తెలంగాణ ముఖ్యాంశాలు

అమల్లోకి ఈడబ్ల్యూఎస్‌ కోటా

  • ఆర్థికంగా వెనుకబడినవారికి విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు
  • ఇందులో 33%మహిళలకు.. రెండు జీవోలు జారీ.. ఉద్యోగాల్లో రోస్టర్‌ పాయింట్లు
  • ఖరారుచేసిన ప్రభుత్వం.. మార్గదర్శకాలు జారీచేసిన సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ఇందుకు సంబంధించి రెండు జీవోలను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ విడుదలచేశారు. ప్రభుత్వ నియామకాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో 10 శాతం రిజర్వేషన్ల కోసం జీవో-244 జారీచేశారు. సబార్డినేట్‌ సర్వీస్‌ నిబంధనలు-1996కు సవరణ చేస్తూ జీవో-243 విడుదలచేశారు. నియామకాల్లో రోస్టర్‌ పాయింట్లను కూడా ప్రభుత్వం ఖరారుచేసింది. రూ.8 లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవారు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు పొందేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు వర్తించనివారికి మాత్రమే ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు వర్తిస్తాయి.

మార్గదర్శకాలివే..

  • ఈడబ్ల్యూఎస్‌ లబ్ధిదారుల కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలలోపు ఉండాలి. కుటుంబ పెద్ద వేతనం, వ్యవసాయం, వ్యాపారం, వృత్తుల ద్వారా సమకూరిన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొంటారు.
  • ఈ కోటా ద్వారా లబ్ధిపొందేందుకు తాసిల్దార్‌ జారీచేసిన ఆదాయ ధృవీకరణ పత్రాన్ని
  • సమర్పించాలి.
  • ఈడబ్ల్యూఎస్‌ కోటాలో ఉద్యోగాలు పొందినవారి ఆదాయ ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయిస్తారు. సర్టిఫికేట్‌ ఫేక్‌ అని తేలితే ఉద్యోగం నుంచి తొలగించి ఐపీసీ చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
  • ఉద్యోగ నియమాల్లో ఒక సంవత్సరంలో అర్హులైన అభ్యర్థులు దొరక్క ఈడబ్యూఎస్‌ కోటా ఉద్యోగాలు భర్తీకాకపోతే ఆయా పోస్టులను బ్యాక్‌లాగ్‌గా పరిగణించి తదుపరి సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్‌ చేయరాదు.
  • ఈడబ్యూఎస్‌ కోటా అభ్యర్థి ఆన్‌రిజర్వ్‌డ్‌ కోటా ఉద్యోగాలకు అనర్హుడు.
  • ఈడబ్యూస్‌లోకి 10 శాతం రిజర్వేషన్లలో మహిళలకు 33శాతం కోటాను అమలుచేస్తారు.
  • ఈడబ్యూఎస్‌వారికి ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితిలో ఐదేండ్ల సడలింపు వర్తిస్తుంది.
  • డైరెక్టర్‌ రిక్రూట్‌మెంట్‌ పోస్టులో ఎస్సీ, ఎస్టీ, బీసీల తరహాలోనే పరీక్ష రుసుముల్లో మినహాయింపునిస్తారు.
  • ఈ కోటాకు అనుగుణంగా విద్యాసంస్థలో సీట్ల సంఖ్యను పెంచుతారు.
  • రోస్టర్‌ ప్రకారం ప్రతి 100 ఉద్యోగాల్లో 9వ, 28వ, 36వ, 57వ, 76వ, 86వ, 100వ పోస్టును ఈడబ్ల్యూఎస్‌ జనరల్‌ కోటాకు, 17వ, 50వ, 65వ పోస్టును ఈడబ్ల్యూఎస్‌ మహిళలతో కేటాయించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు
ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం జీవోలు జారీచేయటంపై ఓసీ జేఏసీ హర్షం వ్యక్తంచేసింది. సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు ఓసీ జేఏసీ నేతలు పోలాడి రామారావు, గోపు జయపాల్‌రెడ్డి, చెన్నమనేని పురుషోత్తంరావు, పెండ్యాల కేశవరెడ్డి తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం బషీర్‌బాగ్‌లోని కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయంతో ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులకు అన్ని ప్రవేశ పరీక్షల్లో లబ్ధి చేకూరుతుందన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపునకు కృషిచేస్తామని తెలిపారు.