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంతో పాటు శ్రీకాకుళం,నరసన్నపేట, టెక్కలి, పలాస, ఇచ్చాపురం, పాతపట్నం ,ఆమదావలస, ఎచ్చెర్ల శాసనసభ స్థానాలలో కూడా ఓటమి చవిచూసింది. ఎన్నికలలో పోటీ చేసిన నేతలే పార్టీ ఇన్ చార్జీలుగా ఉండేవారు. రాష్ట్రంలో వైకాపా ఘోర ఓటమి చెందడానికి గల కారణాలపై అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులతో మాట్లాడి ఫీడ్ బ్యాక్ నుతీసుకున్నారు. అథైర్యపడవద్దని 2029 ఎన్నికలలో ఖచ్చితంగా tగెలిచితీరుతామని అందుకోసం ఇప్పటి నుంచే పనిచేయాలని కూడా నేతలకి ఆయన దిశా నిర్దేశం చేసారు. అంతేకాకుండా వైకాపాబలోపేతం కోసం చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా వైకాపా అధ్యక్షుడుగా నాల్గవ సారి ధర్మాన కృష్ణదాస్ ను నియమించారు. అలాగే సీనియర్ లీడర్ తమ్మినేని సీతారాంని శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకులుగా బాధ్యతలను అప్పగించారు.

జిల్లాలో అన్ని నియోజకవర్గ నాయకులతో కలసి కార్యవర్గాన్ని ఏర్పాటుచేయడంతో పాటు అనుబంధ విభాగాలను పటిష్టం చేయాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు.    టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న ఎంఎల్ సి దువ్వాడ శ్రీనివాస్ ను తొలుత తొలగించి ఆయన స్థానంలో ఆ నియోజకవర్గానికి చెందిన అదే సామాజిక వర్గానికి చెందిన పేరాడ తిలక్ ను కొత్త సమన్వయకర్తగా నియమించారు. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం రచ్చకెక్కడం, దానిపై పెద్ద ఎత్తున విమర్శలు హెూరెత్తడంతో అధినేత ఆయనను తొలగించి తిలక్ కి సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఆమదాలవలస నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను తప్పించి అక్కడ సమన్వయకర్తగా వైకాపా యువనాయకుడు చింతాడ రవికుమార్ ను నియమించారు. 2014-19 మద్య వైకాపా ప్రతిపక్షంలో ఉండగా తమ్మినేని సీతారాం ఆముదాలవలసలో పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేశారు.

నిరంతరం ప్రజల మద్య ఉంటూ నియోజకవర్గ వాసుల అభిమానాన్ని చూరగొన్నారు. ఈ కారణంగా ఆయన 2019లో విజయం సాధించగా సీనియార్టీని గుర్తించి జగన్మోహన్ రెడ్డి ఆయనకి శాసనసభ స్పీకర్ పదవిని కట్టబెట్టారు.  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనుసరించిన విధానాలను ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకించి 2024 ఎన్నికలలో గంపగుత్తగా ఎన్ డిఏ కూటమి అభ్యర్థులకి ఓట్లు వేయడంతో వైకాపాకి గట్టి దెబ్బతగిలింది. అందరితో పాటే తమ్మినేని సీతారాం సైతం ఓటమి పాలయ్యారు. అయినా కూడా ఆమదాలవలస నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ముందుకు సాగుతూ వచ్చారు. అయితే ఎవ్వరూ ఊహించని విదంగా ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్తగాచింతాడ రవికుమార్ ను జగన్మోహన్ రెడ్డి నియమించారు. ఈ నియామకంపై తమ్మినేని కుటుంబ అభిమానులు, అనుచరులు తీవ్ర నిరాశకి గురయ్యారు. పెద్దాయనను తప్పించి యువకుడుని నియమించడంపై అక్కడ బిన్న వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని టెక్కలి, ఆమదాలవలస రెండు నియోజకవర్గాలు కూడా కీలకమైనవే.

కళింగ సామాజిక వర్గం హవా ఉండే ఆ నియోజకవర్గాలలో సమన్వయకర్తలను మార్చివేయడం ఆ సామాజిక వర్గంలో కూడా చర్చణీయాంశంగా మారింది.రెండు నియోజకవర్గాలలో ఇన్ చార్జిలను మార్చిన జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇంకే నియోజకవర్గాలలో కొత్త సమన్వయకర్తలను నియమిస్తారోనని ఎవరికి వారు చర్చించుకుంటున్నారు.. నెక్స్ట్ ఎవరిని మారుస్తారోనని తొచిన విదంగా మాట్లాడుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వారిని మార్చడం ఖాయమని కొందరు పేర్కొంటున్నారు. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం పనిచేసే నాయకులకి అధినేత జగన్మోహన్ రెడ్డి బాధ్యతలను అప్పగించనున్న ట్లుగా వారు చెబుతున్నారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో ఈ మేరకు పెద్దలు అవసరమైన చర్చలు సాగిస్తున్నారని నిత్యం అక్కడి వారితో టచ్ లో ఉండే జిల్లా నేతలు పేర్కొంటున్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఎప్పుడు కూడా కఠినంగానే ఉంటుంటాయని అవి ఒక్కోసారి పార్టీకి మంచి చేస్తుండగా ఒక్కోసారి నష్టం చేకూరుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబందించి భవిష్యత్ లో ఏమి జరుగుతుందోనని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు