జాతీయం ముఖ్యాంశాలు

Karnataka: ఆనందసింగ్‌తో నేను మాట్లాడుతా: సీఎం

శాఖల శిరోభారం

మంత్రుల్లో రోజురోజుకూ అసంతృప్తి

సీఎం బొమ్మైకి మనశ్శాంతి కరువు

ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైకు రోజురోజుకూ అసమ్మతుల బెడద పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. మంత్రి పదవులు రానివారితో పాటు, వచ్చినవారు కూడా శాఖ బాగాలేదని పేచీలందుకున్నారు. మొదట గళమెత్తిన పర్యాటక మంత్రి ఆనంద్‌సింగ్‌ తన శాఖను మార్చకపోతే మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది.  

అసంతృప్తి బాటలో ఇంకొందరు..  
బి.శ్రీరాములు, ఎంటీబీ నాగరాజు కూడా శాఖలపై అసంతృప్తితో ఉన్నారు. ఇంధన శాఖపై ఆశ పెట్టుకున్న ఆనందసింగ్‌కు పర్యాటక శాఖను, హోంశాఖ ఆశించిన ఎంటీబీ నాగరాజుకు పరిపాలన శాఖ ఇచ్చారు. ప్రజాపనుల శాఖ కావాలన్న బి.శ్రీరాములుకు రవాణా శాఖ ఇవ్వడంతో కినుక వహించినట్లు తెలుస్తోంది. బెంగళూరు నగరాభివృద్ధి శాఖ రాలేదని మంత్రులు వి.సోమణ్ణ, ఆర్‌.అశోక్‌లలోనూ అసంతృప్తి గూడుకట్టుకుంది. వారిని చల్లార్చడానికి శాఖలను మార్చే అవకాశం లేకపోలేదు.  

ఆనందసింగ్‌తో మాట్లాడుతా: సీఎం
మంత్రి ఆనంద్‌సింగ్‌తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని సీఎం బొమ్మై తెలిపారు. త్వరలోనే అన్నీ సద్దుమణుగుతాయని బుధవారం అన్నారు. ఆనంద్‌సింగ్‌ రాజీనామా చేస్తారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు.  

మంత్రి ఆఫీసుపై బోర్డు తొలగింపు..  
హొసపేటె: మంత్రి ఆనంద్‌సింగ్‌కు హొసపేటెలోని రాణిపేటలో ఉన్న ఆఫీసుకు మంగళవారం రాత్రి ఆకస్మికంగా తాళం వేశారు. ఆఫీసు ముందు ఉన్న బోర్డును కూడా జేసీబీతో తొలగించారు. పర్యాటకశాఖ ఇష్టం లేక ఇలా చేశారా అని నగరంలో చర్చనీయాంశమైంది.