18 ఏండ్లు పైబడిన జనాభాలో ఇప్పటివరకూ బెంగళూర్‌లో 75 శాతం మంది కనీసం కొవిడ్-19 వ్యాక్సిన్ సింగిల్ డోసు తీసుకున్నారు. అర్హులైన కోటి మందికి గాను ఇప్పటికి 75.4 శాతం మందికి వ్యాక్సిన్ తొలి డోస్ పూర్తయిందని అధికారులు వెల్లడించారు. కర్నాటకతో పోలిస్తే బెంగళూర్ నగరంలో మొత్తం వ్యాక్సినేషన్ ప్రక్రియ 58 శాతం అధికంగా నమోదైంది. ప్రైవేట్ దవాఖానలకు పెద్దసంఖ్యలో వ్యాక్సిన్ల సరఫరాలు చేపట్టడంతోనే బెంగళూర్‌లో వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగిందని అధికారులు పేర్కొన్నారు.
నగరంలో కొవిడ్ సోకిన వారు దాదాపు మూడు శాతం మంది ఇంకా వ్యాక్సిన్ తీసుకోలేదని బెంగళూర్ అర్బన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ జే. మంజునాధ్ తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు కూడా బెంగళూర్ నగరంలో వ్యాక్సిన్ తీసుకుంటున్నారని చెప్పారు. ఇక కర్నాటకలో తాజాగా 1224 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా మహమ్మారి బారినపడి ఒక్కరోజులో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. బెంగళూర్ అర్బన్‌లో 309 తాజా కేసులు నమోదయ్యాయి.