ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

కడగండ్లు తీర్చే జలాలు.. కాలయాపనతో కడలి పాలు

సముద్రంలో వృథాగా కలుస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌ వినియోగించుకున్న కృష్ణా వరద నీటిని నికర జలాల వాటా కింద లెక్కించాలని తెలంగాణ సర్కార్‌ డిమాండ్‌ చేస్తుండటాన్ని నీటిపారుదలరంగ నిపుణులు తప్పుబడుతున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల గేట్లను ఎత్తివేసి ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలో కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాల్లో ఎవరు వరద జలాలను మళ్లించినా వాటిని లెక్కలోకి తీసుకోరాదన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిస్తున్నారు. ఇది దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసేందుకు బాటలు వేస్తుందని స్పష్టం చేస్తున్నారు.

ఈ వివాదం పరిష్కారంలో కృష్ణా బోర్డు కాలయాపన చేస్తుండటాన్ని ఆక్షేపిస్తున్నారు. 2019–20లో కృష్ణా నదికి భారీ వరద రావడంతో ప్రకాశం బ్యారేజీ ద్వారా పెద్ద ఎత్తున వరద జలాలు సముద్రం పాలయ్యాయి. ఈ సమయంలో రెండు రాష్ట్రాల్లో వరద జలాలను ఎవరు మళ్లించినా లెక్కలోకి తీసుకోరాదని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనిపై తెలంగాణ సర్కార్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వివాదాన్ని పరిష్కరించాలని కేంద్ర జల్‌ శక్తి శాఖను కృష్ణా బోర్డు కోరింది. 

మూడు నెలల్లో తేల్చుతామని.. 
కృష్ణా వరద జలాల మళ్లింపుపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని 2019 డిసెంబర్‌లో కేంద్ర జల్‌ శక్తి శాఖ ఆదేశించడంతో పీపీవో సీఈ శరణ్‌ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటైంది. మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని పేర్కొనగా కేవలం ఒక్క సమావేశాన్ని మాత్రమే నిర్వహించిన కమిటీ ఇంతవరకూ కనీసం ప్రాథమిక నివేదిక కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఫలితంగా గతేడాది, ప్రస్తుత నీటి సంవత్సరంలోనూ ఈ వివాదం అపరిష్కృతంగా ఉంది. దీనివల్ల రెండు రాష్ట్రాలు నష్టపోతున్నాయని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

ఆవిరైన నీళ్లలో సగమైనా సీమకు దక్కలేదు.. 
రాయలసీమ ప్రజల త్యాగాల పునాదులపై శ్రీశైలం ప్రాజెక్టు ఆవిష్కృతమైంది. 1984–85 నుంచి 2003–04 మధ్య అంటే రెండు దశాబ్దాల్లో శ్రీశైలం ప్రాజెక్టులో ఆవిరైన జలాల్లో (349.61 టీఎంసీలు) కేవలం 45.93 శాతం (160.61 టీఎంసీలు) నీళ్లు మాత్రమే రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సరఫరా కావడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు మాత్రమే ఉండటం. అదీ ప్రాజెక్టులో 881 అడుగుల్లో నీటి మట్టం ఉన్నప్పుడే ఆ మాత్రం జలాలైనా కాలువలకు చేరేవి. 

కడలి పాలైన నీళ్లతో పోలిస్తే సీమకు 22.55 శాతమే.. 
రాయలసీమ దయనీయ స్థితిని చూసి చలించి వరద నీటిని ఒడిసి పట్టి కరువు సీమను సుభిక్షం చేసేందుకే దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచే పనులను 2004లో చేపట్టారని సాగునీటి రంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఫలితంగా 2004–05 నుంచి ఇప్పటివరకూ అంటే గత 16 ఏళ్లలో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు 1,402.48 టీఎంసీలు చేరాయి. ఇదే సమయంలో ప్రకాశం బ్యారేజీ నుంచి 6,220.301 టీఎంసీల జలాలు సముద్రంలో కలవడం గమనార్హం. అంటే కడలిలో కలిసిన జలాలతో పోలిస్తే కేవలం 22.55 శాతం మాత్రమే సీమ, నెల్లూరు జిల్లాలకు దక్కినట్లు స్పష్టమవుతోంది.  

వరద జలాలను మళ్లిస్తే తప్పేమిటి? 
‘వృథాగా సముద్రంలో కలిసే కృష్ణా వరద జలాలను వినియోగించుకుంటే తప్పేమిటి? వరద నీటిని ఏ రాష్ట్రం వినియోగించుకున్నా నికర జలాల కోటా కింద లెక్కించకూడదు. వృథా అయ్యే నీటిని లెక్కించడంలో అర్థం లేదు. తెలంగాణ సర్కార్‌ది వితండ వాదన. వరద జలాలను రెండు రాష్ట్రాలూ  మళ్లించుకుంటే దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయవచ్చు. ఈ వివాదం పరిష్కారంలో సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డు కాలయాపన చేస్తుండటం దురదృష్టకరం’  
– ఎం.వెంకటేశ్వరరావు, రిటైర్డ్‌ ఈఎన్‌సీ