టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజకీయంగా పూర్తిగా పరిణితి చెందారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు తరహాలోనే ఆయన రాజకీయాలను బాగానే ఒంటబట్టించుకున్నారని అర్థమవుతుంది. ఒకసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత నారా లోకేష్ లో చాలా వరకూ మార్పు కనిపిస్తుంది. ఇటు తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రి బాధ్యతలను చూస్తుంటే లోకేష్ మాత్రం పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ఒక రకంగా నారా లోకేష్ కు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచి పొలిటికల్ ఎక్స్‌పీరియన్స్ అలవడిందని పార్టీ నేతలే చెబుతుండటం విశేషం. ఒకరకంగా sతండ్రి చంద్రబాబు రాజకీయ వారసత్వాన్ని అందుకున్నారు. గతంలో మాదిరిగా దూకుడుగా బయటకు కనిపించకపోయినా ముఖ్యమైన నిర్ణయాలన్నీ లోకేష్ తీసుకుంటున్నవే. స్పీడ్ డెసిషన్ తీసుకుంటున్నారు. ఒక రకంగా చంద్రబాబు కేవలం ముఖ్యమంత్రి అయితే నారా లోకేష్ ఈ దఫా మాత్రం అన్ని రకాలుగా అంతా తానే అయి వ్యవహరిస్తున్నారు. ఇటు పార్టీ విషయాల్లోనూ, ప్రభుత్వ నిర్ణయాల్లోనూ నారా లోకేష్ ప్రమేయం ఉండనిదే ఏదీ జరగదంటున్నారు.
ప్రతి శాఖపైన ఆయన ముద్ర ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సయితం లోకేష్ నిర్ణయాలను అమలు చేస్తున్నారు. మరోవైపు కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందన్న సంకేతాలను బలంగా పంపుతున్నారు. తానున్నానని భరోసా ఇస్తున్నారు.. నారా లోకేష్ రెడ్డి సామాజికవర్గం నేతలను జగన్ కు దూరం చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇతర పార్టీలకు చెందిన రెడ్డి సామాజికవర్గం నేతలతో లోకేష్ టచ్ లోకి వెళ్లి వారి సమస్యలపై స్వయంగా చర్చిస్తున్నట్లు సమాచారం. పార్టీపై కులం ముద్ర పడకుండా రెడ్డి సామాజికవర్గాన్ని దగ్గర చేసుకుంటేనే మరొక వైపు జగన్ కంటే కూటమి ప్రభుత్వమే బెటర్ అన్న సిగ్నల్స్ ను ఆ క్యాస్ట్ లీడర్లు, కాంట్రాక్టర్లు, పారిశ్రామిక వేత్తలను దగ్గర చేర్చుకుంటున్నారు. జగన్ నుంచి ఆ సామాజికవర్గాన్ని దూరం చేయడమే లక్ష్యంగా నారా లోకేష్ ఆపరేషన్ ప్రారంభించారని తెలిసింది. ఈ మిషన్ సక్సెస్ అయితే జగన్ ను ఒక ప్రధాన సామాజికవర్గం దూరమయ్యే అవకాశాలున్నాయి. ఇటు రెడ్డి, అటు పవన్ తో కాపులు దగ్గరయితే తమకు తిరుగుండదన్న భావనలో ఉన్నారు. ఇక పార్టీలోనూ యువరక్తానికి చోటు కల్పించాలన్నది ఆయన ఉద్దేశ్యంగా ఉంది.
మంత్రి వర్గంలోనూ సీనియర్ నేతలను పక్కన పెట్టడంలోనూ నారా లోకేష్ పాత్రను కాదనలేం. ఇక ఢిల్లీలో చంద్రబాబు నాయుడు, కింజారపు రామ్మోహన్ నాయుడు వంటి నేతలు బీజేపీ నేతలతో టచ్ లో ఉంటే ఇక్కడ పార్టీ పరిస్థితులను మాత్రం ఆయన అంచనా వేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇక నిత్యం ప్రజాదర్బార్ పేరిట ప్రజలతో మమేకం అవ్వడంతో పాటు నియోజకవర్గ, జిల్లా స్థాయి నేతలకు నేరుగా అపాయింట్ మెంట్ ఇచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తుండటంతో లోకేష్ నాయకత్వం బాగుందన్న ప్రశంసలను ఆయన చేతల ద్వారా చూపిస్తూ పార్టీ నేతలలో ఇప్పటి వరకూ ఉన్న సందేహాలను పటాపంచలు చేస్తున్నారు.