ఆగస్టు 14వ తేదీని ఇక నుంచి విభజన స్మృతి దినంగా ( Partition Horrors Remembrance Day ) గుర్తించనున్నట్లు ప్రధాని మోదీ ఇవాళ ప్రకటించారు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. దేశ విభజన వల్ల కలిగిన బాధలను ఎన్నటికీ మరిచిపోలేమని ప్రధాని చెప్పారు. లక్షలాది మంది మన సోదరసోదరీమణులు చెల్లాచెదురయ్యారని, మతిలేని ద్వేషం, హింస వల్ల వేలాది మంది మరణించారని, వారి కష్టాలు, త్యాగాలకు గుర్తుగా ఆగస్టు 14వ తేదీన విభజన భయానక స్మృతి దినంగా పాటించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. దేశ విభజన వల్ల ప్రజల్లో సామాజిక విభజనలు వచ్చాయని, సామరస్యం లోపించిందని, ఆ విష బీజాలను పారద్రోలేందుకు పార్టిషన్ హారర్స్ రిమెంబ్రెన్స్ డే నిర్వహించాలని మోదీ తెలిపారు. ఈ స్మృతి దినం ఏకత్వ స్పూర్తిని నింపాలన్నారు. సామాజిక సామరస్యం, మానవ సాధికారత మరింత బలోపేతం కావాలని మోదీ తెలిపారు.
మరోవైపు ఇవాళ పాకిస్థాన్ తన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. ఈ నేపథ్యంలో అత్తారి-వాఘా బోర్డర్ వద్ద పాకిస్థాన్ రేంజర్లు, బోర్డర్ సెక్యూర్టీ ఫోర్స్ స్వీట్లు పంచుకున్నారు. రేపు కూడా వాళ్లకు స్వీట్లు ఇవ్వనున్నట్లు బీఎస్ఎఫ్ కమాండెండ్ జస్బీర్ సింగ్ తెలిపారు.