ఆంధ్రప్రదేశ్ రాజకీయం

అమరావతిపై మాస్టర్ ప్లాన్ రెడీ

ఒక రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో రాజధాని అనేది కీలకం. కానీ దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రానికి రాజధాని అన్నది లేకుండా పోయింది. రాజకీయ స్వార్థానికి మొగ్గ దశలో ఉన్న అమరావతి సమిధగా మారింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి అమరావతిని చిదిమేసింది. రాజధాని నిర్మాణాలను పాడుబెట్టింది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఐదేళ్ల చెర వీడిన అమరావతి రాబోయే ఐదేళ్లలో ప్రజా రాజధానిగా అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. కీలకమైన నిర్మాణాలను పునః ప్రారంభించాల్సి ఉంటుంది
* ఐకానిక్ టవర్స్ : అమరావతిలో ఐకానిక్ టవర్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు చంద్రబాబు. ఇప్పటికే చాలా వాటి నిర్మాణం పూర్తయింది. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది నివాసం ఉండేలా వీటిని తీర్చిదిద్దారు. గత ఐదు సంవత్సరాలుగా నిర్లక్ష్యంగా విడిచిపెట్టారు. వాటిని వినియోగం లోకి తేవాల్సిన తక్షణ అవసరం ఇప్పుడు ఏర్పడింది.
* కీలక నిర్మాణాలు: టిడిపి ప్రభుత్వ హయాంలో విభాగాధిపతులు, సచివాలయం, శాశ్వత హైకోర్టు భవనాల పునాదులు గత ఐదేళ్లుగా నీటిలో నానుతున్నాయి. ఈ నిర్మాణాల పట్టిష్టతను సాంకేతిక నిపుణులతో అంచనా వేయించాలి. సవరించిన అంచనాలతో తిరిగి పనులు ప్రారంభించాలి. ఈ ఐదేళ్లలో వీటిని పూర్తయ్యేలా చూడాలి.
* పెండింగ్ భూ సేకరణ: రాజధాని నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ అంశం పెండింగ్లో ఉంది. రైతులకు కేటాయించిన ప్లాట్లు, వాటికి సంబంధించిన న్యాయపరమైన చిక్కులను సత్వరమే పరిష్కరించాలి. ఆ భూములను సిఆర్డిఏ కు తిరిగి దక్కలు పడేలా చూడాలి. ఏపీ సి ఆర్ డి ఏ చట్టం, పునర్విభజన చట్టం, అమరావతి బృహత్ ప్రణాళిక, కేంద్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నోటిఫై చేసేందుకు న్యాయపరమైన చర్యలను ప్రారంభించాలి
* రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు : రైతుల రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను తక్షణం పూర్తి చేయాలి. వాటిని అన్ని వస్తువులతో అభివృద్ధి చేయాలి. దీనివల్ల రాజధానిలో నివాసయోగ్యత స్థాయి పెరుగుతుంది. పెండింగ్ ప్లాట్లు, కేటాయించిన ప్లాట్ లలో ఇంకా చేయించాల్సిన రిజిస్ట్రేషన్ లను నిర్దిష్ట కాల పరిమితిలోగా పూర్తి చేయాలి.
* సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం : అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం అత్యంత కీలకం. దానికి అనుసంధానంగా రహదారుల నిర్మాణం పూర్తి చేయాలి. శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, విభాగాధిపతుల భవనాలు, హ్యాపీ నెస్ట్ తదితర ప్రాజెక్టులను పునరుద్ధరించాలి. రాజధానిని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానించాలి.
* ఎన్ఐడి, ఎస్ఆర్ఎం, విట్ తదితర ప్రతిష్టాత్మక సంస్థలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. దళితులు అధికంగా నివసించే అమరావతిలో అంబేద్కర్ విగ్రహం, స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలి
* రాజధానిలో సాగునీరు, తాగునీరు అవసరాల కోసం వైకుంటపురం వద్ద 45 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి. అన్నింటికీ మించి రాజధాని పరిధిలోని గ్రామాలతో అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు న్యాయపరమైన చిక్కులను అధిగమించాలి. రాజధాని లో భూములు కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు వెంటనే పనులు ప్రారంభించి నిర్దిష్ట కాల పరిమితితో కార్యకలాపాలు సాగించేలా చూడాలి.