- తాలిబన్ల అకృత్యాలను గుర్తుచేసుకుంటున్న ఆఫ్ఘన్లు
- దేశం వదిలివెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు పోటెత్తిన ప్రజలు
- అదుపుచేయలేక గాల్లో కాల్పులు జరిపిన భద్రతాదళాలు
- గందరగోళ పరిస్థితులు.. తొక్కిసలాట.. 10 మంది మృతి
- సెక్యూరిటీని దాటుకొని విమానాల రెక్కలపై ఎక్కిన ప్రజలు
- వందల అడుగుల ఎత్తులోని విమానం నుంచి పడి ఇద్దరు మృతి
- భీతిగొలుపుతున్న వీడియోలు.. దిగ్భ్రాంతిలో ప్రపంచ దేశాలు
తండ్రిలా రక్షించాల్సిన దేశాధ్యక్షుడే పలాయనం చిత్తగించాడు. పెద్దన్నలా అండగా ఉంటుందనుకున్న అగ్రరాజ్యం చేతలుడికి నిస్సహాయంగా చూస్తుండిపోయింది. దీంతో తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు ఆధునిక చరిత్రలో చూడనటువంటి అత్యంత దీనస్థితికి చేరుకున్నాయి. బతుకడం కోసం అక్కడి ప్రజలు పడుతున్న పాట్లు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. -కాబూల్
20 ఏండ్ల క్రితం దేశంలో తాలిబన్లు సృష్టించిన అరాచకాన్ని మళ్లీ గుర్తుచేసుకుంటున్న ఆఫ్ఘన్ ప్రజలు ఆ కర్కశ రాజ్యంలో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. కాబూల్‌ను తాలిబన్లు వశపర్చుకున్నారన్న వార్తలు తెలియగానే.. సోమవారం వేలాదిమంది ప్రజలు ఒక్కసారిగా కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పోటెత్తారు. పండుగ సమయాల్లో బస్సులు, రైళ్లపైకి ఎక్కినట్టు ఏకంగా విమానాలపైకి ఎక్కారు. తాలిబన్ల చెరలో ఎట్టిపరిస్థితుల్లో చిక్కిపోకూడదన్న ఉద్దేశంతో వందలాది అడుగుల ఎత్తున విమానాలు ఎగురుతున్నా.. వాటి రెక్కలనే ఆధారంగా చేసుకొని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించారు. ఎయిర్‌పోర్ట్‌లోకి చొచ్చుకొస్తున్న వారిని అడ్డుకొనేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అమెరికా భద్రతా దళాలు గాల్లోకి కాల్పులు జరిపాయి. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 10 మంది పౌరులు మరణించారు. అయితే, వీరి మరణానికి కాల్పులు కారణమా? లేక తొక్కిసలాటా అనేది తెలియాల్సి ఉన్నది.
డబ్బుతో పరారైన ఘనీ!
ఆదివారం ఆఫ్ఘన్ నుంచి పరారైన ఆ దేశ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ.. నాలుగు కార్లు, హెలికాఫ్టర్, అందులో పట్టినంత డబ్బుతో పారిపోయినట్టు రష్యా ఆరోపించింది. ఆఫ్ఘన్‌లో రక్తపాతాన్ని నివారించడానికే తాను దేశం విడిచి వెళ్లినట్టు ఘనీ ప్రకటించారు. ఆదివారం దేశం విడిచి తజికిస్తాన్ వెళ్లాలనుకున్న ఘనీ రాకకు ఆ దేశం అభ్యంతరం తెలుపడంతో ఆయన ఒమన్‌కు చేరుకున్నారని, అక్కడి నుంచి అమెరికాకు వెళ్తారని సమాచారం. ఆఫ్ఘనిస్తాన్ మళ్లీ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారకుండా ప్రపంచ దేశాలు ఏకం కావాలని, అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకోవాలని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. ఆఫ్ఘన్‌లో పరిస్థితుల నేపథ్యంలో ఐరాస భద్రతా మండలి అత్యవసరంగా సమావేశం అయింది.
కూలిన ఆఫ్ఘన్ విమానం
ఆఫ్ఘన్ మిలిటరీ విమానం ఉజ్బెకిస్తాన్‌లో కూలిపోయింది. అనుమతి లేకుండా తమ గగనతలంలోకి ప్రవేశించారన్న కారణంతో విమానాన్ని కూల్చినట్టు ఉజ్బెకిస్తాన్ అధికారులు తెలిపారు.
స్వాగతించిన పాక్, చైనా
తాలిబన్ల ఆధీనంలోకి వచ్చిన ఆఫ్ఘన్ బానిసత్వ సంకెళ్లను తెంచుకున్నదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. స్వేచ్ఛ, సామరస్య ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామన్న మాటకు తాలిబన్లు కట్టుబడుతారని చైనా ఆశాభావం వ్యక్తం చేసింది. వారితో సత్సంబంధాలను కోరుకుంటున్నట్టు వెల్లడించింది.
భారతీయుల భద్రతకు అన్ని చర్యలు
ఆఫ్ఘనిస్తాన్‌లో ఇప్పటికీ దాదాపు 200 మంది భారత దౌత్యవేత్తలు, అధికారులు ఉండిపోయినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న భారతీయుల భద్రతకు అన్ని చర్యలు తీసుకొంటున్నట్టు కేంద్రప్రభుత్వం తెలిపింది. అక్కడి నుంచి స్వదేశానికి రావాలనుకొంటున్నవారికి ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నది. ఆఫ్ఘన్‌లోని హిందువులు, సిక్కుల ప్రతినిధులతో టచ్‌లో ఉన్నామని తెలిపింది. గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో గగనతలాన్ని మూసేస్తున్నట్టు ఆఫ్ఘన్ ప్రకటించింది.
అనంత ప్రాణాలు గాలిలోనే!
ఆఫ్ఘన్ నుంచి ఎలాగైనా బయటపడాలని ఆ దేశ ప్రజలు పలు విమానాల రెక్కలపై కూర్చొని అత్యంత ప్రమాదకర రీతిలో ప్రయాణం చేశారు. ఈ క్రమంలో వందలాది అడుగుల ఎత్తు మీద గాలిలో ప్రయాణిస్తున్న ఓ విమానం నుంచి ప్రమాదవశాత్తు జారి కింద పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ వీడియోలు యావత్ ప్రపంచానికి దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి.
ఆఫ్ఘన్‌పై తాలిబన్లు ఎలా ఆధిప్యతం ప్రదర్శించగలిగారు?
అమెరికా సేనలు వైదొలగడం, భద్రతా దళాల అసమర్థత, ప్రభుత్వలో వేళ్లూనుకున్న అవినీతి.. మత్తుమందు, డ్రగ్స్ వ్యాపారం ద్వారా తాలిబన్లకు బలమైన ఆర్థిక మూలాలు ఉండటం తదితర కారణాలు తాలిబన్లకు ఆఫ్ఘన్‌పై ఆధిపత్యం కలిగేలా చేశాయి.
బతకనిస్తారో.. లేదోనని
ప్రజాస్వామ్య ప్రభుత్వం, అమెరికా దళాలకు గతంలో సాయం చేసిన తమను తాలిబన్లు బతుకనిస్తారో.. లేదోనని ఆఫ్ఘన్‌లోని యువకులు భయపడి పోతున్నారు. దేశం విడిచి పారిపోతున్న వారిలో ఎక్కువమంది వారే ఉండటాన్ని చూస్తే వారి ఆందోళన ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
స్టే స్ట్రాంగ్ ఆఫ్ఘనిస్తాన్… కేటీఆర్ ట్వీట్
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ఆక్రమణలపై అక్కడి పౌరుడు రషిద్‌ఖాన్ సోమవారం ఓ ట్వీట్ చేశారు. ‘ప్రపంచ నాయకులారా.. నా దేశం గందరగోళంలో ఉంది. పిల్లలు, మహిళలతో సహా వేలాది మంది అమాయకపు ప్రజలు ప్రతి రోజూ బలిదానం అవుతున్నారు. మాకు శాంతికావాలి’ అంటూ అక్కడి పరిస్థితిని కళ్లకుకట్టే విజువల్స్‌ను షేర్ చేశాడు. అవి చూసిన మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘యునైటెడ్ నేషన్స్ ఎక్కడ ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు భయానకంగా మారినప్పుడు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదా. ఆ విజువల్స్ కలవరపెడుతున్నాయ్. స్టే స్ట్రాంగ్ ఆఫ్ఘనిస్తాన్’ అంటూ ట్వీట్ చేశారు.
తదుపరి అధ్యక్షుడు ఆయనేనా?
కాబూల్: ప్రస్తుత తాలిబన్ ఉగ్రవాద సంస్థ చీఫ్‌గా హైబతుల్లా అఖుంద్‌జాదా ఉన్నారు. ఆల్‌ఖైదా చీఫ్ ఆయ్‌మన్ ఆల్ జవాహిర్‌కి ఈయన విధేయుడు. తాలిబన్ సంస్థ సహవ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరదార్ ఆఫ్ఘన్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. 2010లో ఈయన్ని పాక్ అరెస్టు చేసింది. అయితే అమెరికా విజ్ఞప్తితో విడుదలయ్యారు. తాలిబన్లలో యుద్ధ కాంక్షను రగిలించడంలో హైబతుల్లా.. రాజకీయ వ్యూహాలను రచించడంలో బరదార్ దిట్ట.