అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబుకు మాట ఇస్తున్నానని.. మేం చేయాల్సిన పనులపై ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సీఎం చంద్రబాబు విజన్‌కు తగ్గట్టు పనిచేస్తామని.. సీఎం కలలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎంగా ఉండాలని.. చంద్రబాబు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు.సమర్థులైన నాయకుడు ఉంటే ఎలా ఉంటుందనేది చంద్రబాబును చూసి తెలుసుకోవచ్చని అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో ప్రశంసించారు. విజయవాడ వరదల సమయంలో అధికార యంత్రాంగాన్నని దగ్గర ఉండి నడిపిన తీరు అభినందనీయమని …తెలుగు వారు ప్రపంచ వ్యాప్తంగా ఉండటానికి చంద్రబాబు ముఖ్య కారణమని గుర్తు చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బుడమేరుకు వరదలు వచ్చాయని .. ప్రతినెల ఒకటో తేదీన కూటమి ప్రభుత్వం లో వేతనాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియలేదన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పులు ఈ ప్రభుత్వానికి సవాల్ గా మారాయని అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం పని చేశామని తెలిపారు.
పవన్ నోట చంద్రబాబు మరో పదేళ్లు సీఎం అనే ప్రకటన రావడం రాజకీయవర్గాలను సహజంగానే ఆశ్చర్య పరుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా పవన్ సీఎం అవుతారని జనసైనికులు నమ్మకంతో ఉన్నారు. అయితే పవన్ మాత్రం రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఉందని అంటున్నారు. అందుకే చంద్రబాబు సీఎంగా ఆ తర్వాత కూడా మరో పదేళ్లు కొనసాగాలని అంటున్నారు. ఇలాంటి మాటలన్నీ ప్రస్తుత ప్రభుత్వంపై నమ్మకం ..కూటమిపై విశ్వాసం చేయడం మాత్రమేనని.. .ఇప్పుడు అన్నారంటే దానికే కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని మరికొందరు వాదిస్తున్నారు. కారణం ఏదైనా చంద్రబాబు నాయకత్వం విషయంలో పవన్ కల్యాణ్ చాలా స్పష్టతతో ఉన్నారు. ఎక్కడా ఎలాంటి ఊహాగానాలు రానివ్వడం లేదు.ఇటీవలి కాలంలో ఆయన హిందూత్వ నినాదం తీసుకుని జాతీయస్థాయిలో తన ప్రత్యేక చూపేందుకు ప్రయత్నిస్తున్నారని దీని వెనుక ఎవరికీ తెలియని రాజకీయం ఉందని చెప్పుకుంటున్న సమయంలో పవన్ వ్యాఖ్యలు సహజంగానే హాట్ టాపిక్ అవుతున్నాయి.