ఏపీ విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడువాడలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడో ఓ ఉన్మాది. అడ్డుకోబోయిన యువతి అక్కతో పాటు, ఆమె కుమారుడికి సైతం గాయాలయ్యాయి. వెంటనే వారిని విజయనగరం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. నిందితుడిని నరవకు చెందిన రాంబాబుగా గుర్తించారు. చౌడువాడకు చెందిన రాములమ్మ అనే యువతి, రాంబాబు గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాలు వారికి ఇటీవల పెళ్లి నిశ్చయించారు. ఈ క్రమంలో మరో యువకుడితో మాట్లాడుతుందంటూ రాంబాబు పెళ్లిని రద్దు చేసుకున్నాడు.
ఈ విషయంలో గురువారం రాత్రి ఇరు కుటుంబాలను పిలిపించి పోలీసులు రాజీ కుదుర్చగా.. యువతిని పెళ్లి చేసుకునేందుకు యువకుడు అంగీకరించాడు. యువతిపై కక్ష పెంచుకున్న రాంబాబు చౌడువాడ గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. అర్ధరాత్రి తర్వాత యువతి ఇంటికి వెళ్లి గొడవకు దిగి.. ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అక్కడే ఉన్న యువతి అక్క సంతోషిణి అడ్డుకునే యత్నించింది. ఆమెతో పాటు ఆమె ఏడేళ్ల కుమారుడికి సైతం గాయాలయ్యాయి. ఘటనలో యువతికి 60శాతం వరకు గాయాలు కాగా.. ముగ్గురిని విజయవాడ ఆసుప్రతికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా.. పోలీసులు అతని కోసం అన్వేషిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.