కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందని హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్ రోడ్డు నంబరు-10లోని పంచవటికాలనీని కార్పొరేటర్ మన్నె కవితారెడ్డితో కలిసి సందర్శించారు. కాలనీలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి కావడంలో స్థానికులను ఆమె అభినందించి కమిటీ ప్రతినిధులకు జీహెచ్‌ఎంసీ ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
అనంతరం రోడ్డు నంబరు-7లోని గతి ప్రభుత్వ పాఠశాల గదుల్లో రసాయనాల పిచికారీని ఆమె పరిశీలించారు. ఇబ్రహీంనగర్‌లోని వ్యాక్సినేషన్ శిబిరాన్ని వారు సందర్శించారు. గతేడాది కరోనాతో కారణంగా చనిపోయిన ఉపాధ్యాయులు మాధవి, రాజ్‌కుమార్ కుటుంబాలను ఆదుకోవాలని పాఠశాల ఉపాధ్యాయులు మేయర్ దృష్టికి తెచ్చారు.
ఈ మేరకు పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బస్తీల్లో, కాలనీలో ముమ్మరంగా చేపట్టిన వ్యాక్సినేషన్ శిబిరాలను స్థానికులు వినియోగించుకోవాలన్నారు. కొవిడ్ నివారణ చర్యలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందన్నారు.
సెప్టెంబర్ ఒకటి నుంచి విద్యాసంస్థలు తెరుస్తున్న దృష్ట్యా విద్యార్థులు కొవిడ్ బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది, కాలనీవాసులు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.