తెలంగాణ ముఖ్యాంశాలు

దళితబంధుకు రూ.30 వేల కోట్లు

  • వచ్చే బడ్జెట్‌లో కేటాయింపు
  • రెండున్నరేండ్లలో లక్ష కోట్లు
  • దళితుల అభివృద్ధే సీఎం కేసీఆర్‌ సంకల్పం
  • మంత్రి తన్నీరు హరీశ్‌రావు

రెక్కల కష్టంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికే మార్గదర్శకంగా నిలువనున్నదని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. రానున్న రెండున్నరేండ్లలో ఈ పథకం కింద సుమారు రూ.లక్ష కోట్లు ఖర్చు చేసేందుకు సీఎం కేసీఆర్‌ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు. వచ్చే బడ్జెట్‌లో రూ.20 వేల నుంచి 30 వేల కోట్లను కేటాయించనున్నట్టు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజారాధాకృష్ణశర్మతో కలిసి మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. దళితబంధు ఓ అద్భుత పథకమన్నారు. రానున్న రోజుల్లో దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఈ పథకం అమలుచేయాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పారు. సీఎం కేసీఆర్‌ది గొప్ప సంకల్పమని, ఆయన ఆలోచనలను క్షేత్రస్థాయిలో అమలుచేసేందుకు దళితులు ఐక్యంగా, సంఘటితంగా ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఈ పథకం ఆర్థిక, సామాజిక వివక్షల నుంచి దళితులను విముక్తులను చేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దళితబంధు డబ్బులను ఆదాయం పెంపొందించే ఉపాధి, వ్యాపార మార్గాలపై వెచ్చించాలని సూచించారు. రైతుబంధు మాదిరే దళితబంధు అమలు చేయనున్నట్లు స్పష్టంచేశారు.

దళితబంధుతో భారీమార్పు
దళితబంధు పథకం అమలు తర్వాత దళిత కుటుంబాల్లో పెనుమార్పులు వస్తాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రెక్కల కష్టంపై ఆధారపడి జీవిస్తున్న దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని అన్నారు. దళిత కుటుంబాలకు చెందిన మేదావులు, ఉద్యోగులు దళితబంధు పథ కం సద్వినియోగం అయ్యేలా కమిటీలు వేసుకోవాలని సూచించారు. యువకులుఒకేలాకాకుండా, వివిధ రకాల ఉపాధిమార్గాలను ఎంచుకునేందుకు వారికి శిక్షణ ఇప్పించాలని, వారిలో చైతన్యం తీసుకురావాలని కోరారు. దళితబంధును రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అమలుచేసేందుకు అన్ని ఏర్పాట్లుచేశామని వెల్లడించారు. దశల వారీగా అన్ని కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం తదితరులు పాల్గొన్నారు.