ఆంధ్రప్రదేశ్ రాజకీయం

పోసానికి తప్పని ఇక్కట్లు

ఆ జిల్లా భగ్గుమంటోంది. అది కూడా ఏకంగా దిష్టిబొమ్మ నే దగ్ధం చేసి, తమ ఆగ్రహ జ్వాలలు వెళ్లగక్కుతున్నారు అక్కడి నేతలు. ఏం తమాషాగా ఉందా.. నోటికి ఏది వస్తే అది మాట్లాడితే సరిపోతుందా.. ఇక ఊరుకోము. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు ఆ నేతలు. ఇంతకు వీరికి ఎందుకంత కోపం.. ఏమిటా కారణం తెలుసుకుందాం. ఇటీవల టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు భాద్యతలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, ఎన్నో అనూహ్య పరిణామాల మధ్య బీఆర్ నాయుడిని నియమించింది ప్రభుత్వం. దీనితో నాయుడు కూడా భాద్యతలు చేపట్టారు. తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న అన్యమతస్తులను తొలగించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. నాయుడు ఛైర్మన్ గా భాద్యతలు చేపట్టిన కొద్దిరోజులకే, టీటీడీకి విరాళాల పర్వం కూడా ఊపందుకుంది.ఈ తరుణంలో నటుడు పోసాని కృష్ణమురళి తాజాగా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

అది కూడా టీటీడీ చైర్మన్ పదవికి ఎంపికైన బీఆర్ నాయుడు లక్ష్యంగా పోసాని ఏక వచనంతో విమర్శలు చేశారు. ఆ విమర్శలే ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఆగ్రహ జ్వాలలకు కారణమయ్యాయి. పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతులు నులిమి టీటీడీ చైర్మన్ పదవిని, బీఆర్ నాయుడు దక్కించుకున్నారని, దానికి ప్రధాన కారణం తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతికి పాల్పడేందుకే పదవిని తీసుకున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ కామెంట్స్ పై టీడీపీ కూటమి నేతలు భగ్గుమన్నారు. రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో పోసాని కృష్ణమురళి పై సైతం పోలీసులకు ఫిర్యాదులు చేశారు. శుక్రవారం తిరుపతిలోని గాంధీ విగ్రహం ముందు జనసేన పార్టీ నేతలు, పోసాని కామెంట్స్ పై నిరసన వ్యక్తం చేశారు. అంతటితో ఆగక ఏకంగా పోసాని కృష్ణమురళి దిష్టిబొమ్మను సైతం దగ్ధం చేసి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు.

వెంటనే టీటీడీ చైర్మన్ నాయుడు పై పోసాని చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని జనసైనికులు డిమాండ్ చేశారు.తాజా రాజకీయ స్థితిగతులు చూస్తే, పోసానిపై ఫిర్యాదుల పరంపర ఊపందుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పటికే ఫిర్యాదులు కూడా అందుకున్న పోలీసులు, పోసానిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది.