అంతర్జాతీయం ముఖ్యాంశాలు

ఆఫ్రికాలో ప్రాణాంతక మార్బర్గ్ వైరస్ గుర్తింపు

100 మందిలో 88 మంది చనిపోయే అవకాశం..డబ్ల్యూహెచ్ఓ

ఆఫ్రికాలో మరో ప్రాణాంతక వైరస్ బయటపడింది. ఆఫ్రికాలోని గినియా దేశంలో మార్బర్గ్ వైరస్ కేసును గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఎబోలా జాతికి చెందిన ఈ వైరస్ కరోనా తరహాలోనే అత్యంత వేగంగా వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ వైరస్ సోకిన ప్రతి 100 మందిలో 88 మంది చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రారంభంలోనే ఈ వైరస్ కు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఇది గబ్బిలాల్లో వ్యాపించే వైరస్ అని… వాటి నుంచి మనుషులకు ఇది సోకి ఉంటుందని చెప్పింది.

సాధారణంగా మార్బర్గ్ వైరస్ రోసెట్టస్ గబ్బిలాలు ఉండే చోట కనిపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వాటి ఆవాసాలకు సమీపంలోకి వెళ్లే వారికి ఈ వైరస్ సోకుతుందని చెప్పింది. ఈ వైరస్ మనుషులకు సోకిన తర్వాత ఇతరులకు సులువుగా వ్యాపిస్తుందని తెలిపింది. వైరస్ బారిన పడిన వారు ఉపయోగించిన వస్తువుల ద్వారా వ్యాపించే అవకాశం ఉందని చెప్పింది.

మార్బర్గ్ వైరస్ సోకగానే తీవ్ర జ్వరం, విపరీతమైన తలనొప్పి, చికాకు కలుగుతుంది. ఈ వైరస్ కు వ్యాక్సిన్, చికిత్స లేదు. అయితే, ఆయా లక్షణాలకు ప్రత్యేకంగా చికిత్సను అందించడం ద్వారా బాధితుడి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా, కాంగో, కెన్యా, ఉగాండా, అంగోలా దేశాల్లో కూడా ఈ వైరస్ కేసులు అత్యల్పంగా నమోదయ్యాయి.