స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఈసారి సంతాన అర్హత లేదు. ఎంతమంది పిల్లలు ఉన్నా పోటీకి అర్హులే. ఈ మేరకు కూటమి ప్రభుత్వం కీలక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మండలి లో ఆమోదం పొందిన మరుక్షణం చట్టంగా మారనుంది.
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ అర్హతకు సంబంధించి వయసు నిబంధనను సడలించింది. ఈ మేరకు ఆ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దానికి శాసనసభ ఆమోదించింది. మండలిలో ఈ బిల్లు ఆమోదం పొందితే ఇక చట్టం గా మారనుంది. అదే జరిగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతమంది పిల్లలు ఉన్నా పోటీ చేయవచ్చు. దేశంలో జనాభా నియంత్రణకు అప్పటి ప్రభుత్వాలు చాలా రకాల నిర్ణయాలు తీసుకున్నాయి. ‘ఒకరు ముద్దు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు వద్దు’ అన్న నినాదాన్ని ప్రజల్లోకి బలంగా పంపించగలరు. అయితే ఏపీలో జనాభా పెరుగుదల నియంత్రణకు 1994లో కీలక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. నాటి టిడిపి ప్రభుత్వం.. జనాభా పెరుగుదల నియంత్రణ చర్యల్లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉంటే అనర్హతగా నిర్ణయించింది. దీంతో అసెంబ్లీలో ఆ బిల్లు ఆమోదించడంతో చట్టంగా మారింది. అప్పట్లో ఈ నిర్ణయం సంచలనం గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలామంది అర్హత కోల్పోయారు.
ఒక విధంగా చెప్పాలంటే గ్రామస్థాయి నాయకుడిగా ఎదగాలనుకున్నవారు కుటుంబ నియంత్రణ పాటించారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో తాజాగా టిడిపి ప్రభుత్వం ఆ నిబంధనను సడలిస్తూ.. అసెంబ్లీలో కొత్త బిల్లు ప్రవేశపెట్టింది. ఆమోదించింది కూడా. మండలి లో ఆమోదం లభిస్తే అది చట్టంగా మారనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతమంది సంతానం ఉన్నా పోటీ చేసేందుకు ఇకనుంచి అర్హులే.రాష్ట్రంలో సంతానాభివృద్ధి కోసమే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో నడివయస్కులతో పాటు వృద్ధ జనాభా పెరుగుతోంది. దీనికి సంతానోత్పత్తి లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. పెద్ద కుటుంబాలు కాస్త చిన్న కుటుంబాలు అయ్యాయి. ఒక పిల్లాడితోనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకుంటున్నారు. దీంతో పిల్లల ఉత్పత్తి పెరగడం లేదు. దాని ప్రభావం యువత పెరుగుదలపై కనిపిస్తోంది. ఎక్కువ మంది యువత నడివయస్కులవుతున్నారు. నడివయస్కులు వృద్ధులుగా మారుతున్నారు. అయితే సంతానోత్పత్తి లేకపోవడంతో.. నడివయస్కులు, వృద్ధ జనాభా పెరిగిన మాదిరిగా యువత రావడం లేదు.
యువత లేకపోవడంతో అభివృద్ధి అనేది కనిపించడం లేదు. అందుకే ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.గతంలో జనాభా నియంత్రణ కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు జనాభా కావాలని ప్రభుత్వాలే ప్రోత్సహిస్తుండడం విశేషం. అయితే గతంలో ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సంతాన అర్హతను తెచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ అర్హతను సడలిస్తూ బిల్లును ప్రవేశపెట్టింది. అయితే మండలిలో వైసీపీకి బలం ఉన్న నేపథ్యంలో ఈ బిల్లు ఎంతవరకు ముందుకు వెళ్తుందో చూడాలి.