తెలంగాణ ముఖ్యాంశాలు

గెల్లుపై ఈటల ‘బానిస’ ముద్ర

బీజేపీ నాయకుడు రాజేందర్‌ తన అహంకారాన్ని మరోసారి బయటపెట్టారు. బుధవారం బీసీ బిడ్డ గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను హుజూరాబాద్‌ అభ్యర్థిగా ప్రకటించిన కొద్దిసేపటికే ఆయనపై ’బానిస’ ముద్రవేశారు. అంతటితో ఆపకుండా మీకు బానిస బిడ్డ కావాలా? అంటూ అవహేళనచేశారు. గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను అభ్యర్థిత్వాన్ని జీర్ణించుకోలేక పేరును ప్రకటించిన గంటలోపే.. బానిసతో పోల్చడం ఆయన లోపల దాగున్న నిజ స్వరూపానికి నిదర్శనమన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన పార్టీలనుంచి యాదవ బిడ్డకు టికెట్‌ దక్కడం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా చరిత్రలో ఇదే తొలిసారి. కులాలకతీతంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి అన్ని ప్రాంతాల్లో పటాకులు పేల్చి, సంబరాలు చేసుకున్నారు. ఈ సమాచారం రాజేందర్‌కు ఆయన సన్నిహితులు అందించారు. అప్పుడు కులసంఘాల మీటింగ్‌లో ఉన్న రాజేందర్‌.. ‘ఇప్పుడే ఓ బీసీబిడ్డను పోటీ పెట్టారని నాకు మన వాళ్లు చెప్పారు. వాళ్లు బీసీ బిడ్డనా.. ఓసీ బిడ్డనా. ఎస్సీ బిడ్డనా కాదు. ఆయనకు కావాల్సింది ఒక బానిస. ఆ బానిస బిడ్డ మీకు కావాలా.. లేక పోరాడే వాళ్లు కావాలా..’ అంటూ మాట్లాడటంతో ఆ సమావేశంలో ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా షాక్‌ తిన్నారు.

ఎందుకింత అక్కసు?
రాజేందర్‌ వ్యాఖ్యలపై చర్చ జరుగుతున్నది. ఇన్నాళ్లుగా హుజూరాబాద్‌లో ఆయనే చక్రం తిప్పారు. గులాబీ గొడుగు కింద రాజ్యమేలారు. ఏ బీసీ బిడ్డను పైకి రానివ్వలేదు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసినా బీసీ సామాజికవర్గానికి చెందిన ఏ ఒక్క వ్యక్తికి ఆయన గుర్తింపు ఇవ్వలేదని టీఆర్‌ఎస్‌ నేతలంటున్నారు. ఎవరికైనా పదవులు వచ్చి వారు ఎదిగితే తనకు ఎక్కడ ఎసరు వస్తుందో అన్న భయం ఆయనకు ముందునుంచి ఉన్నదని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ప్రకటించిన అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ ఉద్యమ సమయంలో రాజేందర్‌కు మించి పనిచేశారు. అది ఆయకు మింగుడుపడటం లేదని చెప్తున్నారు. శ్రీనివాస్‌యాదవ్‌పై 100కు పైగా కేసులున్నాయి. అనేకసార్లు జైలుకు వెళ్లినా ఏనాడు ఏ పదవికోసం తాపత్రయపడలేదు. విద్యార్థి నాయకుడిగా ప్రజల్లో మంచి పేరున్నది. బీసీ సామాజికవర్గాలన్నీ అతనికి అండగా నిలుస్తున్నాయి. అతనిపై వేలుపెట్టి చూపించడానికి ఏ ఫిర్యాదు లేదు. ఆరోపణలు లేవు. అవినీతి మరక అసలే లేదు. రాజేందర్‌ చేసినట్టు దళితుల భూములు కబ్జా చేయలేదు. వందల ఎకరాలు సంపాదించలేదు. కోట్ల డబ్బు కూడబెట్టలేదు. పదవులు అడ్డం పెట్టుకొని స్వప్రయోజనాలు పొందలేదు. గడీల మాదిరిగా ఇండ్లు కట్టుకోలేదు. పచ్చి అబద్ధాలు ఆడలేదు. రాజకీయ జన్మనిచ్చిన పార్టీపైనే విమర్శలు చేయలేదు. ప్రజలకు పట్టెడు అన్నం పెట్టి అండగా నిలిచే సంక్షేమ పథకాలను విమర్శించలేదు. ప్రజలకు తాయిలాలు పంచలేదు. డబ్బు పంపిణీ చేసే శక్తి అసలే లేదు. కానీ, గెల్లు స్వరాష్ట్రం కోసం నిస్వార్థంగా పోరాడిన బిడ్డ. హుజూరాబాద్‌ గడ్డపైనే ఆనాటి పోలీసులకు ఎదురెళ్లిన ఉద్యమకారుడు. కేసులు పెట్టినా, జైలు పాలుచేసిన జంకని మనిషి. అవకాశాలు ఎన్నో వచ్చినా స్వప్రయోజనాలకు వినియోగించుకోని వ్యక్తిత్వం. వెయ్యి కండ్లతో వెతికినా.. అవినీతి మచ్చలేని విద్యార్థి. అందుకే ఈటలకు అంత అక్కసు. విమర్శలు చేసే అవకాశం లేదు. ఆస్తులు సంపాదించారంటూ ఆరోపించే మార్గంలే దు. బట్టకాల్చి మీదపారేసేందుకు కార ణం లేదు కాబట్టే.. గెల్లును బానిస అంటూ ఓ ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.