ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ

ఏపీలో ఖరీప్ సీజన్ ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట ప్రణాళిక అమలు చేస్తున్నారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తుంది. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో రూ.314 కోట్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో రైతుల దగ్గర ధాన్యం కొని, నెలల తరబడి డబ్బులు చెల్లించలేదన్న విమర్శల నేపథ్యంలో… కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులపై దృష్టిపెట్టింది. వైసీపీ దిగిపోయే నాటికి 84,724 మంది రైతులకు రూ.1674.47 కోట్లు బకాయిలు కూటమి సర్కార్ తెలిపారు. ఆ బకాయిలను రైతులకు చంద్రబాబు ప్రభుత్వమే చెల్లించిందని మంత్రులు తెలిపారు. ప్రస్తుతం 48 గంటల లోపే ధాన్యం కొనుగోలు డబ్బుల్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని కూటమి నేతలు అంటున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు రూ.288 కోట్లను రైతులకు చెల్లించిందన్నారు. రైతులు ధాన్యం విక్రయించిన 24 గంటల్లోపే రూ.279 కోట్లు జమ చేశామన్నారు. కూటమి ప్రభుత్వం అన్నదాతకు తోడుగా నిలిస్తుందని చెబుతున్నారు.రైతులు ధాన్యం విక్రయించుకొనే విధానాన్ని ఏపీ సర్కార్ సులభతరం చేస్తూ సంస్కరణలు తీసుకువచ్చింది.

రైతులు తమ పంటను జిల్లాలో ఎక్కడైనా, ఏ రైస్ మిల్లుకైనా అమ్ముకొనే విధానాన్ని అమలుచేస్తుంది. అదే విధంగా వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయాలు చేసేందుకు సులభ విధానం అందుబాటులోకి తెచ్చింది. ఆరుగాలం రైతులు చెమటోడ్చి పండించిన ధాన్యం విక్రయించుకొనేందుకు ఎలాంటి శ్రమ అవసరం లేకుండా….సులభమైన మార్గాన్ని అందుబాటులోకి తెచ్చింది. 73373 59375 నెంబర్ కు వాట్సాప్ లో Hi పెడితే చాలు…ధాన్యం కొనుగోలు సేవలు అందుబాటులోకి వస్తాయి. రైతులు ఏ కేంద్రంలో, ఏ రోజు, ఏ టైంలో, ఏ రకం ధాన్యం, ఎన్ని బస్తాలు అమ్మదలుచుకున్నారో వాట్సాప్ లో పౌరసరఫరాల శాఖ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయాలకు స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలో తెలిపే వీడియోను పౌరసరఫరాల శాఖ సామాజిక మాధ్యమాల్లో పెట్టింది.ఏపీలోని పలు జిల్లాలో వరి కోతలు ప్రారంభంకావడంతో పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఆర్‌బీకేలు, సహకార సొసైటీలు, మార్కెట్‌యార్డుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

ధాన్యం తేమ శాతం కొలిచే యంత్రాలు, గోనె సంచులను కొనుగోలు కేంద్రాలకు పంపిస్తున్నారు. ఒకవేళ రైతులు గోనె సంచులు ఏర్పాటు చేసుకుంటే ఒక్కో సంచికి రూ.3.39 చొప్పున ప్రభుత్వం చెల్లించనుంది. అదేవిధంగా క్వింటాకు హమాలీ ఛార్జీల కింద రూ.17.17 ఇస్తున్నారు. దీంతో పాటు పొలాల్లోని కల్లాల నుంచి రైస్‌ మిల్లులకు ధాన్యం తరలించేందుకు ప్రభుత్వం రవాణా ఛార్జీలు చెల్లించనుంది. ధాన్యం రవాణా వాహనాలను జీపీఎస్‌ ట్రాకింగ్ చేస్తున్నారు