తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని స్థానిక ఆలయాల్లో ఆగస్టు 30న గోకులాష్టమి వేడుకలు, 31న ఉట్లోత్సవం నిర్వహించనున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఆయా ఆలయాల్లో వేడుకలను ఏకాంతంగా నిర్వహిస్తారు.
తిరుచానూరులో..
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో గోకులాష్టమి సందర్భంగా ఈ నెల 30న ఉదయం శ్రీకృష్ణస్వామి మూలవర్లకు అభిషేకం, అర్చనలు మధ్యాహ్నం స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు స్వామివారు పెద్దశేష వాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం గోపూజ, గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు. 31న స్వామివారి ఉత్సవమూర్తికి మధ్యాహ్నం స్నపన తిరుమంజనం, సాయంత్రం స్వామివారికి ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.
నారాయణవనంలో..
నారాయణవనం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 30న ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, పంచాంగ శ్రవణం, శుద్ధి నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు శ్రీకృష్ణస్వామివారికి అభిషేకం, అనంతరం గోకులాష్టమి ఆస్థానం, నివేదన చేయనున్నారు. 31న ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు శ్రీకృష్ణస్వామివారికి అభిషేకం, ఆలయంలో తిరుచ్చి ఉత్సవం, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆలయంలో ఉట్లోత్సవం నిర్వహించనున్నారు.
నాగలాపురంలో…
నాగలాపురం శ్రీవేదనారాయణస్వామి ఆలయంలో 30న ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం, శుద్ధి నిర్వహించనున్నారు. సాయంత్రం శ్రీకృష్ణస్వామివారికి అభిషేకం, అనంతరం గోకులాష్టమి ఆస్థానం, నివేదన చేయనున్నారు. 31న ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, పంచాంగ శ్రవణం జరుపుతారు. సాయంత్రం ఆలయంలో ఉట్లోత్సవం నిర్వహించనున్నారు.
కార్వేటినగరంలో..
కార్వేటినగరం శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయంలో 30న ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు, ఉత్సవర్లకు తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. 31న ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, కొలువు, నిర్వహించనున్నారు. సాయంత్రం గోపూజ మహోత్సవం, ఉట్లోత్సవం నిర్వహించనున్నారు.