కరోనా విషయంలో రానున్న రెండు నెలలు అత్యంత కీలకమని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం ఆ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ విలేకరులతో మాట్లాడుతూ ‘దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదు. ప్రస్తుతం సెకండ్‌వేవ్ మధ్యలో ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రానున్న రెండు నెలల్లో (సెప్టెంబర్, అక్టోబర్) పలు పండుగలు ఉన్నాయి. కాబట్టి మనం ఈ పండుగలను కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ జరుపుకోవాలి. లేకుంటే వైరస్ వేగంగా వ్యాప్తి చెంది కరోనా కేసులు పెరిగే ప్రమాదముంది’ అని తెలిపారు. కొద్దికాలం కిందట పండుగలు, ఇతర శుభకార్యాలు సందర్భంగా కరోనా మార్గదర్శకాలను పాటించకపోవడంతో కేసులు పెరిగిన విషయం మనకు తెలిసిందేనని చెప్పారు. దేశంలో 41 జిల్లాల్లో కరోనా వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా ఎక్కువగా ఉన్నదన్నారు. గతవారంలో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల్లో సగానికిపైగా కేసులు (58.4 శాతం) కేవలం కేరళలోనే వెలుగుచూశాయని రాజేశ్ భూషణ్ వెల్లడించారు. బుధవారం నుంచి గురువారం నాటికి 24 గంటల్లో 46,164 మందికి వైరస్ సోకిందని చెప్పారు.
కొవిషీల్డ్ డోసుల మధ్య వ్యవధి తగ్గింపు?
కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధిని కేంద్రప్రభుత్వం తగ్గించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేంద్రంలోని అత్యున్నత అధికారుల స్థాయిలో ఈ ప్రతిపాదన చర్చకు వచ్చినట్టు తెలుస్తున్నది. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్(ఎన్‌టీఏజీఐ)తో చర్చించి వ్యవధి తగ్గింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, ఎన్‌టీఏజీఐ చీఫ్ ఎన్‌కే అరోరా ఈ వార్తలను కొట్టిపారేశారు. ప్రస్తుతం 12-16 వారాల మధ్య వ్యవధితో కొవిషీల్డ్ టీకా డోసులు ఇస్తున్నారు.