ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

అవినీతికి తావివ్వద్దు : సీఎం జగన్‌

ప్రభుత్వ శాఖల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడాలి.. ఏసీబీ దాడులు చేస్తే కానీ నకిలీ చలాన్ల వ్యవహారం తెలియదా?

ఆదాయ వనరుల సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఫిర్యాదు నంబర్‌ ప్రజలకు కనిపించేలా ఉండాలి

కాల్‌ సెంటర్‌కు వచ్చే కాల్స్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి

క్షేత్ర స్థాయిలో వ్యవస్థల పని తీరుపై సమాచారం తెప్పించుకోండి

వారం పది రోజులకు ఒకసారి అధికారులు సమీక్ష నిర్వహించాలి

ఆదాయ పెంపు మార్గాలపై దృష్టి సారించాలి

రాష్ట్రంలోకి అక్రమ మద్యం రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిరోధానికి ఒక నిర్దిష్ట విధానం (ఎస్‌ఓపీ–స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌) తీసుకు రావాలి. అవినీతిపై ఫిర్యాదులు చేస్తూ వచ్చే కాల్స్‌పై దృష్టి పెట్టాలి. ఈ ఫిర్యాదుల పట్ల అధికారులు సొంతంగా బాధ్యత తీసుకోవాలి. క్షేత్ర స్థాయి నుంచి ఇంటెలిజెన్స్‌ సమాచారం తెప్పించుకొని ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలి. ప్రభుత్వ పథకాలు, కార్య క్రమాల ద్వారా ప్రజలకు లబ్ధి కలిగేలా చేయడం కలెక్టర్లు, జేసీల బాధ్యత. ఇదే సమ యంలో ప్రభుత్వానికి రావా ల్సిన రెవెన్యూ వసూళ్లపైనా కూడా దృష్టి పెట్టడం ఇంకో బాధ్యత. రాష్ట్రానికి ఆదాయం వచ్చే కొత్త మార్గాలపై దృష్టి సారించాలి. ఇందుకోసం వినూత్న సంస్కరణలు తీసుకురావాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌

ప్రభుత్వ శాఖల్లో అవినీతికి అడ్డుకట్ట పడే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అవినీతికి సంబంధించి ఫిర్యాదు చేయాల్సిన ఫోన్‌ నంబర్‌ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కనిపించేలా ప్రదర్శించాలని స్పష్టం చేశారు. కాల్‌ సెంటర్‌కు వచ్చే కాల్స్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పారు. తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన రాష్ట్ర ఆదాయ వనరులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ల శాఖలో వెలుగు చూసిన నకిలీ చలాన్ల వ్యవహారానికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఏసీబీ దాడులు చేస్తే కానీ ఈ వ్యవహారం వెలుగులోకి రాలేదని, అసలు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నకిలీ చలాన్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

‘ఈ స్థాయిలో తప్పులు జరుగుతుంటే మీ దృష్టికి ఎందుకు రాలేదు.. ఎన్ని రోజుల నుంచి ఈ తప్పులు జరుగుతున్నాయి.. క్షేత్ర స్థాయిలో వ్యవస్థలు సరిగా పని చేస్తున్నాయా లేదా.. అన్న విషయం ఎందుకు పరిశీలించడం లేదు.. తప్పు చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు..’ అంటూ అధికారులను ప్రశ్నించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ తప్పు చేసిన అధికారులను సస్పెండ్‌ చేశామని వివరించారు. కేవలం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యలయాల్లోనే కాకుండా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని చెల్లింపుల ప్రక్రియను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. దీనిపై ఆర్థిక శాఖ అధికారులు స్పందిస్తూ.. ఇప్పటికే సాఫ్ట్‌వేర్‌ను నిశితంగా గమనించామని, అవినీతికి చోటు లేకుండా పూర్తి స్థాయిలో మార్పులు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ‘మీ సేవ’ల్లో పరిస్థితులను కూడా పరిశీలించాలని సీఎం సూచించారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

సహజ మార్గంలో ఆదాయం పెరిగేలా చూడండి
► క్షేత్ర స్థాయి నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకోవలి. వారం లేదా పది రోజులకు ఒకసారి ఆదాయ వనరులు, పరిస్థితులపై సమీక్ష నిర్వహించాలి. ప్రతి సమావేశంలో ఒక రంగంపై దృష్టి సారించాలి. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ఎలా ఉందన్న విషయం తదుపరి సమావేశంలో పరిశీలించాలి. 
► రాష్ట్ర ఆదాయ వనరులను మెరుగు పరుచుకోవడానికి చర్యలు తీసుకోవాలి. ఏటా సహజంగా పెరిగే ఆదాయ వనరులతో పాటు, రావాల్సిన బకాయిలపై దృష్టి పెట్టాలి. జీఎస్టీ వసూళ్లు, ఇతరత్రా ఆదాయం పూర్తి స్థాయిలో వచ్చేలా చూడాలి. 
► వివిధ శాఖలు సరైన కార్యచరణ ద్వారా సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు చక్కటి సేవలను అందించడంతోపాటు ఆదాయాలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా మున్సిపల్, విద్యుత్, తదితర శాఖల మధ్య సమన్వయం బావుండాలి.

మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలి
► సరిహద్దుల నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి మద్యం వస్తున్న సంఘటనలు చూస్తున్నాం. దీనిని పూర్తిగా అడ్డుకోవాలి. మద్యం అక్రమ రవాణా, అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపాలి. 
► మద్య నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండటంతో పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రాష్ట్రంలోకి వస్తోంది. ఇలాంటి వ్యవహరాలపై అధికారులు కఠినంగా వ్యవహరించాలి.
► ఈ సమీక్షలో ప్రణాళిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ స్టేట్‌ టాక్స్‌ పియూష్‌ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ కమిషనర్‌ అండ్‌ ఐజీ ఎంవీ శేషగిరిబాబు, ఎస్‌ఈబీ కమిషనర్‌ పీహెచ్‌డీ రామకృష్ణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.