- ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల్లో 10-15 ఏండ్లయినా చార్జిషీట్లు లేవెందుకు?
- సీబీఐ, ఈడీలను ప్రశ్నించిన సీజేఐ
- దర్యాప్తు సంస్థలకు మౌలిక వసతులు,సిబ్బందిని ఇవ్వాలని కేంద్రానికి ఆదేశం
- కేసుల ఉపసంహరణకు హైకోర్టు అనుమతి తీసుకోవాలని రాష్ర్టాలకు సూచన
ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల దర్యాప్తులో జాప్యంపై సీబీఐ, ఈడీలను సుప్రీంకోర్టు నిలదీసింది.10-15 ఏండ్లుగా కేసులు పెండింగ్‌లో ఉండటం, చార్జిషీట్లు దాఖలు చేయకపోవడాన్ని ప్రశ్నించింది. దానికి కారణం ఏమిటో వివరించాలని సీబీఐ, ఈడీలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆదేశించారు. ‘దర్యాప్తులో ఏదైనా తెలిస్తే చార్జిషీట్ ఫైల్ చేయండి తప్ప గాలికొదిలేయకండి’ అని మందలించారు.‘ఈడీ నివేదిక అసమగ్రంగా ఉంది. 10-15 ఏండ్లుగా చార్జిషీట్ దాఖలు చేయకపోవడానికి కారణం ఏమిటో చెప్పలేదు. ఒక కేసులో రూ.200 కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు కానీ చార్జిషీట్ ఫైల్ చేయలేదు’ అని తప్పుపట్టారు. ఈడీ, సీబీఐలను నిరుత్సాహపరచకూడదని ఏ అభిప్రాయాన్నీ వ్యక్తం చేయడం లేదని సీజేఐ నేతృత్వంలోని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాలు, సిబ్బంది కొరత వంటి సమస్యలను సీజేఐ ప్రస్తావించారు. కోర్టుల మాదిరిగానే ఆ సంస్థలపై కూడా పనిభారం ఉన్నదన్నారు. ఒక సీబీఐ కోర్టులో 900 కేసులు ఉన్నాయని చెప్పారు. అవసరమైన సిబ్బందిని, సదుపాయాలను కల్పించాలని కేంద్రాన్ని ఆదేశించారు.
26 ఏండ్ల నాటి కేసులో బెయిల్ కోసం…
క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన చట్టసభ సభ్యులపై జీవితకాల నిషేధం విధించాలని, వారిపై కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ ‘పిల్’ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్నది. ఈ కేసులో గతంలోనూ కోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసుల స్థితిగతులపై సీబీఐ, ఈడీల నివేదికలు దిగ్భ్రాంతి కలిగించేలా ఉన్నాయని బుధవారం విచారణ సందర్భంగా అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా కోర్టుకు తెలిపారు. దర్యాప్తును వేగవంతం చేయాలంటే ‘శస్త్రచికిత్స’ అవసరమని చెప్పారు. ఒక కేసు దర్యాప్తు 2030లో పూర్తవుతుందని భావిస్తున్నట్టు దర్యాప్తు సంస్థ పేర్కొన్నదని హన్సారియా తెలుపగా ‘మై గాడ్’ అని జస్టిస్ చంద్రచూడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చార్జిషీట్ కూడా దాఖలు చేయని 1995 నాటి ‘టాడా’ కేసులో నిందితుడు బెయిల్ కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్నాడని ఆయన తెలిపారు.